అవును.. మాంత్రికుడి ప్రాణం చిలకలో లేదు..! వాడి మర్మం, మంత్రం, ప్రాణం... అంతా కొందరి వెర్రి నమ్మకంలో ఉంది. కూటి కోసం.. లూటీ కోసం... ఈ మూఢత్వాన్ని జనాల్లో బతికించుకునేందుకు కోటి విద్యల్ని వాడు ప్రదర్శిస్తాడు. వాస్తవాల్ని తెలుసుకోకుండా కట్టుకథలు ఎప్పటికప్పుడు కొత్తగా అల్లేస్తుంటాడు. పాతవాటిని మరింత నమ్మేలా స్యూడోసైన్స్ను వాడేస్తుంటాడు. ఏదో డీకోడ్ చేసినట్టు ఇప్పటి ఆవిష్కరణలకూ, సైన్సు సంగతులకూ పాతవాటిని బలవంతంగా ముడివేస్తుంటాడు. ఏదోలా అన్వయించి నొసలెగరేస్తాడు. ఈ జిత్తులమారి ఎత్తుల్ని ఎదుర్కునేందుకు శాస్త్రీయ దృక్పథమొక్కటే పైఎత్తు. సైంటిఫిక్ టెంపరమెంట్.. అనేది పౌరుల బాధ్యత. అది దాటి చాలా చాలా ముఖ్యమైన, ప్రాధాన్యమున్న మానవ హక్కు..! దేశాన్ని మూఢత్వంతో వేల ఏళ్లు.. కుదిరితే మధ్య యుగాల వరకూ, రాతి గుహల జీవనం దాకా వెనక్కుమళ్లించే శక్తులు పెరుగుతున్న కాలంలో మనం 69వ గణతంత్ర దినోత్సవం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా... రాజ్యాంగంలోని 51ఎ ఆర్టికల్.. ప్రతి పౌరుడికి అప్పజెప్పిన బాధ్యత ఏంటో..? ఇప్పుడు దాని అవసరం ఎంతో..? తెలియజెప్పే ప్రయత్నమే ఈ వారం అట్టమీది కథ.
కవర్‌పేజీ మీద మీరు చూసిన చిలక అమెజాన్ అడవుల్లో సంచరిస్తుంది. మనదేశంలో దీని జాడే లేదు. ఒకవేళ ఇదే కనుక ఇక్కడే ఉండి ఇక్కడి మాంత్రికుడికి ముందే తెలిస్తే..! మన జాతీయ జెండా.. దాని మూడు రంగులకో కథ తయారయ్యేది. ఏదో అతీతపాత్ర ఆ చిలకని నిమిరేది. అందుకే, దానికి అలాంటి రంగులు వచ్చాయని ప్రచారం సాగేది. ఒకప్పటివారికి అంతగా శాస్త్రీయ దృక్పథం బలపడలేదు.. ఇంత పరిజ్ఞానమూ అందుబాటులో లేదు కదా..! పిట్టలు, ఉడతలు, పళ్లు, కొండలు, నదులు ఇలా సమస్తమంతటికీ వారు కథలల్లడంలో తప్పులేదు. కానీ, ఇప్పుడు గానీ, మనం దాన్ని నమ్మితే..! ఎంత నష్టం..? ఎంత వెనుకబాటుతనం...? సరిగ్గా.. ఇదే ఇప్పుడు దేశంలో ఎక్కువగా జరుగుతోంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తల సమావేశంలోనూ తాటాకుల్లో విమానాలు ఎగరేస్తున్నారు. పాఠ్యపుస్తకాల్లోంచి శాస్త్రీయతని చింపేస్తున్నారు. ప్రపంచదేశాలు నవ్విపోతాయి గనుక సైన్సు, మేథమేటిక్స్ వంటి సబ్జెక్ట్స్‌ని పూర్తిగా తీసేయలేక సగానికి సిలబస్ కుదించే ప్రయత్నం జరుగుతోంది. ఆధునిక సాంకేతిక పరికరాలు, సైన్సు సూత్రాలనే ఉపయోగించి కన్నుగప్పి అతీత శక్తులని బురిడీ కొట్టించడం చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవే ఫీట్లని ఇంద్రజాల ప్రదర్శనలుగా చూపిస్తారు. మైండ్ఫ్రీక్, గ్రేట్ మెజీషియన్ అని ఆటోగ్రాఫ్‌లు తీసుకుని వదిలేస్తారు. లేదా ఓ సెలెబ్రెటీకిలాగు అభిమానం వరకూ ఉంచుకుంటారు. అంతేగానీ, మూర్ఖంగా భక్తులైపోరు. వెర్రిగా నమ్మేసి బానిసలైపోరు.
