యానిమేషన్ చిత్రాలనగానే మనకు హాలీవుడ్ గుర్తొచ్చేస్తుంది. అంతర్జాతీయ అవార్డుల్ని అందుకున్న భారతీయ యానిమేషన్ చిత్ర దర్శకురాలు మనకు ఒకరున్నారనే విషయం ఎంతమందికి తెలుసు. ఆమె పేరు గీతాంజలి రావ్. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్న ఆమెవన్నీ ఇండిపెండెంట్ చిత్రాలే. 2006లో 'ప్రింటెడ్ రెయిన్బో' చిత్రంతో కేన్స్ చిత్రోత్సవంలో మూడు పురస్కారాల్ని అందుకుని తన ముద్ర వేసింది. యానిమేషన్ చిత్రాల గురించి పెద్దగా అవగాహన లేని మన దేశం నుంచి వచ్చినా ఆమె ఎన్నో 'బెస్ట్ షార్ట్స్'ను తీసి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు.
ముంబైలోని జేజే కళా కేంద్రంలో 'ఇల్లస్ట్రేషన్' ప్రధాన పాఠ్యాంశంగా డిగ్రీ చేసిన గీతాంజలి రావ్ రంగస్థల కళాకారిణి.
- 2006లో ఆమె తీసిన 'ప్రింటెడ్ రెయిన్బో' చిత్రాన్ని వందకు పైగా చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. 'ఆస్కార్ అవార్డు'కు షార్ట్‌లిస్ట్ అయ్యింది. 25 అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి.
- పెంపుడు పిల్లి తప్ప ఇంకేమీ లేని ఓ వృద్ధురాలు అగ్గిపెట్టెల మీదుండే చిత్రాల లోకంలో మునిగి ఒంటరితనాన్ని ఎలా పోగొట్టుకుందనేది 'ప్రింటెడ్ రెయిన్బో' కథాంశం. 15 నిమిషాల నిడివితో రూపొందిందీ ఈ లఘుచిత్రం.
- పాత విధానంలోలా కేన్వాస్ మీద చిత్రీకరించిన చిత్రాల ద్వారా యానిమేషన్ చేస్తుంది గీతాంజలి. ఆమెతో కలసి 30 మంది చిత్రకారులు పనిచేస్తారు.
- ఒక్క మాట కూడా లేకుండా కేవలం నిమిషం నిడివితో ఆమె తీసిన 'బ్లూ' చిత్రం.. అంతరిక్షంపై ఓ చిన్నారికుండే కలల్ని చూపెడుతుంది. రంగు పెన్సిళ్లు, కాగితాల మీద చిత్రీకరించిన షార్ట్ ఇది.
- ఇదే కాదు, ఒక్క మాట లేకుండా 80 నిమిషాల నిడివితో ఆమె 'గిర్గిత్' ప్రాజెక్ట్‌ను చేపట్టింది. జానపద కళల్లోని వైవిధ్యాన్ని, విలక్షణతల్ని దీనిలో హైలెట్ చేస్తూ చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది.
- పెద్దలకు యానిమేషన్ చిత్రాలు ఉంటాయనే విషయం చాలామందికి తెలీదు. గీతాంజలి చిత్రాలు ఈ తరహావే. 'ఆరెంజ్', 'బ్లూ', 'గిర్గిత్', 'కైలడొస్కోప్', 'ట్రూ లవ్‌స్టోరీ'లు ఈ కోవకి చెందినవి.
- ఒక్కో పూర్తి స్థాయి యానిమేషన్ చిత్రానికి నాలుగేళ్ల వరకు పడుతుంది. బడ్జెట్ ఎక్కువే.
ఈ అడ్డంకే ఆమెకు పెద్ద చిత్రాలను తీసే అవకాశం ఇవ్వడంలేదు.
- ఓ కఠిన వాస్తవాన్ని కవితాత్మకంగా చెప్పేందుకు ఫొటోగ్రఫీ, యానిమేషన్ అవకాశమిస్తాయనే గీతాంజలి చిత్రాల నిండా సామాన్యుడి సమస్యలే మెదులుతాయి.
