దసరా! భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగల్లో ఒకటి. దేవీ నవరాత్రులు పేరుతో తొమ్మిది రోజుల పాటు చేసుకునే పండుగ దసరా. చివరిగా విజయదశమితో ముగింపు పండుగ జరుపుకుంటారు. విజయదశమి విజయాన్ని లేదా విజయం సాధించాలన్న ఆకాంక్షను సూచిస్తుంది. చెడు మీద మంచి సాధించే విజయం కావొచ్చు. నిరక్షరాస్యత మీద అక్షరాస్యత సాధించే విజయం కావచ్చు. వెనకబాటు తనం మీద అభివృద్ధి సాధించే విజయం కావచ్చు. ఎందులోనైనా మనిషి విజయాన్ని కోరుకుంటాడు. మొత్తం మీద ప్రకృతిపై మానవుడు సాధించిన విజయానికి సంబంధించిన పండుగ. ముఖ్యంగా వ్యవసాయంలో మానవుడు సాధించిన విజయాలతో ఇది ముడిపడి వుంది. ఇలా అనేక రకాల విజయాలను అన్వయించే పండుగ దసరా. అంతేకాదు. దసరా రోజుల్లో అమ్మవారిని వివిధ రూపాలలో కొలుస్తారు. ఆ రూపాలన్నీ ఆయా సంపదలను లేదా ఆయా విజయాలను సూచిస్తాయి.
దసరాను కాస్త అటూ ఇటూ చేస్తే సరదా అవుతుంది. దసరా అంటేనే సరదాలు, సంప్రదాయాలు, ఆటపాటలు, వినోదాలు మేళవించిన పండుగ. పది రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతోష సంభ్రమాలతో జరుపుకునే పండుగ. దసరా వేషాలు ప్రత్యేక ఆకర్షణ. వివిధ రకాల దేవుళ్ల వేషాలు వేసి ఇంటింటికి తిరిగి పైకం పుచ్చుకోవడం కొందరి వృత్తిగా వుంది. వీటినే పగటి వేషాలు అని కూడా అంటారు. ఇప్పుడంతగా కనిపించడం లేదుగానీ... ఇదివరలో ప్రాథమిక పాఠశాలలో పని చేసే మాష్టార్లు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మామూళ్లు పుచ్చకోవడం మామూలు. వెదురు కర్రతో చేసిన రంగు కాగితాలతో అలంకరించిన బాణాలు పట్టుకున్న విద్యార్థులు అయ్యవారి వెంట వెళ్లి...ఏదయా మీ దయా మా మీద లేదు. ఇంత సేపుంచుటా ఇది మీకు తగునా... అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడేవారు. అయ్యవారికి ధన రూపంలోనూ, పిల్లలకు పప్పు బెల్లం రూపంలోనూ కానుకలు ఇచ్చేవారు. ఇక పులివేషాలు సరేసరి. ఇన్ని అంశాలతో ముడిపడిన దసరా పండుగను వివిధ రాష్ట్రాలలో ఎలా జరుపుకుంటారో చూద్దాం.
మన రాష్ట్రంలో ...
