మనం స్వాగతించినా, స్వాగతించకపోయినా కొత్త సంవత్సరం వస్తుంది. మనం కావాలనుకున్నా, వద్దనుకున్నా క్యాలెండరు మారి తీరుతుంది. కాలం నడకా, నడతా మనచేతిలో లేవు. కాలం ఒక నిరంతర ప్రవాహిని. క్షణం కూడా ఆగకుండా పరుగులు పెడుతూనే ఉంటుంది. కదులుతూ... కదిలిపోతూ ఉంటుంది. మన సమస్త కార్యకలాపాలను తనలో కలుపుకొని సాగిపోతూ ఉంటుంది. కాలం అనంతం. దానికి ఆరంభమూ అంతమూ లేదు. మొదలూ చివరా లేదు. దానిది ఏళ్లకు ఏళ్లు ఎన్నో కలగలిసిన లక్షల కోట్ల వత్సరాల వసంతాల నిర్విరామ నిరంతర గమనం. అనంతకోటి పర్యంత ప్రయాణం.
నువ్వు నిద్రపో. మెలకువగా ఉండు. సంతోషాన పొంగిపో. దుఃఖ సంద్రాన కుంగిపో. ఏదైనా సాధించు. ఎవరినైనా విభేదించు. ఏ స్థితినైనా ఉండు. ఏ పరిస్థితినైనా ఎదుర్కో. వాటన్నిటితో కాలానికి సంబంధం లేదు. పట్టింపు లేదు. దేనికీ చలించకుండా చరిస్తూనే ఉంటుంది. గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో భూమి నిరంతరంగా తిరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు మనం కూడా. కాలంతో పాటు నిరంతరంగా సమాంత రంగా ప్రయాణం చేస్తున్నాం. కాలానికి కొత్తా పాతా లేదు. గడచిన ప్రతిక్షణమూ పాతదే! వచ్చే ప్రతి క్షణమూ కొత్తదే! మనం అనుకోవటానికి తప్ప- కాలం గురించి కాలానికి ఎలాంటి కొత్త విశేషమూ లేదు. ఎలాంటి విచారమూ లేదు.
భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమంలో- నలుపు తెలుపుల బహుళ ఛాయలను తన చుట్టూ మోహరించుకుంటుంది. ఒక దగ్గర పట్టపగలు మధ్యాహ్నపు ధగధగల కాంతి. మరో దగ్గర నల్లని చిమ్మచీకట్ల అర్ధరాత్రి. ఒక దగ్గర సాయంసంధ్యల నారింజ వెలుగు. ఇంకోచోట ప్రభాత కిరణాల మెలకువల వేకువ. ఒకే కాలంలో, ఒకే సమయంలో భూగోళం అంతటా అన్ని వేళలూ ఎన్నెన్నో ఛాయలూ. అంతరిక్షంలోంచి చూస్తే మన భూమి ఒక వెలుగు జిలుగుల బంతి. దిక్కులూ మూలలూ, మంచిరోజులూ చెడ్డ ఘడియలూ - అన్నీ మనుషులు పెట్టుకున్న పరిమితులు. కాల ప్రవాహంలో ప్రతి క్షణమూ శుభ సమయమే! కాలవిభజన ఏదైనా- పనికి, మనకు అడ్డు పడకుండా ఉండాలి. సాగిపోయే ప్రయాణానికి తోడవ్వాలి. వివేచనతో ఆలోచిస్తే కాలావగాహన ఏర్పడుతుంది. కాలం కళ్లెంలా కాకుండా వేకువలా, వెల్లువలా అవగతమవుతుంది.
నూతనోత్సాహానికి స్వాగతం!
