తెలుగు సినిమా ప్రతిష్ఠను పెంచడానికి చిన్ని బ్రదర్స్ సంస్థ తమ శాయశక్తులా సహకారాన్ని అందించింది. అద్భుతమైన కళాఖండాలు నిర్మించింది. దీని నిర్మాత పి. ఆదినారాయణరావు. సినిమా నిర్మాణాన్ని ఒక ప్రతిష్ఠగా భావించే నిర్మాతల్లో ఆదినారాయణరావు ఒకరు. స్వతహాగా గొప్ప భావుకుడూ సంగీత స్రష్ఠ. ఇక ఆయన నిర్మాణంలో వచ్చిన సినిమాలన్నీ సంగీతం ప్రధానంగా సాగేవి. అందులో గొప్ప చారిత్రాత్మక చిత్రం అనార్కలి! తొలుత నృత్య దర్శకుడిగా పని చేసి ఆ తర్వాత దర్శకుడిగా పరిణితి చెంది కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన దర్శకుడు వేదాంతం రాఘవయ్యగారు. దేవదాసు, చిరంజీవులు చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. వీరిద్దరి మేలు కలయికలో రూపుదిద్దుకున్న చిత్రమే అనార్కలి! ఈ చిత్రం ఒక గొప్ప బయోపిక్ అని చెప్పుకోవచ్చు.
మొగలాయీ వంశీకుల్లో అక్బరు-సలీమ్‌ల కథగా దీన్ని అభివర్ణించేవారు. సినిమా పుట్టుకకు ముందే మూకీ చిత్రంగా అనార్కలికి అంకురార్పణ జరిగింది. కాలక్రమేణా సాంకేతిక విలువలు జోడించి ఈ కథపై కొన్ని సినిమాలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కళలకు పుట్టినిల్లు. సినిమా రోడ్లో ఉన్న యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ (మెజిస్టిక్ థియేటరు) ఎందరో గొప్ప కళాకారులకు జన్మనిచ్చింది. అందులో ఎందరో సినీ దిగ్గజాలు. సి. పుల్లయ్య, సి.ఎస్.రావు, రేలంగి, జోగినాథం. బి.ఎ.సుబ్బారావు, కౌండిన్య, బాలయ్య, ఎస్.వి. రంగారావు, అంజలీదేవి, ఆదినారాయణ రావు, ఆకుల నరసింహారావు, నల్ల రామ్మూర్తి ఎందరో... వీళ్లంతా యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో తమ నటనకు మెరుగులు దిద్దుకొని తమను తాము తీర్చిదిద్దుకుని నటనలో రాణించినవారే. ఆకుల నరసింహారావు సుప్రసిద్ధ నటుడు. సంగీత విద్వాంసుడు. ఆయన శిష్యుడే ఆదినారాయణరావు. నాటకాలు రాయడం, పాటలకు సంగీతం సమకూర్చడం, నాటక ప్రదర్శనలో నేపథ్య సంగీతం వినిపించడం లాంటివి చేసేవాడు. ఆయన అసమాన ప్రతిభకు అందరూ ఆశ్చర్యపోయేవారు. అక్కడ పరిచయమైన నటి పెద్దాపురం వాసి అంజమ్మను పెళ్లి చేసుకున్నారు. సి.పుల్లయ్యగారి పిలుపునం దుకొని చెన్నపట్నం చేరుకున్నారు. ఆదినారాయణరావు ఆ తర్వాత బొంబాయి, కలకత్తా నగరాలు తిరిగి అక్కడ సంగీత స్రస్ఠల నుంచి మెలకువలను నేర్చుకుని తనదైన ముద్రలో స్వర రచన చేసేస్థాయికి ఎదిగారు. ఈయన దగ్గర దిగ్గజాల్లాంటి సంగీత దర్శకులు సహాయకులుగా పని చేసేవారు. వారిలో ప్రముఖులు టి.వి. రాజు, సత్యం. ఆదినారాయణరావు సాధించిన దానితో సంతృప్తి చెందే రకం కాదు. ఇంకా ఏదో చెయ్యాలి. పరిపూర్ణతను సాధించాలి అనే పట్టుదల ఉన్న వ్యక్తి. అందుకే అతి తక్కువ చిత్రాలు మాత్రమే చేసినా అవి చరిత్రలో నిలిపోయాయి. స్వీయ నిర్మాణంలో వచ్చిన చిత్రాలన్నింటికీ ఆయనే సంగీతం అందించేవాడు. అలా ఆయన స్వీయ సంగీతంలో వచ్చిన చిత్రమే.. అనార్కలి!. ఈ చిత్రంలోని పాటలు తొలిసారిగా విన్న సినీ సంగీత ప్రియులందరూ ఆశ్చర్యపోయారు. ప్రశంసల వర్షం కురిపించారు.