దసరా పండుగను ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి శుద్ధ నవమి వరకు తొమ్మిదిరోజుల పాటు జరుపుకుంటారు. తొమ్మిది రోజులను నవరాత్రులుగా, పదవ రోజును విజయదశమి కలిపి దసరాగా అభివర్ణిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారికి రోజుకో అలంకారం చేసి పూజలు నిర్వహిస్తారు. అయితే కొన్ని జిల్లాలు దసరా ఉత్సవ విషయంలో తమదైన ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో దసరా ఉత్సవాలలో భాగంగా కళారాలను ఊరేగిస్తారు. వీటిని చక్కగా అలంకరించి సిద్ధం చేస్తారు. ఇక్కడ కాళికాదేవికి, మహిషాసుర మర్థినికి, నరసింహస్వామికి కళారాలున్నాయి. వీటికి ఈ తొమ్మిది రోజులు విశేషంగా పూజలు చేసి ఊరేగిస్తారు. కళారాన్ని బండి మీద ఎక్కించి కొయ్యలను అమర్చి వాటి సాయంతో కళారాన్ని ఊపుతూ డప్పుల మోతతో ఊరేగిస్తారు. ఊరి నడిమధ్యకు తీసుకువచ్చి అక్కడ రాక్షస సంహారం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. విజయనగరంలో దసరా సమయంలో పైడి తల్లి పూజలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా అడవి నుంచి ఒక చెట్టును నరికి తీసుకొచ్చి మొదలు భాగాన్ని లాగుడు బండికి కట్టి చివరి భాగంలో ఊయల కట్టి అందులో పూజారిని కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఈ ఉత్సవం చూసేందుకు చుట్టుపక్కల పల్లెటూళ్ల నుంచి ప్రజలు ఎడ్లబండిలో వచ్చి రోడ్ల పక్కన గుడారాలు వేసుకొని ఉత్సవం చూసి ఆనందిస్తారు. దసరా రోజుల్లో బొమ్మల కొలువులు పెట్టడం ఓ సరదా. ఇలా కొన్ని జిల్లాల్లో దసరా ఉత్సవాలను తమదైన ప్రత్యేక శైలిలో జరుపుకోవడం చూస్తుంటాం.
మైసూరు
ముంబై, హైదరాబాద్ వాసులు వినాయక చవితిని ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారో కొల్కతా, మైసూర్ వాసులు దసరా పండుగను అంత ఆర్భాటంగా చేసుకుంటారు. రాజదర్పం ఉట్టిపడేలా ముస్తాబవుతుంది పట్టణం. విద్యుద్దీప కాంతులతో బంగారు వర్ణంలో ధగధగలాడే రాజభవనాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. మైసూరు మహారాజుల కాలం నుంచి దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటున్నారు. వీటిని వీక్షించడానికి దేశ విదేశాల నుంచి విచ్చేస్తారు. 405 సంవత్సరాల చరిత్ర ఈ ఉత్సవానిది. దసరా ఉత్సవాలను చూసి తరించాలంటే మాత్రం మైసూర్ వెళ్లాల్సిందే. ఆటలు-పాటల పోటీలు, యూత్ ఫెస్టివళ్లతో ఎగ్జిబిషన్లు, ఫుడ్ ఫెస్టివళ్లు...