గాల్లో లావుపాటి ఏనుగు సీతాకోక చిలక రెక్కలతో ఎగిరే దృశ్యం... మనింట్లో చిన్నారి ఊహ..! గువ్వల్లా ఎగరాలని ఆ లేత మనసుల ఆరాటం. అంతమాత్రాన వారికి ఏరోడైనమిక్స్ రెక్కలొచ్చేశాయని అంటే ఎలా..? ఒకప్పుడూ అంతే..! నేల మీద, నీటి మీద నడిచే వాహనాలున్నప్పుడు గాల్లో ఎందుకుండకూడదనేది ఊహ..! దాని మీద ఫిక్షన్ వస్తుంది. ప్రయత్నం జరుగుతుంది. వైఫల్యాలూ ఉంటాయి. తర్వాతి తరాలకు ఊహలైతే యథాతథంగా అందివస్తాయి గానీ, అప్పటి ప్రయత్నాలు, ప్రయోగాలూ ఇప్పుడూ అందిస్తామంటే... అవే వైఫల్యాలూ ఇప్పుడూ ఉంటాయి. కానీ, ఎప్పటినుంచో ఉన్న ఆలోచనని పెంచి శాస్త్రీయంగా ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి.. ప్రయోగాత్మకంగా విజయవంతమైతేనే... సైన్స్ సమాజం దాన్ని ఆమోదిస్తుంది. ఈ తరహా పరిణామ వికాసాన్నే శాస్త్రీయ దృక్పథాన్నే సమాజంలోకి తేవాలనేది.. 51ఎ చెబుతోంది. భారతీయ పౌరుడు మరింత మానవీయంగా, సంస్కరణవాది అయ్యి, హేతువాదంతో శాస్త్రీయదృక్పథంతో... దేశాన్ని ముందుకు నడిపించాలనేది రాజ్యాంగం అప్పజెప్పిన బాధ్యత, అందించిన స్ఫూర్తి. సరిగ్గా ఇక్కడే మాంత్రికుడి దాడి జరుగుతోంది. జనాలకు లాజిక్లొద్దు.. మ్యాజిక్లే కావాలనే ఓ ఫక్తు సినిమా డైలాగు బాగా గుర్తొస్తోంది కదూ..!
ప్రతిదీ పరిణామంలో...
