ఏసియా జూనియర్స్ బ్యాడ్మింటన్ క్రీడల్లో ఒక ప్రతిష్టాత్మకమైన పోటీ. భారత్‌కు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశం 53 ఏళ్ళ క్రితమే దక్కింది. ఈ పోటీల్లో భారత్ విజేతగా నిలిచింది మాత్రం అరుదనే చెప్పాలి. అలాంటి ఒక అరుదైన ఖ్యాతిని ఇటీవల భారత్‌కు అందించాడు లక్ష్య సేన్. అంతే కాదు, బ్యాట్మింటన్ జూనియర్స్ విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన ముగ్గురు క్రీడాకారుల్లో లక్ష్య ఒకరు. ఇటీవల జకార్తాలో జరిగిన ఏసియన్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో మెన్స్ సింగిల్ విభాగంలో ప్రంపంచ బ్యాడ్మింటన్ జూనియర్స్ నెంబర్1 కున్లావుత్ విదిసర్న్ను ఓడించి జూనియర్స్ విభాగంలో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన లక్ష్యసేన్ పరిచయం ఈ వారం.
- లక్ష్య సేన్ ఉత్తరాఖండ్‌లోని అల్మొరా పట్టణంలో 2001 ఆగస్ట్ 16న జన్మించాడు.
- తండ్రి డి.కె సేన్ ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్. అన్న చిరాగ్ సేన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు.
- అన్న చిరాగ్ ఆటను గమనిస్తూ పెరిగిన లక్ష్య ఈ క్రీడపై ఇష్టాన్నిపెంచుకున్నాడు. అలా చిన్న వయసు నుంచే అన్న వద్ద బ్యాడ్మింటన్‌లో మెలకువలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు లక్ష్య .
- బడిచదువుతోపాటు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్‌కూ ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు.
- మలేసియాకు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చాంగ్ వెరు తన అభిమాన క్రీడాకారుడు.
్య లేజర్ ట్యాగ్ ఆటతోపాటు సినిమాలు చూడటం, మిత్రులతో గడపడం తనకు చాలా ఇష్టం.
- ఎన్నో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాడు లక్ష్య. అండర్-8 బ్యాడ్మింటన్ పోటీల్లో విజయం తనకు క్రీడపై మరింత లక్ష్యాన్ని పెంచింది. అప్పటికే ఒక దీర్ఘకాలిక వెన్నెముక నొప్పితో బాధపడుతున్నా తన ప్రాక్టీస్‌ను మాత్రం ఎప్పుడూ నర్లక్ష్యం చేయలేదు.
- ఆ తర్వాత ప్రకాష్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడెమీలో చేరి మరిన్ని మెలకువలను నేర్చుకున్నాడు.
- అలా బ్యాడ్మింటన్‌లో శిక్షణ కోసం తన తండ్రితోకలిసి బెంగళూరుకు వచ్చాడు లక్ష్య. అప్పటికి తన వయసు తొమ్మిదేళ్ళు.
- 2016లో బ్యాంకాక్‌లోని సిపిబి బ్యాడ్మింటన్ ట్రెయినింగ్ సెంటర్లో జరిగిన ఏసియా జూనియర్స్‌లో బార్సు సింగిల్స్ విభాగంలో జరిగిన పోటీల్లో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. అలా భారత్‌లోని జూనియర్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ఒక సంచలనంగా నిలిచాడు లక్ష్య. అదే సంవత్సరం బిడబ్ల్యుఎఫ్ ఇండియన్ ఇంటర్నేషనల్ సిరీస్‌లో లిజీజియతో పోటీపడి విజేతగా నిలిచిన లక్ష్య సీనియర్స్ ఇండియన్ ఇంటర్నేషనల్ లెవెల్ సిరీస్ టోర్నమెంట్లోనూ విజేతగా నిలవడం ఒక గొప్ప పరిణామం. ఈ రెండు విజయాలూ క్రీడాకారుడిగా తనకు మంచి గుర్తింపునిచ్చాయి.
- ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌ను గెలిచిన అతిపిన్న క్రీడాకారుడిగానూ రికార్డును సొంతంచేసుకున్నాడు లక్ష్య.
- 2017లో యురేషియా బల్గేరియన్ ఓపెన్ సిరీస్‌లో మెన్స్ సింగిల్ విభాగంలో విజేతగా నిలవడంతోపాటు అదే సంవత్సరం, టాటా ఓపెన్ ఇండియా ఇంటర్నేషనల్ మెన్స్ సింగిల్ పోటీల్లో విజేతగా పతకాన్ని అందుకున్నాడు. అదే సంవత్సరంలో జరిగిన ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తన అన్న చిరాగ్‌తో తలపడి అతనిపై విజయాన్ని సాధించాడు.
- ఇటీవల జకార్తాలో జరిగిన ఏషియన్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో మెన్స్ సింగిల్స్ విభాగంలో ఇండోనేషియాకు చెందిన వరల్డ్ నెంబర్1 క్రీడాకారుడు కున్లవుట్ విటిడ్స్న్తో తలపడి 21-19, 21-18 స్కోర్‌తో విజేతగా నిలిచి బంగారు పతకాన్ని అందుకున్నాడు. ఇది లక్ష్య బ్యాడ్మింటన్ కెరీర్లో ఒక మైలురాయి. ఏషియన్ జూనియర్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఇప్పటివరకు విజేతగా నిలిచింది గౌతమ్ థక్కర్, పి.వి సింధు మాత్రమే. 2012లో భారత్ తరపున సింధు ఈ టైటిల్‌ను సొంతంచేసుకోగా 2018లో టైటిల్‌ను సొంతంచేసుకున్న మూడవ వ్యక్తిగా రికార్డుకెక్కాడు లక్ష్య.
- అంతేకాదు, గత 53 ఏళ్ళలుగా ఏసియన్ జూనియర్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నా మెన్స్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రికార్డులు ఇప్పటివరకూ లేవు. అలా మెన్స్ సింగిల్స్ విజయంతో భారత్‌కు ఒక అరుదైన రికార్డును అందించిన అతి పిన్న క్రీడాకారుడిగా రికార్డుకెక్కాడు లక్ష్య.
- ఈ విజయంతో ప్రస్తుతం టేబుల్ టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్‌లో 76వ స్థానంలో నిలిచాడు లక్ష్య సేన్.
- ప్రస్తుతం 2020 ఒలింపింక్స్ క్రీడల్లో విజేతగా నిలిచే లక్ష్యంతో శిక్షణ కొనసాగిస్తున్నాడు.