తో నగరం అంతా తిరునాళ్ల వాతావరణం నెలకొంటుంది. విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను ఇచ్చిపుచ్చుకోవడం అక్కడ ఆచారం. నవమినాడు ఆయుధ పూజ ప్రత్యేకం. ఇక్కడ ప్రతి ఒక్కరు తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి ప్రత్యేక పూజలు చేయడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. దసరా ఉత్సవానికి మైసూర్ ప్యాలెస్ ప్రధాన ఆకర్షణ. ఉత్సవాల రోజుల్లో ఇక్కడ హంగామా అంతా ఇంతా కాదు. వేలాది విద్యుద్దీపాలతో ప్యాలెస్‌ను అలంకరిస్తారు. సింహాసనం పెద్ద ఆకర్షణ. దీన్ని దసరా జరిగే పది రోజుల పాటు మాత్రమే తిలకించే అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తారు. అంబారీ ప్రదర్శనలో పాల్గొనే ఏనుగుల బాగోగులు చూసుకోవడానికి పెద్ద వ్యవస్థ వుంటుంది. నాగహొళే ప్రదేశంలోని ఒక గ్రామంలో వుండే ఏనుగులు రెండు బృందాలుగా ఉత్సవాలకు హాజరౌతాయి. అభిమన్యు, గజేంద్ర, అర్జున, రేవతి, సరళ అనే ఏనుగులు ఒక బృందంగాను, మిగతా ఏనుగులు మరో బృందంగా వస్తాయి. ఊరేగింపులో పాల్గొనే ఏనుగులు, మావటీలు నెలరోజులపాటు రాజకుటుంబీకుల ఆతిథ్యం అందుకుంటారు. అంబారీ ప్రదర్శనకు ముందు జరిగే దసరా దివిటీల ప్రదర్శన కన్నుల పండుగగా వుంటుంది. విజయదశమి రోజున మహారాజు వంశస్తులు చాముండేశ్వరీదేవిని ఏనుగులపై ఊరేగింపుగా తీసుకొచ్చే సమయంలో కళాకారులు వీధుల్లో చేసే కోలాహలం అంతా ఇంతా కాదు. సైనికుల సాహసకృత్యాలకు ఎక్కడలేని ఆకర్షణగా వుంటుంది. ఇక తొమ్మిది రోజుల పాటు జరిగే బొమ్మల కొలువు ప్రత్యేకంగా నిలుస్తుంది. కళాప్రదర్శనలు చూడ్డానికి దేశం నలుమూలల నుంచి వచ్చేస్తారు. రాజభవనాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఏనుగుల అలంకరణా ప్రత్యేకమే. రాజుగారి ఆయుధపూజ ప్రత్యేకంగా జరుగుతుంది. వివిధ దేశాలు, రాష్ట్రాల సంస్కృతులకు దర్పణం పట్టే అనేక కళా ఖండాలు, వస్తువులు, ఆటవస్తువులు, వస్త్రాలు, దసరా ప్రదర్శనలో వుంటాయి. ఆటపాటలు, విందు వినోదాలకు కొదవే వుండదు. దసరా ఉత్సవాలు తిలకించేందుకు వచ్చినవారు ఈ దసరా ఎగ్జిబిషన్ చూడకుండా తిరిగి వెళ్లరు. మంగళూరులో జరిగే దసరా ఉత్సవాలు చూడ్డానికి దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు భారీగా హాజరౌతారు. ఇక్కడ జరిగే పులి వేషాలు, ఎలుగుంటి వేషాలు దసరా పండుగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
బెంగాలీల దసరా
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ అన్నిటి కంటే పెద్ద పండగ. రాష్ట్రమంతా ప్రజలు దుర్గా సప్తమి నుండి దసరా దశమి వరకు పండగ చేసుకోవటంలో మునిగి తేలుతారు. సప్తమి నుండి దశమి వరకు కార్యాలయాలకు సెలవు ఇస్తారు. ఏ పండగ సందర్భంగానైనా కొత్త బట్టలు ధరించటం పరిపాటే కాని బెంగాల్ పద్ధతే వేరు. వీలైనంత వరకు అందరూ తన కుటుంబ సభ్యులందరికి బట్టలు పెడుతుంటారు. దాంతో బెంగాల్లో బట్టల వ్యాపారస్తులకు దుర్గాపూజ సమయంలో జరిగిన వ్యాపారంతో.... వారికి ఏడాది మొత్తంలో జరిగిన సగం కంటే ఎక్కువ భాగం వచ్చేస్తుంది. మిగతా సమయంలో పుట్టిన రోజులు, అన్నప్రాసనలకు వచ్చే వ్యాపారంతో వారికి గడిచిపోతుంది. ఇక ఇక్కడ అమ్మవారి విగ్రహాలు మరో ప్రత్యేకత. భారతదేశంలో ఎక్కడా లేనంతగా బహిరంగంగా దేవీ విగ్రహాలు ఏర్పాటు చేసి సామూహిక పూజ చేస్తారు. రాజధాని కొల్కతాలోనైతే వేల సంఖ్యలో చిన్నా, పెద్దా విగ్రహాలు పెట్టి పూజిస్తారు. విగ్రహాలన్నీ ప్రధానంగా కొల్కతాలో కుమార్టులిలోనే తయారౌతాయి. ఈ విషయంలో వారి సృజనకు ఆకాశమే హద్దు. ప్రతిమ కాక మండపాలు, అలంకరణకు కూడా చాలా ప్రాధాన్యత వుంటుంది. పెద్ద పెద్ద 'పండాళ్ళు (మండపాలు)' వెదురు రాటలు, రంగు రంగుల బట్టల సహాయంతో చూడ ముచ్చటగా నిర్మిస్తారు. ఈ తరహా ముస్తాబు చేయడంలో దేశం మొత్తంమీద బెంగాల్, అందులోనూ కొల్‌కతాకు ప్రత్యేక స్థానం వుంది. ప్రసిద్ధ ఆలయాలు, చారిత్రక, ప్రస్తుత అంశాలు లేక ఫక్తు ఊహాజనిత నమూనాలో ఈ తాత్కాలిక పూజా పండాళ్ళను నిర్మిస్తారు. సందర్శకులకు ఇది పెద్ద ఆకర్షణ. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు సరేసరి. తొమ్మది రోజులూ హరికథలు, బుర్రకథలు, పురాణ శ్రవణంతో సందడి నెలకొంటుంది. నిమజ్జనానికి ముందు 'సింధూర్ ఉత్సవ్' అత్యంత ఉత్సాహంగా జరుగుతుంది. దశమినాడే కాళీమాత నిమజ్జనం జరుగుతుంది. సెలవల అనంతరం తిరిగి కార్యాలయాలకు వెళ్ళినప్పుడు పురుషులు ఒకర్ని ఒకరు ఆలింగనం చేసుకుని అభివాదం తెలుపుకుంటారు. దీన్ని వారు 'కోలాకోలి' అంటారు. గ్రామీణ ప్రాంతాల్లో దసరా సమయంలో టపాసులు కాలుస్తారు. దీపావళికి ప్రత్యేకంగా అంత హడావిడి ఉండదు. కాని కొలకతా లాంటి పెద్ద నగరాల్లో ఇతర భాషా సముదాయాలవారు కూడా ఉన్నందున వారితోపాటు బెంగాలీయులు కూడా దీపావళికి ప్రత్యేకంగా టపాసులు కాలుస్తారు. వ్యాపారులు, సంగీతకారులు, పుస్తక విక్రేతలు... అందరూ తమ తమ కొత్త వస్తువులను, పుస్తకాలను, మ్యూజిక్ ఆల్బమ్స్‌ను ఆరోజుల్లోనే విడుదల చేస్తుంటారు. సమైక్య భావనను పెంపొందించుకునేందుకు సహపంక్తి భోజనాలు కూడా నిర్వహిస్తారు.
ఒడిషా
ఒడిషాలో దసరాకు అనేక పేర్లున్నాయి. అకల్బోధన్, దుర్గా పూజ, షోడశ ఉపాసన, దుర్గోత్సవ్, శారదోత్సవ్...పేర్లతో దసరా సంబరాలు జరుగుతాయి. మార్చి నుంచి నవంబర్ వరకు రాష్ట్రంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తుంది. మార్చి ఏప్రిల్ మధ్య చైత్ర దుర్గాపూజ, సెప్టెంబర్ అక్టోబర్‌లో శారదీయ దుర్గాపూజ, అక్టోబర్ నవంబర్ మధ్య కాళీ పూజలు చేస్తారు. కటక్ కళాకారులు రూపొందించిన దుర్గామాత విగ్రహాలను దాదాపు ప్రతివీధిలోనూ పెడతారు. మహిళలు మానికలో వడ్లు నింపి లక్ష్మీదేవిగా భావించి పూజలు నిర్వహిస్తారు. దసరాకు పల్లెల్లో రామ్ లీల అనే జానపద నాటకాన్ని ప్రదర్శిస్తారు. పండగ చివరి రోజున రావణ దహనం చేస్తారు. బాణాసంచాతో తయారు చేసిన భారీ రావణ బొమ్మను మైదానంలో కాలుస్తారు. దీన్నే రావణ్ పోడి అంటారు. ఈ రావణకాష్టాన్ని చూడడానికి ప్రజలు తండోపతండాలు వస్తారు.