ఓ యాపిల్... చెట్టు నుంచి రాలింది. ఒకడు గట్టిగా పట్టించుకున్నాడు. కొన్ని విశ్వ సూత్రాలు మానవాళికి అర్థమయ్యాయి. కొన్నిరోజుల క్రితమే ఆ గతి సూత్రాలతో నడిచిన ఓ అంతరిక్ష వాహనం చందమామ మీదకు పత్తి విత్తుని మోసుకెళ్లింది. చంద్రుడి మీద తొలిసారి జీవం వికసించడం మనమంతా చూశాం..! చైనా సాధించిన ఈ అద్భుతంలో ఓ గొప్ప ప్రయత్నముంది. చాంగ్యి-4 అనే ఈ లూనార్ రోవర్ చంద్రుడి మీదకు మట్టి.. రేప్‌సీడ్ ఆయిల్ (ఓ రకం నూనె) మొక్కలు, పత్తి విత్తనాలు, బంగాళదుంపలు, పళ్లమీద వాలే ఈగల గుడ్లు, వ్యర్థాల్ని భక్షించే ఈస్ట్లున్న ఓ ఎయిర్‌టైట్ కంటైనర్‌ను మోసుకెళ్లింది. నీరు, ఇతర పోషకాలూ ఉంటాయి. ఇదంతా ఎందుకంటే... అక్కడో జీవావరణ ప్రయోగం జరుగుతోంది. తొలిసారిగా అక్కడ పత్తిమొక్క మొలచి తొలి అడుగుపడింది. పూర్తి ప్రయోగం విజయవంతమైతే... చంద్రుడి మీద మనకో కాలనీ రూపొందించే ఓ గొప్ప ప్రాజెక్ట్ సుసాధ్యం కానుంది. తర్వాత దాన్ని మార్స్ వరకూ తీసుకెళ్లే ప్రయత్నం పెరగనుంది. ఇదీ శాస్త్రీయ దృక్పథం అందించే గొప్ప భవిష్యత్తు. ఇతర గ్రహాలు, ఉపగ్రహాల్లోనే కాదు... మన సొంతిల్లు భూమ్మీద కూడా మనం, ఇతర జీవజాలం మనుగడకు కావాల్సిన ఆలోచనతీరునీ అది అందిస్తుంది. ఓజోన్ పొరని కాపాడుకునే ప్రపంచ బాధ్యత నుంచి మనూరి దగ్గరలోని అడవినీ సంరక్షించుకునే స్పృహనీ అదే కలిగించింది. అందుకే ఇంకా మనం శ్వాస పీల్చుకోగలుగుతున్నాం. పగటిపూట తిరగగలుగుతున్నాం..! ఇప్పుడు కొన్ని రాజకీయ విధానాలూ పర్యావరణ పరిరక్షణని గట్టిగా పట్టించుకుంటున్నాయి. ప్యారిస్ ఒప్పందం నుంచి దూరం జరిగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడితో వైట్‌హౌజ్ ఎదుట ఓ మొక్క నాటించిన రాజకీయ పరిణామాల్ని... పర్యావరణాన్ని కాపాడుకోవడం తమ సిద్ధాంతాల్లో ఒకటని ప్రకటిస్తున్న స్థానిక రాజకీయ పార్టీలనీ చూస్తున్నాం.
అర్థంకాకపోతే అతీతశక్తేనా..!