మన సౌలభ్యం కోసమే కాలవిభజన చేసుకున్నాం. నిన్న, నేడు, రేపు అనే రేఖలు గీచుకున్నాం. మన ఆశలు, ఆలోచనలు, అను భవాలూ జోడించనంత వరకూ కాలానికి ఏ ప్రత్యేకతా లేదు. మన సమస్త ఉద్వేగాలను, ఉత్సాహాలను; కార్యకలాపాల ప్రణాళికలను కాలంతో ముడిపెట్టుకున్నాం. అప్పుడు కాలం మన పనుల్లో భాగమయింది. మన ఉద్వేగాలకు నెలవయింది. మన పనులకు గుర్తుగా నమోదైంది. మన జ్ఞాపకాల్లో ఇమిడిపోయింది. ప్రణాళికగా రూపొందింది. సమీక్షగా సాక్షాత్కరించింది. అసలు ఒకటేమిటి? సమస్తమూ అయింది. మానవాళి సర్వ అవస్థలకు, సకల వ్యవస్థలకు సాక్షి అయింది. అందుకే కాలానికి ఇంత విలువ. కొత్త సంవత్సరానికి ఇంత స్వాగత సంరంభం. నూతనోదయానికి ఇంతింత ఉత్సాహ ఉత్సవం!
రోజంతా పనుల్లో మునిగితేలి రాత్రికి నిద్రపోతాం. శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. తరువాతి ఉదయం కొత్త ఉత్సాహంతో మేల్కొంటాం. పనుల వనిలో భాగమవుతాం. అలా ఏరోజుకు ఆ రోజే విరామం. ఏ రోజుకు ఆ రోజే కొత్త బలం. 365 రోజులు గడిచిపోయాక సంవత్సరం కూడా అంతే! అది భావాత్మకమే అయినప్పటికీ- కొత్త ఉత్సాహ ఉద్వేగాలకు తెరతీత! వేల సందళ్లకు, సంతోషాలకు పెనవేత!
వెనక్కి తిరిగి చూస్తే...
నడిచొచ్చిన దారిలో అనేక ఆశలు ఉంటాయి. ఆవేశాలు ఉంటాయి. అడియాసలు ఉంటాయి. ఆయాసాలూ ఉంటాయి. సంతోషాలు ఉంటాయి. సందళ్లు ఉంటాయి. విజయాలు ఉంటాయి. వీరవిహారాలూ ఉంటాయి. అన్నిటినీ ఒకసారి తలపోసుకోవడం బాగుంటుంది. వెళుతూ వెళుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవటం మంచిదే! ఎంత దూరం వచ్చామో, ఇంకా ఎంత దూరం వెళ్లాలో తెలుస్తుంది. నడుస్తూ నడుస్తూ ఆగి ఒకసారి గతాన్ని అవలోకించటమూ మంచిదే! మనం ఎక్కడికి వెళ్లాలి? ఏ దారిలో వెళ్లాలి? ఎంత కాలంలో వెళ్లాలి? ఏమేమి సమీకరించుకోవాలి? ఎలా సమకూర్చుకోవాలి? ఆలోచించుకోవటానికి ఇదొక సరైన సమయం. చేసిన పొరపాట్లను, తెలుసుకున్న పాఠాలను, వేసుకున్న ప్రణాళికలను ఒకసారి అవలోకించుకునే తరుణం. వెళ్లే పాత సంవత్సరం, వచ్చే కొత్త సంవత్సరం చేసే మేలూ, చెప్పే సూత్రమూ ఇదే!
పాత సంవత్సరం పోతుంది. పోతే పోనీయండి. ఏడాది పొడవునా ప్రోది చేసుకున్న అనుభవాలను మాత్రం పోనీయకండి. నీరసాలూ, నిరుత్సాహాలూ వదిలేయండి. చేదులూ చెడ్డ అనుభవాలూ వడబోయండి. అన్నిటిలోంచి మంచి సారాంశం తీయండి. గత ఏడాది ప్రణాళిక ఉండే ఉంటుంది కదా.. ఒకసారి నెమరేయండి. ఏం చేసి ఏమి సాధించార? ఏం చూసి ఏమి నేర్చుకున్నాం? అసలు ఏమనుకున్నాం? ఆ దారిలో ఎంతవరకూ నడిచాం? ఇలాటివి సమీక్షించుకోవటానికి సంవత్స రాంత రోజు ఒక సందర్భం.
