విజయపురి పట్టణానికి తూర్పువైపు బకాసురయ్య, పడమటివైపు వక్ర శీనయ్య అనే ఇద్దరు పాల వ్యాపారస్తులు ఉండేవారు. వీరిద్దరూ చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పాలను సేకరించి విజయపురి పట్టణంలో చిల్లర వ్యాపారస్తులకు పాలను విక్రయించేవారు. పసిపిల్లలనుంచి ముసలివారి వరకు పాలను పౌష్టికాహారంగా భావిస్తారు. అలా ప్రతి ఇంటి వారు పాలను కొనుగోలు చేయ సాగారు. బకాసురయ్య పాల వ్యాపారంతో బాగా ఎదగడం చూసి వక్రశీనయ్యకు ఆశ్చర్యం వేసింది.
ఒక రోజు వక్ర శీనయ్య బకాసురయ్య దగ్గరకు వెళ్లి ''మన మిద్దరం ఇంచుమించు ఒకే సమయంలో పాల వ్యాపారం ప్రారంభించాం. కానీ నీవు అతి తొందరలో పెద్ద ధనవంతుడివయ్యావు.ఆ రహస్యం నాకూ చెబితే నేను ధనవంతుడినవుతాను'' అని అడిగాడు.
''వక్ర శీనయ్యా, నేను పాలలో నీళ్లు కలుపుతాను. అందువల్లే అతి తొందరలో ధనవంతుడినయ్యాను.''అంటూ అబద్ధం చెప్పాడు బకాసురయ్య.
ఆ మాటలు నమ్మి వక్రశీనయ్య పాలలో నీళ్లు కలిపి అమ్మడం ప్రారంభించాడు.
వక్రశీనయ్య దగ్గర పాలు కొనే వారందరు పాలు నీళ్లలా ఉన్నాయని అతని దగ్గర కొనే చిల్లర వ్యాపారస్తులు గొడవచేసేవారు.అయినా నీళ్లు కలపడం మానుకోలేదు. ఫిర్యాదులు చేసినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదన్న నిర్ణయానికి వచ్చిన కొందరు చిల్లర వ్యాపారస్తులు దూరమైనా శ్రమ అనుకోకుండా బకాసురయ్య దగ్గరకు వెళ్లి పాలను కొనేవారు. మరికొంత మంది చిల్లర వ్యాపారస్తులు అంత దూరం వెళ్లలేక ఆ నీళ్ల పాలు కొని అమ్మసాగారు.
విజయపురికి జయదేవుడు రాజుగా పదవి చేపట్టగానే తన రాజ్యంలో న్యాయం నాలుగు పాదాలతో నడిపించాలన్న ఆలోచన కలిగింది. మంత్రి సలహాతో న్యాయశాస్త్రం క్షుణ్ణంగా చదివిన పండితులను పిలిపించి వారికి పరీక్షలు పెట్టించారు.అందులో మొదటిగా నెగ్గిన సుబుద్ధిని న్యాయపరిపాలనాధికారిగా నియమించాడు.
సుబుద్ధి న్యాయ పరిపాలన మీద నమ్మకం కలిగిన చిల్లర వ్యాపారస్తులు ఒక్కటిగా కలసి వక్రశీనయ్య మీద ఫిర్యాదు చేశారు. న్యాయాధికారి ఉత్తరువు ప్రకారం సైనిక భటులు వక్రశీనయ్యను న్యాయాధిపతి ముందు హాజరు పరిచారు.
''వక్ర శీనయ్యా, నీవు పాలల్లో నీళ్లు ఎందుకు కలిపావో నిజం చెప్పావంటే తక్కువ శిక్ష పడేలా చూస్తాను లేదా నీవు కఠిన శిక్ష అనుభవించవలసివస్తుంది'' అన్నారు న్యాయాధిపతి సుబుద్ధి.
''అయ్యా, నాతో పాటు వ్యాపారం ప్రారంభించిన బకాసురయ్య పెద్ద ధనవంతుడు కావడం చూసి ఏదో నాకూ ధనవంతుడు కావాలన్న ఆశతో వాడిని కలిసాను. నీళ్లలో పాలు కలిపి వ్యాపారం చేసి ధనవంతుడు అయ్యానంటే నమ్మి నేను నీళ్లు కలిపి వ్యాపారం చేయడం ప్రారంభించాను. సగం మంది వ్యాపారస్తులు నా దగ్గర పాలు కొనడం మానివేసి ఆ బకాసురయ్య దగ్గరకు వెళ్లిపోవడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ పాల వ్యాపారంతో అంత పెద్ద ధనవంతుడయ్యాడో నాకే అంతు పట్టడంలేదు. కానీ వాడి దగ్గర పాలు చిక్కగా ఉందని అందరూ అంటుంటే మరి నా దగ్గర పాలల్లో నీళ్లు కలుపుతున్నట్టుగా ఎందుకు అబద్ధం చెప్పాడో ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ నీళ్ల పాల వ్యాపారం వల్ల నాకు చాలా నష్టమే కలిగింది .''అంటూ బాధగా చెప్పాడు.
''వక్ర శీనయ్యా చేసిన తప్పును నిజాయితీగా అంగీకరించావు కాబట్టి యాభై వరహాల జరిమానా విధిస్తున్నాను. జరిమానా చెల్లించి నీవు ఇంటికి వెళ్లి ఎప్పటిలా నీ పాల వ్యాపారం చేసుకోవచ్చు'' అన్నారు సుబుద్ధి. తనకు ఎటువంటి శిక్ష విధిస్తారో అన్న భయంతో వున్న బకాసురయ్య ఆ తీర్పు వినగానే సంతప్తి చెందాడు. జరిమానా చెల్లించి బ్రతుకు జీవుడా అని ఇంటి వైపు వెళుతూ ఇక ఎప్పటికీ పాలల్లో నీళ్లు కలపకూడదన్న నిర్ణయానికి వచ్చాడు.