రామ్‌లీలా మైదాన్
విజయదశమి వచ్చిందంటే చాలు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపానున్న రామ్‌లీలా మైదానం జనంతో కిటకిటలాడిపోతుంది. ఈ మైదానం ఇప్పటికీ రాజకీయ సభలకు పెట్టింది పేరు. పండుగలకు, ఉత్సవాలకు, దసరా రోజున జరిగే మందుగుండు పేలుడుకు కూడా వేదిక ఇదే. రంగస్థల నటులు వేషాలు వేసుకొని వేదికలపై రామాయణాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శిస్తారు. వెదురు బొంగులతో రామాయణంలోని ముఖ్యపాత్రధారులైన రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి బొమ్మలను తయారు చేసి ఊరేగించి పదవ రోజున వాటిని దగ్ధం చేస్తారు. రావణాసురుడి వధకు గుర్తుగా ఈ కార్యక్రమం ముగుస్తుంది.
గుజరాత్
పండగ వచ్చిందంటే ఇల్లు అలికి ముగ్గులు వేసుకుంటారు నేటికి కొందరు గ్రామస్తులు. అలాంటి సంప్రదాయం గుజరాత్లో నేటికీ వుంది. కాకపోతే గోడల మీద వేస్తారు. పసుపు రంగులో మెరిసిపోయే ఆయుధాల బొమ్మలు పండుగ శోభను తెలియచేస్తుంటాయి. దసరా రోజున పొద్దున్నే పొలాల్లోకి వెళ్లి మట్టిని తీసుకొస్తారు. ఆ మట్టిని కుండల్లో నింపి దాని మీద బార్లీ, గోధుమ గింజల్ని చల్లుతారు. అందులో రాగి లేదా వెండి నాణెం వేస్తారు. అలా అలంకరించిన మట్టికుండను దేవిగా ఆరాధించడం గుజరాతీల ఆచారం. దీన్నే కుంభ ప్రతిష్ట అంటారు. అన్నిట్లోకి గార్భా ఉత్సవం ముఖ్యమైనది. మహిళలంతా పాల్గొని పాటలు పాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక జానపద నృత్యాలైన గార్భ (కోలాటం), దాండియా నృత్యాల పోటీలు జరుగుతాయి. మరీ ముఖ్యంగా అహ్మదాబాద్ నగరం దసరా పండుగకు నృత్యాలతో ఊగిపోతుంది.ఈ నృత్య ప్రదర్శనలు చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అహ్మదాబాద్ జిడిఎంసి మైదానంలో జరిగే నవరాత్రుల్లో ఒకేసారి వేలాది మంది కళాకారులు నృత్యాలు నిర్వహిస్తారు. గుజరాత్ పర్యాటక శాఖ దీన్ని నిర్వహిస్తుంది. స్థానికులే కాక విదేశాల నుంచి పర్యాటకులు విచ్చేస్తారు. ఈ సమయంలో హస్తకళలు, సంప్రదాయ దుస్తులు, కళాఖండాలు అమ్మకాలతో ఈ ప్రాంతం పెద్ద జాతరను తలపిస్తుంది.
వారణాసి, కులు లోయలో...