కొత్తలో ఏదైనా కొత్తగానే ఉంటుంది. ఉత్సాహంగా ఉంటుంది. కొత్త సంవత్సరం కూడా అంతే! ఈ ఏడాది ఫలానా పనులు చేయాలి. ఫలానా సాధించాలి... అనుకుంటాం. ఫలానా ఫలానా పుస్తకాలు చదవాలి, ఫలానా రాయాలి అనుకుంటాం. మొదట్లో కొద్ది రోజులు బాగానే నడుస్తుంది. రోజులు పాతగిల్లుతాయి. లక్ష్యాలు అటకెక్కుతాయి. రోజువారీ జీవితం ముందుకొచ్చి, అంతా తన ఆధీనంలోకి తీసేసుకుంటుంది. దైనందిన జీవితానికి ప్రత్యేకించి ప్రణాళిక అవసరం ఉండదు. రోజువారీ అవసరాలే దానిని ఎప్పటికప్పుడు నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా సాధించాలి అనుకున్న వాటికే ప్రణాళిక అవసరమవుతుంది. ప్రణాళిక అమలు చేయాలి అంటే - ప్రత్యేక శ్రద్ధా, కృషీ అవసరమవుతాయి. మరి అలాంటి ప్రయత్నం జరిగిందా?
''నిన్న నీది కాదు.
రేపటికి రూపు లేదు.
నేడే ఈనాడే నీది. ఈ క్షణమే నీది.
నీ ప్రయత్నం ఇప్పుడే మొదలెట్టు.
ఈ క్షణమే ఆరంభించు.'' అని పెద్దలు చెబుతారు. నిజమే ఇది.
దీనిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటే- సగం విజయం సాధించినట్టే మనం.
మనకు మనమే అడ్డు
నిజానికి చాలా సందర్భాల్లో మన లక్ష్యాలకు మనమే ప్రధాన అడ్డంకి. చేయాలనుకున్న పని తక్షణావసరం కానప్పుడు వాయిదా వేస్తాం. రేపు చేయొచ్చు.. తరువాత చేయొచ్చు అనుకుంటాం. ఈరోజు చాలా పనులు ఉన్నాయి.. అని సమాధానం చెప్పుకుంటాం. తొలి పొరపాటు అక్కడే ఉంది. రోజూ చేయాల్సిన పనులు రోజూ ఉంటాయి. మన శ్రద్ధను బట్టి, అవసరాన్ని బట్టి జరిగిపోతూ ఉంటాయి. అంతకుమించిన ఫలితాలు, ప్రయోజనాలూ సాధించటానికి మాత్రమే ప్రత్యేక ప్రణాళిక, ప్రత్యేక శ్రద్ధా అవసరమవుతాయి. దానికి కూడా రోజూ సమయం కేటాయించాలి. అది రోజులో భాగం అవ్వాలి... అప్పుడే మన లక్ష్యం లక్షణంగా ఉన్నట్టు... అలాంటి పరిస్థితే మన లక్ష్యానికి అనువైన తొలి మెట్టు.
అనుకున్నవన్నీ అవ్వకపోవొచ్చు. కొన్నిటికి ఇతరుల తోడ్పాటు, పరిస్థితుల అనుకూలతా కావాలి. కానీ, అత్యధికం మనచేతిలోనే ఉంటాయి. మన చేతిలో ఉన్నది మనం చేయాలి. పరిపూర్ణంగా ప్రణాళికాబద్ధంగా చేయాలి. అప్పుడు బయటి పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. మనం ఏమి చేయాలో, ఇతర పరిస్థితుల సహకారం ఎంతో మనకు తొలుతే స్పష్టత ఉండాలి.