గూఢఛారులను పిలిపించి బకాసురయ్య అభివృద్ధికి కారణమేమిటో తెలుసుకొని రమ్మని ఆదేశించాడు సుబుద్ధి .కొన్ని రోజుల వ్యవధిలోనే అసలు రహస్యం కనిపెట్టి న్యాయాధికారికి వివరంగా తెలిపారు.
న్యాయాధికారి ఆదేశానుసారం బకాసురయ్యతో పాటు అతని భార్య,అతని తల్లితండ్రులనుసైనిక భటులు తీసుకొని వచ్చారు.
'' బకాసురయ్యా నీవు ఇంతటి ధనవంతుడివి ఎలా అయ్యావో నిజం చెప్పావంటే తక్కువ శిక్ష పడేలా చూస్తాను.లేదా నీవు కఠిన శిక్ష అనుభవించవలసివస్తుంది.'' అన్నారు న్యాయాధిపతి సుబుద్ధి.
''అయ్యా కల్తీ వ్యాపారం చేసి ఎక్కువ ధనం సంపాదించాలన్న ఆశతో పలు గ్రంధాలను పరిశీలించి కల్తీ పాలు తయారుచెయ్యడం కనుగొన్నాను.ఆ కల్తీ పాల వ్యాపారంతో నేను గొప్ప ధనవంతుడినయ్యాను'' అన్నాడు బకాసురయ్య.
'' కల్తీ పాలు ఎలా తయారు చేస్తున్నావు'' అడిగాడు సుబుద్ధి.
''అయ్యా, పంది కొవ్వు కొన్ని విషమూలికలు కలిపి తయారు చేస్తాను. ఒక శేరు పాలతో పదిహేను శేర్ల పాలను తయారు చేసాను. పాలు తెల్లగా చిక్కగా ఉండటం వల్ల ఎవరికీ అనుమానం కలుగలేదు.''అన్నాడు బకాసురయ్య.
''ఈ కల్తీ పాలు వాడటం వల్ల ఎటువంటి క్లిష్ట సమస్యలు వచ్చాయో తెలుసా? అభం శుభం తెలియని కొంతమంది పిల్లలు మరణించారు..కల్తీ పాలు అన్ని విధాలా చాలా ప్రమాదం అన్న సంగతి తెలుసా? '' అడిగాడు సుబుద్ధి.
''బకాసురయ్యా నీవు చేసిన విషపూరిత పాల వ్యాపారానికి చాలా కఠినమైన శిక్ష విధించాలి. కానీ ఒక్క సారి ప్రశ్నించగానే నిజాన్ని చెప్పినందున నీకు శిక్ష తగ్గించాలనుకొంటున్నాను.న్యాయా శాస్త్ర గ్రంధాల ప్రకారం అందులో ఉన్న శిక్షను తగ్గించాలంటే రాజుగారి అనుమతి కావాలి.రెండురోజుల్లో వారి అనుమతి తీసుకొని నా తీర్పు చెబుతాను.అంతవరకు మీరందరూ చెరసాలలో ఉండండి.''అన్నాడు సుబుద్ధి.
ఆ మాటలు బకాసురయ్యాకు ఊరట కలిగించాయి. తనకు పెద్ద శిక్ష పడదనే భావనకు వచ్చాడు. రెండు రోజులు చెరసాలలో గడిపినతరువాత మూడవరోజు న్యాయపరిపాలనాధికారిముందు నిలబెట్టాయారు.
''బకాసురయ్యా ఒక హత్య చేసిన వాడికి మరణశిక్ష విధిస్తారు. నీ కల్తీ పాల వల్ల ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారో, ఎంత మంది మరణించారో సరిగ్గా నిర్ణయించ లేక పోతున్నాం. న్యాయ శాస్త్రంలో నీలాంటి వారికి నగరం నడి బొడ్డున ప్రధాన కూడలినందు నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టాలి. అలాగే నీ వ్యాపారంలో సహకరించిన నీ కుటుంబ సభ్యులకు ఉరిశిక్ష వెయ్యాలి.'' అన్నారు న్యాయాధిపతి సుబుద్ధి
'' శిక్ష తగ్గించమని.....''చేతులు జోడిస్తూ అడిగాడు బకాసురయ్య.
''శిక్ష తగ్గించడానికి అనుమతించారు. నీ కుటుంబ సబ్యులకు యావజ్జేవ కారాగారశిక్ష విదిస్తున్నాము. అలాగే వారంలో ఒకరోజు నగరం నడిబొడ్డులో ప్రధాన కూడలివద్ద నిన్ను నిలబెట్టి ప్రజలకు నిన్ను తిట్టేందుకు అనుమతించాలని రాజుగారు ఆదేశించారు అన్నాడు.
'' అయ్యా, నేను , ప్రధాన కూడలి మధ్యలో నిలబడలేను.నన్ను ముందుగానే ఉరితీయ్యండి''అంటూ భోరుమని విలపించాడు బకాసురయ్య .
ఇలా చేయడం వల్ల కల్తీ వ్యాపారం చెయ్యాలన్న తలంపు రాకుండా వ్యాపారస్థుల్లో కనువిప్పు కలుగుతుంది.''అన్నారు సుబుద్ధి.
- ఓట్ర ప్రకాశరావు
09787446026
కనువిప్పు (కథ)