వారణాసికి రెండు కి.మీ. దూరంలో వున్న దుర్గాదేవి ఆలయం దసరాకు కిటకిటలాడుతుంది. పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని అప్పటి బెంగాలీ మహారాణి నిర్మించారని చెప్తారు. ఇక హోటళ్లు, లాడ్జీలు, దుకాణాల్లో ఆఫర్లు ఊరిస్తుంటాయి. దసరా స్పెషల్స్ మెనూలో ప్రత్యేకంగా వుంటాయి. పట్టణానికి 15 కి.మీ దూరంలో వున్న రాంలీలలో రామయణ ఘట్టాలు నిర్వహిస్తుంటారు. చివరి రోజున రావణాసురిడి దిష్టిబొమ్మలను దగ్థం చేస్తారు. ఇక్కడ పది రోజుల పాటు దసరా ఉత్సవాలు జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూ దసరాకు ప్రత్యేకత వుంది. ఇక్కడ అక్టోబర్ మాసం అంతా పండుగ వాతావరణం నిండిపోతుంది. నృత్యాలు, చిత్రలేఖన ప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు గురించి ఎంత చెప్పినా తక్కువే.
చత్తీస్‌గఢ్
చత్తీస్‌గఢ్ జగ్దల్పూర్లో దంతేశ్వరి మాత ఆలయంలో దసరా వేడుకలను 75 రోజుల పాటు వైభవంగా జరుపుకుంటారు. అలాగే బస్తర్ జిల్లా వేడుకలనూ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. పైగా ఎక్కువగా గిరిజనులు నివసించే ప్రదేశమిది. ఇక్కడి దసరా వేడుకలు మిగతా ప్రాంతాలకు భిన్నంగా వుంటాయి. ఇతర రాష్ట్రాలలో అధికంగా దసరాను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటే ఇక్కడ 90 రోజుల పాటు చేస్తారు. ఇక్కడి వేడుకలు మైసూర్ వేడుకలను మరిపిస్తాయని కూడా అంటారు. మిరుమిట్లు గొలిపే బాణా సంచా ఒకవైపు మారుమోగుతుండగా, మరో వైపు డప్పులు, డోళ్ల శబ్దాలు వీనుల విందు చేస్తాయి. వీధులన్నిటినీ పూలతో అలంకరిస్తారు. బస్తర్ ప్రజలు దుర్గాదేవిని దంతేశ్వరి పేరు మీద కొలుస్తారు. బస్తర్ దసరా వేడుకలకు 500 ఏళ్ల చరిత్ర వుంది. ఇక్కడ మరియా, మురియా, అబుజ్ మరియా, దుర్వా, దొర్లా, బాట్రా, హల్బా తెగలకు చెందిన గిరిజనులు ఎక్కువగా వున్నారు. వారంతా కలిసి కట్టుగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. శ్రావణమాసంలో వచ్చే అమావాస్య రోజున దసరా ఉత్సవాలను ప్రారంభిస్తారు. అయితే రథోత్సవాన్ని మాత్రం రెండేళ్లకోమారు నిర్వహిస్తారు. ప్రత్యేక కర్రలతో చేసిన రథాన్ని పటజాత్రా అనిపిలుసుస్తారు. బెడా ఉమర్గావ్కు చెందిన వడ్రంగులు ప్రత్యేక పద్ధతులను అనుసరించి ఈ రథాన్ని తయారుచేస్తారు. ఇందులో ఎక్కడా మేకులను వాడరు. పూర్తిగా తాళ్లతోనో, స్థానికంగా పెరిగే తీగలతోనే వాటిని కడతారు. పూలతో అలంకరించిన రథాన్ని ఉత్సవం పూర్తిచేస్తారు. దీనితో పాటు రథ యాత్రతో పాటు ఊరేగింపు కూడా ఆకర్షణీయంగా వుంటుంది. దారి పొడవునా గిరిజన సంప్రదాయ నృత్యాలు, పాటలు, ఉల్లాసవంతమైన ఆటలు కనువిందు చేస్తాయి. ముగింపు రోజున అంతా కలసి భోజనం చేస్తారు. ఇందుకు ప్రత్యేక ఆకులతో చేసిన విస్తళ్లను ఉపయోగిస్తారు.
మరికొన్ని రాష్ట్రాలలో...