తొలి మూకీ చిత్రం
ప్రేమ కథలు పాటలుగానో, నాటకాలుగానో, నృత్య రూపకాలుగానో తర్జుమా చెందుతూనే ఉంటాయి. మొట్టమొదట 1928లో 'లవ్స్ ఆఫ్ ఎ మొగల్ ప్రిన్స్' మూకీ చిత్రం వచ్చింది. దీన్ని ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ నిర్మించింది. సులోచన అనార్కలిగా నటించింది. చారూ రారు, ప్రపుల్లరారులు దర్శకత్వం వహించారు. 1935లో వచ్చిన ఈ మొదటి అనార్కలి చిత్రంలో నటించిన సులోచన కథానాయికగా ఆర్.ఎస్. చౌదరి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించింది. తర్వాత కె.ఆసిఫ్ 1944లో అనార్కలి సినిమా ప్రారంభించాడు. ఇందులో అక్బరు పాత్రలో నటించిన చంద్రమోహన్ హఠాత్తుగా మరణించడంతో ఆ సినిమా అక్కడితో ఆగిపోయింది. 1953లో నందలాల్, జస్వంత్లాల్ 'అనార్కలి-సలీమ్ ముబారక్' చిత్రం తీశారు. దీనికి సి.రామచంద్ర సంగీతం సమకూర్చారు. సులోచన జోదాబారు పాత్రలో నటించింది. 1954లో మోడరన్ థియేటర్స్ 'ఇల్లారజ్యోతి'గా కన్నదాసన్ రచనతో కన్నడంలో నిర్మించారు. తర్వాత మొగల్ ఇ ఆజమ్ హిందీలో నౌషద్ సంగీత నిర్దేశకత్వంతో 1960లో రూపొందించారు. దీన్నే డబ్ చేసి తమిళంలో 'మధుబాల'గా విడుదల చేశారు. ఇన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం విశేషత ఏంటంటే ఎవరు ఈ చిత్రాన్ని నిర్మించినా దానికి ప్రాణాధారం సంగీతమే! అదే ఆదినారాయణరావును ఈ చిత్ర నిర్మాణానికి పురిగొల్పింది.
కథా కమామీషు
అనార్కలి సినిమా వాస్తవగాథ అనడానికి వీల్లేదు. ఇందులో సినిమాకు అనుకూలంగా ఎన్నో మార్పులూ చేర్పులూ చేశారు. తల్లితోబాటు అంజలీదేవి పర్షియా నుంచి ఆగ్రాకు వలస వస్తుంది. ఈమె పేరు నాదిరా. సలీమ్ (అక్కినేని) అక్బరు చక్రవర్తి కొడుకు. అక్బరు (ఎస్.వి. రంగారావు) పరిపాలనా దక్షుడు. ఆయన భార్య జోదాబాయి (కన్నాంబ). కొడుకును అపారమైన ప్రేమతో చూసుకుంటుంది. ఒక రోజు సలీమ్ అనార్ తోటలో నాదిరాని చూస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె అందచందాలతోపాటు కమ్మని గాత్రం సలీమ్‌ను హత్తుకుంటుంది. నాదిరాను చూడకుండా ఒక్కక్షణమైనా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. నాదిరా తల్లి (హేమలత) సలీమ్‌ను హెచ్చరిస్తుంది. ప్రభువులతో స్నేహం ప్రాణాంతకం అంటుంది. ఆ పరిస్థితే వస్తే తన ప్రాణాలు అడ్డం వేస్తానంటాడు సలీమ్. మరో పక్క ఆతని అందచందాలు, శౌర్యప్రతాపాలు చూసి సలీమ్‌ను ప్రేమిస్తుంది గుల్నార్ (బాలసరస్వతి). అయితే సలీమ్ ఆమెను పట్టించుకోడు. ఒక రోజు నాదిరా పాటను విని ముగ్ధుడైన అక్బరు (ఎస్.వి.ఆర్) నాదిరాను తన దర్బార్‌లో ఆస్థాన నర్తకిగా నియమిస్తాడు. ఇది గుల్‌నార్‌కు మరింత కంటగింపుగా ఉంటుంది. అదను చూసి వేటు వేయాలని ఎదురు చూస్తుంటుంది. రాజ నర్తకిని ఎలాగైనా దెబ్బ తీయాలని పానీయంలో విషం కలిపి దర్బార్‌లో ప్రదర్శనకు ముందు తన చేత తాగిస్తుంది. నృత్య ప్రదర్శన అపభ్రంశం అవుతుంది. ప్రభువుల వారికి ఆగ్రహం వచ్చి మరణశిక్ష విధిస్తాడు. సలీమ్ తల్లితండ్రులతో ఘర్షణ పడతాడు. తన ప్రేమవిషయం తెలిసి మరింతగా ఆగ్రహావేశాలకు లోనవుతాడు అక్బర్. ప్రేమకు పేదరికం ఉంటుందా? అని వాదిస్తాడు. ప్రభువులు పరిపాలనా దక్షులై ఉండాలిగాని ప్రేమకు బానిసలు కాకూడదని హెచ్చరిస్తాడు. నగరానికి దూరంగా అనార్కలిని సజీవ సమాధి చేయమంటారు అక్బర్. ఇది తెలుసుకొని సలీమ్ ఆమెను కాపాడుకునేందుకు బయలుదేరతాడు. ఆది చూసి ఓర్వలేక గుల్నార్ ఆయన్ని మట్టుబెట్టాలని బాణం వేస్తుంది. గాయపడి తప్పించుకొని అనార్కలిని సమాధి చేసే స్థలానికి చేరతాడు. అప్పటికే ఆమెను పూర్తిగా సజీవసమాధి చేస్తారు. సలీమ్ అనార్కలి సజీవ సమాధిపై తలబాదుకుంటూ అనార్కలితోపాటు తనూ తనువు చాలిస్తాడు. సినిమా సమాప్తం అవుతుంది.