- తను సొంతంగా సినిమాలు నిర్మించుకునే ఆర్థిక వెసులుబాటు కోసం యానిమేషన్ యాడ్స్‌ను రూపొందిస్తున్నారు. వీటికీ పురస్కారాలు వచ్చాయి.
- ముంబైకొచ్చే వలస కూలీల జీవితాలపై ఆమె తీసిన 'బాంబే రోజ్' చిత్రం ఉత్తమ చిత్రంగా అవార్డులను అందుకుంది. ఓ కాశ్మీరీ యువకుడు, మధ్యప్రదేశ్ అమ్మాయి మధ్య ప్రేమ కథ ఇది.
- బాలీవుడ్లో ఓ నిరుపేద ఆకాంక్షలు నెరవేరడం ఎందుకు కష్టమో.. ఆ చిత్రసీమ ఎంత ప్రమాదకరమైందో అనే విషయాన్ని కథావస్తువుగా తీసుకుని ఆమె పూర్తిస్థాయి చిత్రాన్ని రూపొందించే సాహసం చేసింది. కానీ ఆర్థిక కారణాలతో దాన్ని షార్ట్ఫిల్మ్గా మార్చింది. దీనికి కూడా కేన్స్ చిత్రోత్సవంలో ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్ మీద అంతర్జాతీయ అభిప్రాయాన్ని మార్చేందుకు ఇది ఉపయోగపడింది.
- ప్రస్తుత కాలంలోని సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి చిన్నారులకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు 'షాడోస్ ఆఫ్ ది మహాభారత' చిత్రాన్ని రచించింది. ఈ చిత్రాన్ని నిర్మించేందు కు వాల్ట్ డిస్నీ ఇండియా సంస్థ ముందు కొచ్చినా ఆర్థిక కారణాలతో పూర్తి చేయలేదు. ఈ చిత్రం కోసం ఆమె ఏకంగా ఏడాదిన్నర పనిచేసింది.
- 2011లో కేన్స్ క్రిటిక్స్ వీక్‌లో భాగమైన షార్ట్ ఫిల్మ్ న్యాయనిర్ణేతల బృందంలో ఆమె ఒకరు. ఆ తర్వాత మరికొన్ని అంతర్జాతీయ చిత్రోత్సవాల జ్యురీలో సేవలు అందించింది.
- మన ఆకాంక్షల్ని సెల్ఫీల్లో అద్దంపడితే ఎలా ఉంటుందా అనే దానిపై 'విష్ఫీ' అనే ఆల్బమ్ విడుదల చేసింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చేగువెరా, ఫ్రీదా కల్హో, సైమన్ డి బ్యూవర్, టర్కోవ్స్కీ, అమృతా షేర్గిల్, స్మితా పాటిల్, మధుబాల, గురుదత్ వంటి ప్రముఖుల చిత్రాల్ని జతచేసి ఆమె దిగిన సెల్ఫీల్ని చాలామంది ఫాలో అయ్యారు. ప్రఖ్యాత తైల వర్ణచిత్రాల్లోను తన ఆకాంక్షల్ని ప్రతిఫలించేలా దిగిన సెల్ఫీలు కళాత్మకతను జోడించాయి.
- ఇప్పటి వరకు ఆమెకు 28కి పైగా అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. వాటిల్లో ప్రఖ్యాత కొడాక్ షార్ట్‌ఫిల్మ్ అవార్డు, యంగ్ క్రిటిక్స్ అవార్డులాంటివి ఉన్నాయి.
- జపాన్, రష్యా, పోలండ్ వంటి దేశాల్లో యానిమేషన్ చిత్రాలకు ఆదరణ ఎక్కువ. పెద్దవారు కూడా వీటిని చూస్తారు. అలాంటి ఆదరణ ఇక్కడ కూడా వస్తే మరికొంత మంది గీతాంజలిలను మనం చూడొచ్చు.
- జేఎస్