ఎన్టీఆర్ జీవితాన్ని రెండు భాగాలుగా తీశారు దర్శకుడు క్రిష్. అందులో అంతా ఎన్టీఆర్ గొప్పతనాన్నే చాటి చెప్పారు. ఎన్టీఆర్ జీవితాన్నే మార్చేసిన అంకాన్ని మాత్రం ఆయన చిత్రాల్లో చూపించలేదు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిన దగ్గర నుంచి చనిపోయేవరకూ జరిగిన పరిణాలపై తీసిన సినిమాయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఇది లక్ష్మీపార్వతికి అనుకూలంగా ఉన్న చిత్రంగా తెరకెక్కించారు. ఇది వరకూ విడుదలైన 'ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు'లోనూ, 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లోనూ రెండూ కోణాలను సమానంగా చూపించకపోవడం ప్రధాన లోపం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ సినిమా విడుదలపై స్టే విధించడంతో ఏపీలో తప్ప మిగిలిన అన్ని కేంద్రాల్లో ఈ చిత్రం విడుదలైంది.
నటీనటులు
విజయ్ కుమార్, యజ్ఞా శెట్టి, శ్రీతేజ్ తదితరులు ఛాయాగ్రహణం : రామీ, సంగీతం : కళ్యాణి మాలిక్, రచన : రామ్ గోపాల్ వర్మ, నరేంద్ర, నిర్మాతలు : దీప్తి బాలగిరి, రాకేష్ రెడ్డి, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు.
కథ : 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రామారావు తన పార్టీ ఓటమితో ఒక రకమైన నైరాశ్యంలో ఉంటాడు. కొడుకులు, కూతు ళ్ళుకు దూరంగా ఒంటరిగా ఉన్న ఆయన దగ్గరకు జీవిత కథ రాస్తానంటూ లక్ష్మీపార్వతి ప్రవేశిస్తుంది. ఆమె చదువు, వ్యక్తిత్వం నచ్చి తన జీవిత కథను రాసేందుకు ఎన్టీఆర్ అనుమతిస్తాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్త వీరగంధం సుబ్బారావుకూ చెప్పడంతో తనూ ఆమోదిస్తాడు. తర్వాత క్రమక్రమంలో ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అప్పటికే రామారావు కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. అయినా ఎన్టీఆర్ లక్ష్మిని పెళ్లాడతాడు. ఆ తర్వాత 94 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధిస్తాడు. అనంతరం అల్లుడు చంద్రబాబునాయుడ్ని దూరంగా పెడతాడు రామారావు. ఇది జీర్ణించుకోలేని బాబు ఓ పన్నాగం ద్వారా దగ్గరవుతాడు. ఆ తర్వాత ఏమయింది? అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ : తన తల్లితండ్రుల జీవిత చరిత్ర అంటూ బాలకృష్ణ చేసిన సినిమాలు 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'ఎన్టీఆర్ మహానాయకుడు'. బసవతారకం కోణంలో ఎన్టీఆర్ జీవితాన్ని చెప్పే ప్రయత్నం చేసి ఆమె మరణం దగ్గర కథను ఆపేయడంతో అర్థంతరంగా ముగించినట్టుయింది. ఇక 'మహానాయకుడు'లో చంద్రబాబును హీరోగా చూపించాడు బాలకృష్ణ. కానీ చరిత్రలో ఆయన విలన్‌గా ముద్రపడిపోయాడు. అప్పటి పరిస్థితుల బట్టి ఆయన తన మామకు వెన్నుపోటు పొడిచాడనేది పలు వార్తపత్రికల్లోనూ, పలువురు అనుకున్న కథనాలు చెబుతున్నాయి. రామారావు మరణం తర్వాత పలుసార్లు లక్ష్మీపార్వతి తన సాధక బాధలు, రామారావుతో ఉన్నప్పటి సంగతులు ఓ పుస్తకంగా రాసింది కూడా. దానితోపాటు పలు కోణాల్లో ఆలోచించి వర్మ తీశానన్న చిత్రమే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఇది బాలకృష్ణ సినిమాలకు కొనసాగింపుగా చెప్పొచ్చు. 'ఎన్టీఆర్' కథ ఎక్కడైతే ఆగిందో దానికి కొంచెం ముందుకు వెళ్లి.. అక్కడి నుంచి ఆయన జీవిత చరమాంకం వరకు ఇందులో చూపించారు.