నటీనటులు ప్రాణం పోశారు
కథలో కొన్ని నాటకీయ సన్నివేశాలను జనరంజకంగా తీర్చిదిద్దాడు. దర్శకుడు వేదాంతం రాఘవయ్యగారు. అక్బరుగా ఎస్.వి.ఆర్ మాన్‌సింగ్‌గా నాగయ్య, జోదాబారుగా కన్నాంబ, సలీమ్‌గా అక్కినేని, నాదిరా పాత్రలో అంజలీదేవి ప్రాణం పోశారు. ముఖ్యంగా అక్కినేని, అంజలి, ఎస్.వి.ఆర్. నటనలో పోటీ పడ్డారు. అనార్కలిగా అంజలి అద్భుతమైన నటన ప్రదర్శించింది. పతాకసన్నివేశాల్లో అక్కినేని నటన నభూతో న భవిష్యతి అనేలా చేశాడు.
పాటలన్నీ ఆణిముత్యాలే
ఆదినారాయణరావు తన సుమధురమైన స్వర రచన ద్వారా అనార్కలి పాటలకు పది కాలాలు గుర్తుండి పోయేలా ప్రాణం పోశారు. ఇందులో 'జీవితమే... రాగసుధాభరితము ప్రేమ కథ మధురము', ఆ పాత మధురం. 'కలిసె నెలరాజు.. కాలువ చెలిని కలిసె యువరాజు.. అనార్కలిని' ఈ పాట మెలోడీ ప్రధానంగా నిత్యనూతనంగా ఉంటుంది. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసాన ఏలరా...' దర్బార్‌లో అంజలి పాడుతూ చేసిన నృత్యం ఇప్పటికీ కళ్ళముందు కదలాడుతుంది. 'తాగి సోలేనని భ్రమసేనీలోకము', 'వియోగాలే విలాపాలే వీడని మాప్రేమ ఫలితాలా.. ప్రేమ జగానా.. వియోగానికేనా.. ప్రేమగాథ.. విశాదాంతమేనా...', 'రావోయీ సఖా.. నీ ప్రియ సఖి చేరగదోయి తరళిపోయె అనార్కలి ఆ విధాన తారయై..' ఇలా ప్రతిపాటా ఒక ఆణిముత్యమే. ఆదినారాయణరావు సంగీత ప్రతిభను చూసి ఉత్తరాది వారు ఉలిక్కిపడ్డారు. సంభ్రమాశ్చార్యాలతో జేజేలు పలికారు. ఇందులో పాటలెంత సుమధురంగా సాగాయో... మాటలూ అంత అర్థవంతంగా సాగాయి. మాటల్లో వ్యర్థ ప్రయోగాలు ఎక్కడా కనిపించవు. ఆ రోజుల్లో ఈ సినిమా రిచ్‌గా అనిపించింది. దానికి కేవలం దర్శకుడి ప్రతిభా పాటవాలే కారణం. ఆదినారాయణరావు సంకల్పం సిద్ధించింది. ఘంటసాల, జిక్కి పాటల్లో సింహభాగం పంచుకోగా సుశీల, ఎ.ఎం రాజాలు సముచిత న్యాయాన్ని సమకూర్చారు.
అజరామర ప్రేమగాధ
చరిత్రలో ప్రేయసీ ప్రేమికులంటే అనార్కలి, సలీమ్లే. ఇది యధార్థగాధకు రూపకల్పన గనుక ప్రేక్షకుల గుండెలోతుల్లో నిలిచిపోతుంది. అనార్కలి సమాధి ఇప్పటికీ పంజాబ్‌లోని సెంచరీ ఓల్డ్ బజారులో మాల్ రోడ్లో ఉంది. ఇప్పుడది అనార్కలి బజార్‌గా పిలవబడుతోంది.
- ఇమంది రామారావు
9010133844