విద్యార్థి కావొచ్చు. ఉద్యోగార్థి కావొచ్చు. గృహస్థు కావొచ్చు. వ్యాపారి అవొచ్చు. నాయకుడు, అధికారి, రచయిత, ఉద్యోగీ .. ఎవరైనా కావొచ్చు. రంగాన్ని బట్టి, అవసరాన్ని బట్టి లక్ష్యాలు ఉంటాయి. అసలు ఈ ఏడాది మన లక్ష్యాలు ఏమిటి? మనసులో అనుకోవడం కాదు. ఒక కొత్త డైరీలో, మంచి నోట్బుక్లో రాసుకోవాలి.
ఈ ఏడాది ఏఏ పనులు చేయాలి?
చేయాలి అంటే ఏం కావాలి?
అందులో మనం ఏం చేయాలి? బయటి నుంచి మనకేం సహాయ సహకారాలు అవసరమవుతాయి? వాటిని సమకూర్చుకోవటానికి మనం ఏం చేయాలి? ఇలా విడివిడిగా ప్రతి ఒక్క అంశమూ క్షుణ్ణంగా రాసుకోవాలి. ఒక్కో లక్ష్యానికి ఒక్కో స్వభావం ఉంటుంది. ఒక్కో కాలవ్యవధి అవసరమవుతుంది. మీ లక్ష్యాల స్వభావం ఏమిటి? చేరటానికి పట్టే సమయం ఎంత? అనేదానిని స్పష్టపరుచుకోవాలి. తరువాత లక్ష్యాన్ని చేరే ప్రణాళిక రూపొందించుకోవాలి. దానినే లక్ష్యం చేరే దారి అనుకోవొచ్చు. రూట్మ్యాపు అనుకోవొచ్చు.
లక్ష్యాన్ని ముక్కలుగా చేయాలి
లక్ష్యం పెద్దది అయినప్పుడు దానిని చిన్న చిన్నవి విభజించాలి. విద్యార్థి పాఠ్య పుస్తకాన్ని చాప్టర్లుగా విభజించినట్టు విడదీయాలి. నెలలవారీ, రోజువారీ, గంటలవారీగా నిర్ధిష్ట లక్ష్యానికి నిర్ధిష్ట కాలవ్యవధి పెట్టుకోవాలి. ఏళ్లపాటు శ్రమించి ఒకేఒక్క
వ్యక్తి కొండను తొలిచి ఊరికి రహదారి వేసిన అద్భుతం మనకు తెలుసు. కట్టెల మోపును మూకుమ్మడిగా కాక విడివిడిగా అయితే విరిచేయవచ్చు అన్న నీతికథ మనకు తెలుసు. అలాటి అనుభవాలను, మానవ విజయాలను అన్వయించుకోవటం మన సంకల్పానికి బలాన్నిస్తుంది.
అన్నిటికన్నాన ముఖ్యం ఆచరణ
ఇప్పుడు లక్ష్యం ఉంది. ప్రణాళికా ఉంది. దానిని అమల్లో పెట్టే ఆచరణ అన్నిటికన్నా ముఖ్యం. ప్రణాళికకు అనుగుణంగా మన పని ఉండాలి. మరవకుండా, వాయిదా వేయకుండా మనల్ని మనం నిరంతరం అప్రమత్తం చేసుకోవాలి. ఒక కాలవ్యవధిలో జరిగిన, జరుగుతున్న పనిని సమీక్షించుకోవాలి.
ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యాపకం. అందరికీ విడివిడి లక్ష్యాలు ఉంటాయి. అలాగే ఉమ్మడి లక్ష్యాలూ ఉంటాయి. వాటిపై స్పష్టత ఉండాలి. ఉమ్మడి లక్ష్యాల చేరికకు ఉమ్మడి కృషి అవసరం. వ్యక్తిగత లక్ష్యాల సాధనకు వ్యక్తిగత శ్రద్ధ అవసరం. అందరి మధ్య సమన్వయం, సహకారం ఎలా ఉండాలో కూడా అనుకోవాలి. అందరి లక్ష్యాలు అందరికీ తెలియాలి. అప్పుడే ఎవరికి ఎలాంటి వాతావరణమూ, సహాయమూ కావాలో తెలుస్తుంది. ఇది ఒక ఇంటికి మాత్రమే కాదు; కార్యాలయ బృందాలకైనా, కళాశాల విద్యార్థులకైనా వర్తిస్తుంది.
ఆటంకాలకు, అనవసరాలకు సెలుఃవు
లక్ష్యాలూ ప్రణాళికలు రూపొందించుకోవటం సులభమే! దాని అమలే కష్టం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏదొక రూపంలో ఆటంకాలూ అవాంతరాలూ వచ్చి పడుతూ ఉంటాయి. స్మార్టుఫోన్లూ, సోషల్ మీడియాలూ అరచేతిలోకి వచ్చాక ఈ సమస్య మరింత పెరిగింది. వాటిని వినియోగించే సమయంపై నియంత్రణ అవసరం. ఏ అవసరాలకు, ఎంతమేరకు వాడాలో నిర్ధిష్టంగా, నిక్కచ్చిగా నిర్ణయించాలి. కఠినంగా అమలు చేయాలి. చాటింగులు, ఆన్లైన్ ఆటలు, పోస్టులు, కామెంట్లూ, లైకులు, వాదోపవాదాలు హరిస్తున్న సమయం అంతాఇంతా కాదు. వాటిని కచ్చితంగా నివారించాలి. అప్పుడు చాలా సమయం మీ లక్ష్య సాధనకు వినియోగించుకోవొచ్చు.
టీవీలో సీరియళ్లు, చర్చలు కూడా ఈ బాపతే. మనకు అవసరం ఉన్న మేరకే వీక్షించి, తరువాత కట్టివేయడం చాలా అవసరం. సమయం వృథా కానివ్వకుండా కాపాడుకోగలిగితే- నిర్దేశిత లక్ష్యాలకు అదే పెద్ద బాసట అవుతుంది. ప్రపంచంలోని అందరికీ 24 గంటలే ఉంటాయి. కొందరు వారి వారి రంగాల్లో ఎంతెంతో సాధిస్తారు. ఇతర విషయాల్లోనూ వెనకబడకుండా పురోగమిస్తారు. సాధకులకు, సామాన్యులకు మధ్య తేడా ఇదే! సాధకులు ప్రతి క్షణాన్ని తమ లక్ష్యం వైపు నడిపిస్తారు. విజయాన్ని సాధిస్తారు. సామాన్యులు ఏం జరిగితే దానిలో మునిగి తేలతారు. బిజీ అయిపోతారు. కాలాన్ని తమకు అనుకూలంగా, అనుగుణంగా మార్చుకున్న వారు విజేతలవుతారు. కాలం ఒరవడిలో పడి బిజీ అయినవారు ఎప్పుడూ బిజీగానే ఉంటారు.
'కాలంలో, దాని మాయాజాలంలో పడడం కాదు; కాలం వెంట పడు. కాలం నిన్ను గుర్తు పెట్టుకునేంతగా వెంటపడు.' అన్నాడొక కవి. నిజమే; విజేతలకు, పరాజితులకు ఉన్న సమయం ఒక్కటే! తేడా అల్లా దానిని వాడుకునే తీరే.. వాడుకను బట్టే ఫలితం. మన కాలం మన ఆధీనంలో ఉండాలి. అప్పుడు అన్నీ కాలం వెంటే ఉంటాయి.
హేపీ న్యూ ఇయర్...