మొదట్లో ఈ సినిమాకు సంబంధించి లక్ష్మీపార్వతిని అసలు కలవనే లేదని.. ఆమెకు ఈ సినిమాతో సంబంధమే లేదని వర్మ చెప్పాడు. కానీ ఈ సినిమా చూశాక అవన్నీ అబద్ధాలే అని తేలుతుంది. ఆమె మంచిదనే కోణంలోనే సన్నివేశాలు ఉన్నాయి. ఆమెకు పార్టీ రాజకీయాలతో అసలు సంబంధమే లేదన్నట్లు.. ఆమె ఆమాయకురాలు అన్నట్టు చూపించాడు. ప్రథమార్ధాన్ని ఒక ప్రేమకథలా, ద్వితీయార్థంలో ఓ చోట ఆనందంతో ఇద్దరూ డాన్స్లేస్తూ సినిమాటిక్‌గా తీశాడు. ద్వితీయార్ధమంతా ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా బాబు చేసిన కుట్ర రాజకీయాల వల్ల ఎన్టీఆర్ మరణం నేపథ్యంలో నడుస్తుంది. పెద్దగా రాజకీయాల ప్రస్తావన లేకుండా ఇద్దరి బంధాన్నే ఎస్టాబ్లిష్ చేయడంతో ఒక దశలో నీరసం తెప్పిస్తుంది.
ఇంటర్వెల్ తర్వాత చంద్రబాబునాయుడు పాత్రపైనే శ్రద్ధ పెట్టాడు. పార్టీ ఆమె చేతిలోకి తీసుకుంటున్నదనే కోణంలో ఆలోచించి అటు ఈనాడు అధినేత రామోజీరావుతో మంతనాలు, తన చుట్టూ ఉండే కొందరి ఎత్తుపొడుపులకు రియాక్ట్ అయి ఎం.ఎల్.ఎ.లను తనవైపు తిప్పుకునేలా చేయడం అనేది బాబు కుట్రగా వర్మ విశ్లేషించాడు. ఫైనల్‌గా వైస్రారు ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఈ ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్‌గా సాగుతుంది. ఇంత జరుగుతున్నా నందమూరి కుటుంబ సభ్యులు ఏమీ పట్టించుకోకుండా బాబు ఏది చెబితే అదే అంటూ ఆయన్ను ప్రోత్సహించడంతో వారంతా విరోధులుగా కన్పిస్తారు. కుటుంబ సభ్యులతో ముడిపడ్డ సన్నివేశాల్ని చాలా పేలవంగా ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్టుల్ని ఎంచుకోవడంలో వైఫల్యం వల్ల సన్నివేశం తేలిపోయింది. హడావుడిగా తను అనుకున్నట్లు మరెవరో తీయమన్నట్లో సినిమా చుట్టేసినట్లుంది. అందుకే సెకండాఫ్‌లో రామారావు, లక్ష్మీపార్వతి మధ్య సాగదీత సన్నివేశాలున్నాయి.
ఎన్టీఆర్ పాత్రలో నటించిన విజరు కుమార్ నెల్లూరుకి చెందిన రంగస్థల నటుడు పర్వాలేదనిపించాడు. కొన్ని చోట్ల అచ్చు అలానేఉన్నా మరికొన్ని చోట్ల సరితూగలేదు. హావభావాలు ఓకే. వాయిస్ మిమిక్రీ చేయించారు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ్ నటన హావభావాలు సినిమాలో అతి పెద్ద హైలైట్. పాత్ర తాలూకు కన్నింగ్నెస్గా నటించడంలో శ్రీతేజ్ మెప్పించాడు. అతని డబ్బింగ్ చంద్రబాబులా చెప్పించినా కొన్ని చోట్ల లిప్‌సింక్ అవ్వదు. లక్ష్మీపార్వతి పాత్రలో చేసిన యజ్ఞా శెట్టి మెప్పించింది. మోహన్ బాబుగా చేసిన నటుడు ఆకట్టుకున్నాడు. మిగతా పాత్రల్లో నటించిన వాళ్లెవ్వరూ తమదైన ముద్ర వేయలేకపోయారు.
కళ్యాణి మాలిక్ పాటల్లో కొన్ని బాగున్నాయి. ఎస్పీ బాలు పాడిన 'నువ్వే నా సర్వస్వం' ప్రత్యేకంగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. చంద్రబాబు పాత్ర కనిపించినపుడు.. వెన్నుపోటు ఎపిసోడ్లో వచ్చే నేపథ్య సంగీతం కళ్యాణి మాలిక ముద్రను చూపించాయి. రామీ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు మాత్రం పేలవం. ఫైనల్‌గా చంద్రబాబునాయుడు వెన్నుపోటు దారుడు అనేది వర్మ చెప్పదలచిన అంశం. కానీ అందుకు సహకరించిన వ్యక్తులు రామోజీరావు, నమ్మి సీటు ఇచ్చిన శాససభ్యులే అన్నది కూడా అంతర్లీనంగా వర్మ చెప్పాడు.
- ఎం.