వచ్చే కలల మీద, పిలిచే పేర్ల మీద... నడిచే దిక్కుల మీద వ్యాపారం ఊపందుకుంది. విపరీత ప్రచారంలోకి వచ్చింది. ఈ-మెయిల్స్ నుంచి ఫేస్బుక్ పోస్టుల వరకూ మూఢత్వం విస్తరిస్తోంది. కానీ, ఈ డిజిటల్ తరానికి అవసరమైన ఏ పరికరం, సాంకేతికత... కలలు, పేర్లు, దిక్కుల మార్పులతో సాధ్యం కాలేదు. పైన చెప్పుకున్నట్టే 'ట్రయల్ అండ్ ఎర్రర్' పద్ధతిన కొన్ని వేల, లక్షల శాస్త్రీయ ప్రయోగాలతో కొన్ని వందల ఏళ్లుగా మానవాళి చేస్తోన్న నిర్విరామ కృషి వల్లేనే సాధ్యమైంది. మన చేతుల్లోని స్మార్ట్‌ఫోన్ ఆ రూపుకు రావడానికి ఎంత ప్రయత్నముందో ఓసారి చుక్కలన్నింటినీ కలిపి చూడండి..? అతీత శక్తులు, మాయలు-మంత్రాల మీద నమ్మకం కోల్పోతారు..! మనిషి మేధోవికాసం, శ్రమ మీద గౌరవం పెంచుకుంటారు. అదే ఫోన్‌ని.. ఆధునికతతో సంబంధంలేని ఓ సమూహానికిచ్చి చూడండి. వెంటనే మీరు దేవుడో, మాయావో అయిపోతారు. సరిగ్గా ఇలాంటి విషయమే ఓ ఆఫ్రికా ప్రాంతంలో జరిగింది. కొన్నేళ్ల క్రితం యుద్ధవిమానాల నుంచి ప్యారాచూట్లలో దిగిన సైనికుల్ని చూసి ఊర్ధ్వలోకానికి చెందిన దైవసమానులుగా ఓ తెగవాళ్లు గుహల్లో, రాతి బండలపై చిత్రాలను గీసి మొక్కారు..! వారి జానపద గాథల్లో ఓ అత్యంత శక్తిమంతుడైన కొత్త దేవుడి కథ సిద్ధమైపోయింది. ఈ కథ వినగానే.. గతంలో కొలంబస్ అల్లిన మరో కథ గుర్తొచ్చే ఉంటుంది. 1504 మార్చి 1న జమైకా మూలవాసులకు అర్థంకాని, తెలీని సూర్యగ్రహణ శాస్త్రీయ పరిణామాన్ని కొలంబస్ ముందే అంచనా వేసి బతికిబట్టకట్టాడు. వారి ఆరాధ్యదైవమైన ఖగోళ వస్తువు సూర్యుని మింగేస్తానని వారితో కావాల్సిన పనులన్నీ చేయించుకున్నాడు. శాస్త్రీయ దృక్పథం ఉంటే, లేకపోతే ఏమవుతుందో ఇదో చక్కటి ఉదాహరణ. వారంటే.. అప్పుడంటే... చాలా విషయాలు తెలీవు. ఇవన్నీ నడిచిపోయాయి. కానీ, ఇప్పుడు సమాచార విప్లవ యుగంలో ఉన్నాం..! దశాబ్దాలు గడుస్తున్నా ఫ్రాయిడ్, కార్ల్ జంగ్లు అందించిన సైకోఅనాలసిస్, డ్రీమ్ ఇంటర్‌ప్రిటేషన్ వంటి మానసిక శాస్త్ర సంగతులే ఇంకా సామాన్యుడికి చేరలేదంటే ఎంత వెనుకబడిపోయామో అర్థంచేసుకోవచ్చు. సైంటిఫిక్ టెంపరమెంట్ ఉన్న వ్యక్తిని ఏ పీడకల, ఏ చెడ్డ పేరూ, ఏ ఈశాన్య దిక్కూ బాధించవు.. భయపెట్టవు. ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా విశ్లేషించుకుని జీవితంలో ముందడుగేస్తాడు.
వెనుకా ముందూ ఆలోచిస్తే...
