పర్వతారోహణం ఓ సాహసోపేతమైన క్రీడ. ఈ క్రీడలో కొనసాగుతున్న భారతీయుల సంఖ్య తక్కువనే చెప్పాలి. అలాంటి క్రీడలో అతిపిన్న వయసులోనే ఏషియన్ జూనియర్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు భరత్ పెరీరా. అంతేకాదు, ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న యూత్ ఒలింపిక్స్‌లో స్పోర్స్ట్ క్లైంబింగ్‌కు భారత్ తరపున ఎంపిక కావడం మరో విశేషం. అలాంటి తెగువున్న పర్వతారోహకుడు పెరీరా పరిచయం మీకోసం.
- భరత్ పెరీరా (17) బెంగుళూరులో జన్మించాడు. తండ్రి సుభాష్ పెరీరా.
- పిల్లల వికాసానికి క్రీడలు ఆవస్యకమనేది సుభాష్ ఆలోచన. చిన్నతనం నుంచే క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్ ఇలా వివిధ ఆటల్లో శిక్షణ ఇప్పించాడు. కానీ, భరత్‌కు మాత్రం ఇవేవీ నచ్చలేదు. అలా తన చిన్నారికి ఇష్టమైన క్రీడను తెలుసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు తండ్రి.
- ఓ రోజు బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వద్ద నుంచి నడుచుకుంటూ వెళుతుండగా అక్కడ కొందరు యువకులు ఒక ఎత్తైన గోడను చకచకా ఎక్కేస్తుండడాన్ని చూస్తూ ఉండిపోయాడు భరత్. అది తనను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక రోజు టీవీలో పర్వతారోహణకు సంబంధించిన ఒక డాక్యుమెంటరీని చూస్తున్న భరత్‌కు తనూ అలా పర్వతాలను ఎక్కేయాలనిపించిందట. ఆ విషయాన్నే తన తండ్రితో చెప్పడంతో ఆయన ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఎందుకంటే అప్పటికి భరత్ వయసు నాలుగు సంవత్సరాలు. అంత చిన్న వయసులో పర్వతారోహణం అంతతేలిక కాదనిపించింది. అయితే, భరత్ అభిరుచిని ప్రోత్సహించాలనుకున్న సుభాష్. అలా ఓ రోజు బెంగళూరులోని కంటీరవ స్టేడియంకు భరత్‌తో కలిసి వెళ్ళిన సుభాష్‌కు అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురయ్యింంది. క్లైంబింగ్లో శిక్షణ ఇస్తున్న కోచ్ కీర్తి పైస్‌ను కలిసి భరత్ గురించి చెప్పాడు. ఆయన ఒక టెస్ట్‌ను నిర్వహించాడు. ఆ టెస్ట్‌లో భరత్ ఒక నిలువాటి గోడకు అమర్చిన హుక్‌ల సాయంతో ఆ గోడపైకి ఎక్కాల్సి ఉంది. కోచ్ సూచనల అనంతరం టెస్ట్‌ను నిర్వహించారు. అలా టెస్ట్ మొదలైన కొద్ది సెకన్లలోనే టార్గెట్ పూర్తిచేసిన భరత్ తెగువేంటో సుభాష్‌తోపాటు కోచ్‌కు అర్థమైంది.అలా కీర్తి పైస్ వద్ద క్లైంబింగ్ శిక్షణ మొదలు పెట్టాడు. భరత్‌ను కోచ్ నగరంలో నిర్వహించే చిన్న చిన్న పోటీలకు పంపేవారు.
- రెండేళ్ళలో క్టైంబింగ్పై పట్టుసాధించిన భరత్ రాష్ట్రస్థాయిలో నిర్వహించిన వివిధ క్లైంబింగ్ పోటీల్లో పతకాలు గెలుచుకున్నాడు.
- 2008లో బాలిలో జరిగిన ఏషియన్ యూత్ స్పోర్ట్స్ క్లైంబింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో క్లైంబింగ్లో లీడ్, స్పీడ్, బౌల్డెరింగ్ మూడు విభాగాల్లోనూ రజత పతకాలను గెలుచుకున్నాడు. ఇది భరత్‌కు క్లైంబర్‌గా మంచి పేరుతెచ్చిపెట్టింది.
- 2010లో జకార్తాలో జరిగిన ఏషిియన్ చాంపియన్‌షిప్ క్రీడల్లోకి ప్రవేశించి లీడ్, స్పీడ్, బౌల్డెరింగ్ మూడు విభాగాల్లోనూ కాంస్య పతకాలను గెలుచుకున్నాడు. అప్పటికి తన వయసు పది సంవత్సరాలు. ఇలా తొలి ప్రయత్నంలోనే అంతర్జాతీయ స్థాయి పోటీలో విజయాన్ని సొంతంచేసుకున్న భరత్ కోచ్‌తోపాటు ఎంతోమంది ప్రశంసల్ని అందుకున్నాడు.
- 2015లో మలేసియాలో జరిగిన ఐఎఫ్ఎస్సి ఏషిియన్ యూత్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని రజతపతకాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాదు, ఈ పోటీల్లో అత్యంత వేగంగా కొండలపైకి ఎగబాకుతూ ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన భరత్‌కు స్పైడర్‌మ్యాన్ అనే బిరుదు లభించింది.
- 2017లో సింగపూర్‌లో జరిగిన ఏసియా యూత్ చాంపియన్‌షిప్ పోటీల్లో రెండు రజత పతకాల్ని సొంతం చేసుకున్నాడు.
- ఇక ఈ ఏడాది అక్టోబర్‌లో అర్జెంటినాలో జరగనున్న యూత్ ఒలింపింక్స్ మూడవ ఎడిషన్‌లో క్లైంబింగ్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు భరత్. భారత్ తరపున ఈ పోటీలకు ఎంపికైన క్రీడల్లో ఇతనే తొలి అభ్యర్థి కావడం మరో విశేషం.
- సినిమాలు చూడడం, కుటుంబ సభ్యులతో గడపడం భరత్‌కు ఇష్టమైన పనులు. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోడట. ఫిట్‌గా ఉండేందుకు వ్యాయామంతోపాటు లక్ష్య సాధనకు ఫోకస్ అవసరమంటాడు భరత్.
- ఒలింపిక్ స్థాయి క్రీడల్లో ప్రవేశించడానికి ఒక కఠిన ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అయితే, మనదేశంలో ఆ స్థాయిలో శిక్షణకు అవసరమైన సాధనాలు ఎక్కడా లేకపోవడం విచారకరం అంటాడు భరత్.
మన స్పైడర్ మ్యాన్