- మహారాష్ట్రలో తొమ్మిది రోజుల పాటు దుర్గ పూజలు చేస్తారు. చివరి రోజున శమీపూజను తప్పక జరుపుకుంటారు. గ్రామ దేవతల ఆలయాలలో ఈ దసరాను చేసుకుంటారు. మహిళలు ఒకరికొకరు పాపిట కుంకుమ పెట్టుకుంటారు.
- తమిళనాడులో కూడా బొమ్మల కొలువు ఆచారం వుంది.
- రాజస్థాన్ రాష్ట్రంలోని కోట పట్టణంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే వివిధ రకాల పండుగలలో దసరా పండుగకు ఒక ప్రత్యేక స్థానం వుంది. పండుగ ప్రారంభం నుంచి చివరి రోజైన విజయదశమి వరకు కళాకారులు ఎటువంటి అలసట లేకుండా నాట్యాలు, కచేరీలు, డ్యాన్సులు, ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతారు.మన సోదర రాష్ట్రమైన తెలంగాణలో దసరా సమయంలో బతుకమ్మ (గౌరి) పండుగను జరుపుకుంటారు.
విజయదశమి గాథలు
మనం చేసుకునే పండుగలు, ఉత్సవాలు, సంబరాల్లో మూఢనమ్మకాలు, చారిత్రక వాస్తవాలు వుంటాయి. పండుగలను విశ్లేషిస్తే అందులో దేవుళ్లూ, మహిమలకు సంబంధించిన నమ్మకాలనూ, వాటి చుట్టూ వున్న పురాణ గాథలనూ, ఆ గాథల వెనుకవున్న చారిత్రక వాస్తవాలను వేరు చేసి చూడగలుగుతాం. పదిరోజులు సాగే దసరా పర్వదినాల్లో చివరి రోజైన విజయదశమినాడు ఉత్తరాదిలో రామలీల ఉత్సవాలు జరుపుతారు. ఆ రోజు రావణాసురుడిపై రాముడు విజయం సాధించాడని వారి నమ్మకం. దక్షిణాదిన దసరా సందర్భంగా రాముణ్ని ఎక్కడా కొలవరు. ఆరోజున అమ్మవారి పండుగలు జరపడమే దక్షిణాది ఆచారం. బెంగాల్లోనూ ఇదే వుంది. దుర్గామాత సింహారూఢురాలై మహిషాసురుడనే రాక్షసుణ్ణి వధించింది కాబట్టి ఆరోజును పండుగగా జరుపుకుంటారు. రెండిటిలోనూ కథలు వేరైనా చెడుపై మంచి సాధించిందన్న విజయానికి చిహ్నంగా దసరాను జరుపుకుంటున్నాం.
బొమ్మల కొలువు
తెలుగునాట దసరా సందర్భంగా బొమ్మల కొలువు పెట్టడం ఆనవాయితీ. బొమ్మల కొలువు ప్రాచీన భారతంలోని వ్యవసాయ రంగంతో వున్న సంబంధ బాంధవ్యాలను వ్యక్తీకరించే సాధనం. పేరుకు తగ్గట్టుగానే బొమ్మల కొలువులో అనేక రకాల బొమ్మలను కొలువు దీరుస్తారు. ప్రధానంగా వీటిలో పలు రకాల దేవతామూర్తులున్నప్పటికీ వీటిలో పక్షి, జంతు బొమ్మలనూ పెడతారు. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబించించే ప్రతిమలతో బొమ్మల కొలువును మరింత అందంగా తీర్చిదిద్దుతారు. వీటిలో అధికశాతం చెక్క బొమ్మలే వుంటాయి. ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను మెరుగు పరిచే సాధనంగా బొమ్మల కొలువును పేర్కొంటారు.