జీవ పరిణామ సిద్ధాంతానికి చెందిన పాఠ్యాంశాల్ని ఎత్తివేసే కుట్రలు జరుగుతున్నాయి. కానీ, నిరుడేడాదే... 2018 రసాయనశాస్త్ర నోబెల్ దక్కింది ఆ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్న ఓ ప్రయోగానికే. 'డైరెక్టెడ్ ఎవల్యూషన్' పద్ధతిలో కొన్ని రకాల సూక్ష్మజీవుల్లో మార్పులు చేసి.. మనకు క్లీన్ బయోఫ్యూయెల్స్ని అందించడానికి ఉపయోగపడిందిది. అలాగే, సోరియాసిస్ లాంటి వ్యాధులకు చికిత్సచేసే మందుల తయారీకి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ఇలాంటి రోగాలున్నవారి పరిస్థితి అర్థంచేసుకోకుండా ఏవో క్షుద్రశక్తులు, మూఢనమ్మకాల్ని అంటగట్టి నిప్పంటించిన రోజులున్నాయి. ఒక్క శాస్త్రీయ దృక్పథం ఎంత మార్పు తెస్తుందో అర్థమవుతోంది కదూ..! నెల్సన్ మండేలా తోటి విప్లవ ఖైదీ చినవా అబె 'థింగ్స్ ఫాల్ అపార్ట్' కథలో ఆఫ్రికాకు చెందిన ఓ మూఢవిశ్వాసాన్ని చెబుతాడు. కవలపిల్లల్ని దెయ్యాలుగా చిత్రీకరించి బాలింతల్ని కూడా అడవుల్లో వదిలేసే విషయం ఒళ్లు గగుర్పొడుస్తుందందులో. కానీ, ఇప్పుడు కవల పిల్లలంటే అదో అరుదుగా దక్కే బహుమతి. ఐవీఎఫ్ ఇతర కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో కొందరు తల్లిదండ్రులు ఒకేసారి చెరొకరిని కనాలనే ఉత్సాహం చూపుతున్నారు..! కవలల్ని అంత ఇష్టపడే, ప్రేమించేంత మార్పు ఏది చేసింది. మన దృక్పథమే..! అని మరోమారు చెప్పక్కర్లేదు. సతీ సహగమనం చేసిన ఘోరాలు మనకిప్పుడు అనుభవపూర్వకంగా తెలీకపోవచ్చు కానీ, ఆ మధ్య విడుదలైన 'పద్మావత్' చిత్రంతో రాజుకున్న వివాదం ఈ అంశాన్ని ఎండగట్టింది. ఆ కథాకాలంలోనే.. రాజస్థాన్‌కు అటు చివరనున్న బెంగాల్లో ఓ వర్గపు పురుషుడికి యజ్ఞయాగాదుల అనంతరం వందల సంఖ్యలో ఆడపిల్లల్ని పెళ్లిళ్లు చేసే తంతు జరిగేది. వారంతా వేర్వేరు ఊళ్లలో సుదూర ప్రాంతాల్లో ఒంటరిగా ఉండే సందర్భాలే ఎక్కువ. సాధారణంగా వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే. ఒకవేళ భర్త మరణిస్తే అక్కడి వరకూ వెళ్లలేని దుస్థితి. అందుకే, గుర్తున్నంతమంది భార్యల వరకూ అతడి వస్త్రంలోని ముక్కల్ని అత్తింటివారు పంపేవారు. ఆ గుడ్డముక్కను మీదేసి ఆడపిల్లల్ని కాష్టం ఎక్కించేవాళ్లు. ఇదంతా మరణానంతర ఉన్నత జీవితమేదో ఉందనే భ్రమ వల్లే..! రవీంద్రనాథ్ టాగూర్ ఓ మాట చెబుతాడు.. రేపటికాలంలో నీడ పొందలేరని తెలిసినా ఎవరైతే విత్తు నాటి తర్వాతి తరానికి చెట్టు పెంచాలనుకుంటాడో వాడే ధన్యుడని అంటాడు. చనిపోయాక కూడా స్వర్గసుఖాలనే