ప్రేమ కథలకు లవ్ ఫీల్ కలగాలి. నిజ జీవితంలో ప్రేమికుల నుంచి భార్యాభర్తలైన వారే తెరపై ప్రేమథలో నటిస్తే థ్రిల్‌గా ఉంటుంది. దాన్ని నాగచైతన్య, సమంత 'మజిలీ'లో చూపించారు. వీరిద్దరి ప్రేమ ఎలా ఉంది? అనేది 'నిన్ను కోరి'తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మెప్పించిన శివ నిర్వాణ రూపొందించిన చిత్రమిది. ప్రేమలో మునిగిన వ్యక్తి వివాహానికి ముందు...వివాహం తర్వాత అతని జీవితం ఎలా ఉంటుందన్న దానిపై ఈ సినిమా తీశారు. మొత్తంగా చూస్తే ప్రేమికులను కదిలించే 'మజిలీ'గా తీశారని చెప్పొచ్చు.
నటీనటులు : నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుహాస్, సుబ్బరాజు, రవిప్రకాష్, అతుల్ కులకర్ణి తదితరులు.
సాంకేతికత : ఛాయాగ్రహణం : విష్ణు శర్మ, సంగీతం : గోపీసుందర్, నేపథ్య సంగీతం : తమన్, నిర్మాతలు : సాహు గారపాటి, హరీష్ పెద్ది.
కథ : పూర్ణ (నాగచైతన్య) విశాఖపట్నంలో ఐటీఐ చదువుకుంటూ క్రికెట్లో ఎదగాలని ప్రయత్నిస్తున్న కుర్రాడు. అతడికి అనుకోకుండా అన్షు (దివ్యాంశ కౌశిక్) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. కానీ అనూహ్య పరిస్థితుల్లో అన్షు.. పూర్ణకు దూరమవుతుంది. దీంతో అతను పిచ్చోడైపోతాడు. తాగుడుకు బానిసవుతాడు. ఈ స్థితిలో అతడికి శ్రావణి (సమంత)తో పెళ్లవుతుంది. కానీ శ్రావణిని పట్టించుకోకుండా తన శైలిలో తాను బతుకుతుంటాడు పూర్ణ. ఇంతకీ అన్షు అతడికెందుకు దూరమైంది? ఆమె ఏమైంది? పూర్ణ కోసం శ్రావణి మామూలు మనిషిని చేసిందా? లేదా? అన్నదే కథ.
విశ్లేషణ : ప్రేమకథలో ప్రేమికులు దూరం కావడం ఒకరినొకరు మర్చిపోలేని జ్ఞాపకాలు కలగడం వంటి సినిమాలు తెలుగులో చాలానే వచ్చాయి. ప్రేమంటే ఎలా ఉండాలనేది దర్శకులు రకరకాల కోణాల్లో ఆవిష్కరిస్తున్నారు. ప్రేమకు నిర్వచనం మారిపోతున్న నేపథ్యంలో ఒక ప్రేమకథ ద్వారా ప్రేక్షకుల్లో ఫీల్ తీసుకురావడం అన్నది చాలా కష్టమైన విషయం అయిపోయింది. దీనికి తోడు ప్రేమకథలన్నీ కూడా చాలా వరకు ఒకేలా ఉంటాయి. కొత్తదనం చూపడానికి అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రేమకథలు తెలుగులో అరుదైపోతున్నాయి. ఐతే ప్రేక్షకులకు సంబంధించిన పాత్రల్ని రాసుకుని.. వాటిలో జీవం నింపితే.. మన కథనో.. మన పక్కవాళ్ల కథనో చూస్తున్నాం అని అనిపించే భావన ప్రేక్షకుల్లో తీసుకురాగలిగితే ఆ ప్రేమకథలు మంచి విజయం సాధించడానికి అవకాశముంటుంది. 'నిన్ను కోరి'తో ఈ విషయాన్ని రుజువు చేసిన కొత్త దర్శకుడు శివ నిర్వాణ.. 'మజిలీ'తో మరోసారి మ్యాజిక్ చేశాడు. కథ పరంగా కొత్తదనం ఏమీ లేకపోయినా.. క్యారెక్టర్లను ఓన్ చేసుకుని వాటి తాలూకు భావోద్వేగాల్ని ప్రేక్షకులు ఫీలయ్యేలా చేయడంలోనే 'మజిలీ' ప్రత్యేకత దాగుంది. పూర్ణ.. శ్రావణి.. ఈ పాత్రలు రెండింటితోనూ బాగా కనెక్టయ్యేలా చేయగలిగాడు దర్శకుడు శివ నిర్వాణ. ప్రేమలో విఫలమై పూర్ణ పడుతున్న బాధను మనమూ అనుభవిస్తాం.
సినిమా చూశాక ప్రేక్షకులకు జరగబోయేది తెలియడం వల్ల కొన్ని చిత్రాల ఛాయలు కన్పించడంతో కాస్త ఆసక్తి తగ్గినట్లుంది. విడిపోవడం కలవడం అనేవి ఈ జనరేషన్‌కు కథ కొత్తది అయినా కథనం నిరుత్సాహపర్చిందని చెప్పొచ్చు. మణిరత్నం దర్శకత్వంలో మోహన్, కార్తీక్ నటించిన 'పల్లవి అనుపల్లవి', వీరిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన 'మౌనరాగం', కమల్ 'సాగరసంగమం' వంటి చిత్రాల్లోనే నేపథ్యం కూడా ఇంచుమించు అటువంటిదే కావడం గమనార్హం. మజిలీలో కొత్తదనం ఏమంటే సమంత, నాగచైతన్య నటించడం ప్లస్‌గా చెప్పుకోవచ్చు. తాను దత్తత తీసుకున్న అన్షు కుమార్తెను నేషనల్ స్థాయి క్రికెటర్ చేయాలనేది కోణాన్ని వదిలేసి చైతన్య, సమంతల కలయికతోనే ముగింపు ఇవ్వడంతో అర్థంతరంగా ముగిసినట్లుంది. నటనా పరంగా అందరూ బాగానే చేశారు. 19 ఏళ్ళ కుర్రాడి నుంచి 30ఏళ్ళ పైబడిన వ్యక్తిగా చైతన్యలో రెండు పార్శ్వాలను దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు. సుబ్బరాజు, అతుల్ కులకర్ణి పాత్రలకు తగ్గట్లు నటించారు.
- మురళి