జమ్మి ప్రత్యేకత
దసరా రోజుల్లో జమ్మి చెట్టుకు లభించే ప్రాముఖ్యత ఈనాటిది కాదు. ప్రాచీన కాలం నుంచీ వుంది. ఇనుము ఇంకా అందుబాటులోకి రాని రోజుల్లో ఏ పరికరాన్నయినా రాయి లేదా చెట్టు కొమ్మలతోనే తయారుచేసుకునేవారు. అన్ని కొయ్యల్లోనూ జమ్మి కొయ్య గట్టిగా వుంటుంది. అందుకే ఆ సాధనాల తయారీకీ జమ్మిని వాడేవారు. ఇనుము వచ్చాక అప్పటి వరకు తమకు సాయపడిన జమ్మిచెట్టును పూజించడం ఆరంభించారు. పురాణ గాథ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేప్పుడు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచుకున్నారట. ఆది మానవుడి కాలం నుంచి మనిషికి జమ్మిచెట్టుకి గల అనుబంధమిది. ఆ అనుబంధంతోనే ఇప్పటికీ పండుగ రోజున జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటూ వుంటారు.
ఆయుధ పూజ
దసరా పండుగలో ఆయుధ పూజ ఒక భాగంగా వుంటుంది. ఈ పండుగ సందర్భంగా పూజించే అమ్మవారి చేతిలోనే కాదు. ఎందరో దేవతల చేతుల్లో త్రిశూలం, పాశం, అంకుశం, చక్రం, విల్లు, గద, ఖడ్గం, శూలం... వంటి ఆయుధాలు వుంటాయి. ఈ ఆయుధాలు శత్రువులను వధించడానికి ఉద్దేశించిన ఆయుధాలుగా భావించడం పరిపాటి. ఈ ఆయుధాలను మారణాయుధాలుగా మాత్రమే చూస్తే మానవ తిరోగమనమే మిగులుతుంది. అదే వాటిని జీవించడానికి అవసరమైన వనరులను సంపాదించుకోవడానికి తోడ్పడే పరికరాలుగా చూసినప్పుడు అవి పురోగమన సంకేతాన్ని అందిస్తాయి. మానవ చరిత్రలో మనిషి ఆహార సంపాదనకు ఆయుధాలను తయారు చేసుకున్నాడు. త్రిశూలాన్నే చూద్దాం. చేపలు పట్టుకోవడానికి మనిషి కొయ్యతో తయారుచేసుకున్న పరికరమని పురామానవ శాస్త్రజ్ఞులు అంటారు. అది ఇప్పటిలా మూడు కొనలూ పైకి వుండే ఆయుధం కాదు. ఒక కొన ముందుకీ, రెండు కొనలు వెనక్కీ వుండే పరికరం.చేప శరీరంలోకి గుచ్చి లాగడానికి ఈ ఏర్పాటు అనువుగా వుంటుంది. పాశం విషయానికి వస్తే ఇది కూడా చేపలను పట్టుకోవడానికి ఉద్దేశించినదే. మూల మట్టంగా వుండే ఒక కొయ్యను చక్రంగా మలచుకున్నాడు. ఇది బండి చక్రంలా వుండదు. దీనిని జంతువు మీదకు ఉపయోగించినప్పుడు అది పడనైనా పడుతుంది. గురి తప్పితే తిరిగి చేతికే వచ్చి చేరుతుంది. విల్లు కూడా ఆహార సంపాదనలో భాగంగా వేటాడడానికి చేసుకున్న ఆయుధమే. మనిషి జీవించడానికి తయారుచేసుకున్న ఆయుధాలు తర్వాత సాటి మనిషిని చంపే మారణాయుధాలుగా మారాయి. పూర్వం రాజులు శరత్కాలంలో శత్రు రాజుల మీదకు యుద్ధాలకు వెళ్లేవారు. అలా ఆయుధాలను పూజించే కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే దసరా సందర్భంగా మల్ల యుద్ధ విద్యల ప్రదర్శన కూడా వుండేది. వీరులను సత్కరించేవారు.
- - కె. దర్శిత