తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని దూసుకుపోతున్న కథానాయిక కాజల్ అగర్వాల్. ఈమె టాలీవుడ్‌కు పరిచయమై పదేళ్లవుతోంది. మొదటిసారిగా తనను తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది దర్శకుడు తేజ. ఆ చిత్రమే 'లక్ష్మీ కళ్యాణం'. ఇప్పుడూ కూడా ఆమె తేజ దర్శకత్వంలో సినిమా చేస్తోంది. అదే రానా హీరోగా 'నేనే రాజు నేనే మంత్రి'. ఇందులో ఈమె కథానాయిక. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇంకొక విశేషం ఏమిటంటే.. ఈ రోజు కాజల్ పుట్టిన రోజు కూడా. ఆమె నటిస్తున్న ఈ చిత్రం 50వది కావడం విశేషం. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ '' ఈ చిత్రంలో నేను రాధ అనే పాత్ర పోషిస్తున్నాను. నన్ను 'లక్ష్మీ కళ్యాణం'తో కథానాయికగా పరిచయం చేసిన తేజ దర్శకత్వంలో దాదాపు పదేళ్ళ తర్వాత నటిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. నేను ఇప్పటివరకూ పోషించని ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. అలాగే.. రాణాతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ప్రతి సన్నివేశం గురించి మాట్లాడుకొని పెర్ఫార్మ్ చేసేవాళ్లం. అన్నిటికంటే ముఖ్యంగా ఇది నా 50వ చిత్రం కావడం ప్రత్యేకమైన విషయం. నా పుట్టినరోజుకు ఇంతకు మించిన బహుమతి మరొకటి ఉండదు' అని పేర్కొంది. ఇందులో కాజల్‌తో పాటు కేథరిన్ థెరిస్సా ముఖ్యపాత్ర పోషిస్తుంది. సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. అనూప్ రూబెన్స్ బాణీలు సమకూరుస్తున్నారు.
ఇంతకుమించిన బహుమతా!