కాన్సెప్ట్ చేసిన అరాచకం అంతాఇంతా కాదు. కేవలం మానవతావాదం ఒక్కటే ఒక తరాన్ని తర్వాతి తరాల కోసం గొప్ప ప్రయత్నాలు చేసేందుకు సమాయత్తం చేస్తుంది. సరిగ్గా ఆలోచిస్తే ఇది కూడా శాస్త్రీయ దృక్పథమే. కృత్రిమ మేధ పతాకస్థాయికి చేరిన ఓ ఆండ్రాయిడ్ రోబో ఎలా స్విచాఫ్ అవుతుందో, దాని సర్క్యూట్, సాఫ్ట్వేర్, ఇతర వ్యవస్థల్లో లోపాలొస్తే ఎలా చెడిపోతుందో.. ఏదైనా ప్రమాదంలో ఎలా చిధ్రమవుతుందో మనిషి కూడా అంతే అనే స్పృహ సమాజంలో త్వరలోనే మరింత స్పష్టమవనుంది. కొన్ని సాఫ్ట్వేర్ల రూపంలో మనిషితనాన్ని స్టోర్ చేసి తిరిగి ప్రవేశపెట్టే టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. కొన్ని అరుదైన కేసుల్లో శరీరాన్ని ఫ్రీజ్ చేసి భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే చికిత్సవిధానాలతో తిరిగిబతికించుకునే, చావుని రివర్స్ చేసే... ఇలా ఎంతోముందుకు పరిశోధనలు పోతున్నాయి. ఒకరి తలను మరొకరి కాయానికి అతికించే రోజూ రానుంది. ఇవన్నీ ముందే రాసేశారు, చెప్పేశారు... అంటే హాల్లో సైన్స్‌ఫిక్షన్ సినిమాని జస్ట్ చూసి ఆనందించకుండా.. 3డి కళ్లద్దాల్ని అలానే ఉంచేసుకోవడం, వీఆర్ బాక్స్‌లోనే ప్రపంచాన్ని ఇరికించేసుకోవడం అవుతుంది.
ఊహలు ఓకే.. ప్రయత్నమేదీ...!
కొన్ని గొప్ప ఊహలు, సృజనాత్మకతలు, కలలు మనిషికి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఏది శాస్త్రీయంగా వాస్తవికంగా సాధ్యమవుతుందో..? అనేదే చివరకు గెలుస్తుంది.. నిలుస్తుంది. ఇదే విషయాన్ని జీవన విధానంగా మార్చుకోవడమే సైంటిఫిక్ టెంపర్మెంట్. దేశాభిమానం గుండెల్లో ఉప్పొంగినప్పుడల్లా మూఢత్వాన్ని నిశ్వాసించే పౌరుడే ఈ దేశానికి కావాలి. అవును.. మనం ప్రపంచానికి ఎంతో విలువైన 'సున్నా'ను అందించాం. గణిత మేధావుల్ని తయారుచేశాం. వందల ఏళ్ల క్రితమే ఖగోళవస్తువుల్ని పరిశీలించినవారినిచ్చాం. కానీ, ఆ కొందరి సిద్ధాంతాలు, వాదనల్ని తర్వాతి కాలంలో ఆధ్యాత్మికత వైపు తిప్పి అక్కడే ఆపేశాం. మన చుట్టూ ప్రపంచం ఇదే స్తబ్ధతని, తిరోగమనాన్ని విసిరికొట్టి చాలా ముందుకెళ్లిపోయిన వాస్తవాల్ని కావాలనే విస్మరిస్తున్నాం. ఎప్పుడో గెలీలియో అంతరిక్షాన్ని ఓ చిన్న అద్దం ముక్కతో దగ్గరగా చూశాడు. ఆ సంభ్రమాన్ని అందరికీ చెప్పాడు. శాస్త్రీయ ప్రపంచపు చేతికి టెలిస్కోప్ దొరికింది గానీ, దైవవిశ్వాసకుల మౌఢ్య మూక శాస్త్రీయ దృక్పథమున్న ఓ అమూల్యమైన బుర్రని చెరసాలలో బంధించి చంపింది. కానీ, సైన్స్ ప్రస్థానం అక్కడితో