ఒక సంవత్సరం ఎంత విలువైనదో
పరీక్షలో తప్పిన విద్యార్థినడుగు
ఒక రోజు ఎంత విలువైనదో
ఒకటో తేదీన జీతం రాని ఉద్యోగినడుగు
ఒక గంట ఎంత విలువైనదో
క్షణమొక యుగంగా గడిపిన ప్రేమికుడినడుగు
ఒక నిముషం ఎంత విలువైనదో
రైలు మిస్సయిన ప్రయాణికుడినడుగు
ఒక సెకను ఎంత విలువైనదో
ప్రమాదంలో ప్రాణాలు దక్కినవాణ్ణడుగు!
- ఒక కవిత
కాలం విలువ
''క్షణము గడిచిన దాని వెన్కకు మరల్ప
సాధ్యమే మానవున కిలాచక్రమందు''
- గుర్రం జాషువా
''యువకులారా, భావి భారత నిర్మాతలు, నిర్ణేతలూ మీరే. మీ ఆలోచనలను నిరాశావాదం నుంచి ఆశావాదం వైపు మళ్లించండి. ఇనుప కండరాలు, ఉక్కునరాలూ కలిగిన యువత మనకు కావాలి. నిరీక్షణతో పొద్దు పుచ్చే దుస్థితిని విడనాడండి. కాలం విలువ తెలుసుకోండి. వట్టి మాటలతో కాలం వృథా చేయకండి.''
- స్వామి వివేకానంద
ఏ కాలం ఎప్పుడొచ్చునో ...
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. తనచుట్టూ తాను తిరగటానికి పట్టే కాలం 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు. ఆకాలంలోనే మనకు రాత్రి పగళ్లు సంభవం. భూమి సూర్యుడి చుట్టూ తిరగటానికి పట్టే కాలం 365 రోజుల 6 గంటల 54 సెకన్లు. మనకు రుతువులు ఏర్పడ్డానికి అదే కారణం. ప్రకృతిలో ప్రతి చర్యా, ప్రతి మార్పూ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. ప్రతి దానికి ఒక నిర్ణీత కాలమూ, కారణమూ ఉండి తీరతాయి. ఇలాంటి నియమబద్ధ సూత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాడు మనిషి. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? ఎప్పుడు అస్తమిస్తాడు? నడినెత్తిన ఎప్పుడు ప్రకాశిస్తాడు? ఏ రెండు చర్యల మధ్యనైనా ఉండే కాలవ్యవధి ఎంత? ప్రకృతిలో ఏ మార్పు ఎప్పుడు సంభవిస్తుంది? చెట్లకు తలస్నానాలు చేయించే వరుస వర్షాల కాలం ఎప్పుడు? వణికించి వడలించి ఆకులను వొలిచేసే చలికాలపు విజృంభణ ఎప్పుడు? నింగి నుంచి నేలకు నిప్పులు కురిపించే మండుటెండల మహా వేడికాలం ఎప్పుడు? కాలానికి కాలానికి మధ్య వ్యవధి ఎంత? ఏ రుతువు అరుదెంచేటప్పుడు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి? ఏ రుతువు ప్రవేశించగానే ఎలాంటి ఆనవాళ్లు కళ్లకు కడతాయి? ఇలాటి ప్రశ్నలకు పట్టిపట్టి వెతికి, తర్కించి, మరీ సమాధానాలు అన్వేషించాడు మనిషి. మనిషి వందల, వేల ఏళ్ల పాటు పరిశీలించి, పరిశోధించి కాలాన్ని, కార్యాకారణ సంబంధాలను అర్థం చేసుకున్నాడు. కాలానికి సంబంధించిన అవగాహన ఏర్పడ్డాక- కాలగణన చేశాడు. కాలవిభజనా చేశాడు. సెకన్లు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలూ ... ఇలా అమల్లోకి తెచ్చాడు. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో కాలమానం అనేది ఒక విడదీయలేని బంధం.
- సత్యాజీ
9490099167