ఆగిపోయిందా..? ఆ మహామేధావి స్ఫూర్తితో మనకెంతోమంది గొప్ప శాస్త్రవేత్తల్ని అందించింది. వారి ఆవిష్కరణలతో ప్రపంచాన్ని మార్చేసింది. ఒకప్పుడు గెలీలియోలాంటి వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన అదే మౌఢ్య మూక ఇప్పుడు చిన్నారులు చప్పట్లు కొట్టి చూసే కైలడోస్కోప్లోని చిత్రాలకూ అతీతశక్తుల్ని ఆపాదించి దేశం మొత్తాన్ని అశాస్త్రీయత వైపు నడిపిస్తోంది. ఓ పెద్ద భావజాల జైలుని సిద్ధంచేస్తోంది. అవును.. మాంత్రికుడి ప్రాణం చిలుకలో లేదు. ఉండదు కూడా..! మీరు అట్టమీద చూసిన చిలక జీవితకాలం కేవలం 30 ఏళ్లే. మరి ఈ అశాస్త్రీయ సమాజానికీ.. దాన్ని ఆడిస్తున్న మౌఢ్యమనే మాంత్రికుడికీ వేల ఏళ్లు..! చిలుక కంటే మనిషి జీవితకాలం ఎక్కువ. ఇది శాస్త్రీయ అవగాహనే. ఈ మూడు రంగుల చిలుక ఒక్క అమెజాన్‌లో ఎందుకుంటుందనేది సహేతుకంగా వివరించేది ఒక్క శాస్త్రీయ దృక్పథమే. మీరూ తర్వాతి తరాల నీడపట్టు కోసం రవీంద్రుడు కోరినట్టు శాస్త్రీయ దృక్పథమున్న చెట్టు నాటాలంటే... చిన్నతనంలోనే అతీతశక్తుల వెర్రి నమ్మకాల్ని, దైవభావజాలాన్ని అందించే పేర్లని, మంత్రాల్ని, ప్రార్థనల్ని కాక ఓ స్టీఫెన్ హాకింగ్ని పరిచయం చేయండి. నీల్ డిగ్రాస్సె టైసన్ సైన్స్ యాత్రలో నడిపించండి. మరో విశ్వసూత్రం కోసం న్యూటన్ ఆలోచనాశక్తిని యాపిల్ పండు తినిపిస్తూ చెప్పండి. అన్నట్టు చెప్పడం మరిచిపోయాం... మనదేశానికి శాస్త్రవేత్తల కొరత చాలా ఎక్కువ ఉందని ఈ మధ్యే ఓ వార్త. వీలైతే సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉన్న తరాన్నే కాక, దేశావసరాలకు మరికొంతమంది సైంటిస్ట్‌లు తయారయ్యేలా బాధ్యతగల పౌరుల్లా మెలగండి. ప్రఖ్యాత శాస్త్రవేత్త మ్యాక్స్ ప్లాంక్ వినడానికి కరుగ్గా ఉండే ఓ మాట అంటాడు... 'ఒక్కోసారి ఓ కొత్త శాస్త్రీయ వాస్తవం.. దాని వ్యతిరేకుల్ని ఒప్పించి వారు వెలుగుని చూసేలా చేసి గెలవదు.. కానీ, దాని వ్యతిరేకులు క్రమంగా చనిపోయి.. ఆ శాస్త్రీయ వాస్తవాన్ని బాగా గ్రహించి ఎదిగే కొత్త తరంతో అది విజయవంతం అవుతుంది.' అని. మనలో మూఢత్వం మరణించడానికే మనం అవకాశమిద్దాం. మాటల్లో ఓ మిత్రుడు అంటాడు... 'పాతాళ భైరవి' సినీ మాయలో మాంత్రికుడు హీరోనీ, ఇన్ఫర్మేషన్నీ బూడిద కొట్టి చూస్తాడట..! మనకూ ఇలాంటిదే గూగుల్ లేదా మరోటి ఉంది. దాన్ని శాస్త్రీయ పరిజ్ఞానం తయారుచేసింది. మరి, బూడిద కొట్టి గూగుల్‌లా చూపించే మాయల మరాఠి ఎక్కడా కనబడడే..! అని. కరెష్ఠే కదా..!
- అజయ్ కుమార్ వారాల
95023 95077