శోభన్‌బాబు పేరు వినిపిస్తే విలక్షణమైన హీరో గుర్తొస్తాడు. అదే పేరుతో ఇప్పుడో సినిమా వస్తోంది. అందులో 'అందాల రాక్షసి' ఫేమ్ రాహుల్ రవీంద్రన్ నటిస్తున్నాడు. టైటిల్‌కు బాగా సూటయ్యే యువ హీరో అని చాలామంది అంటున్నారు. తమిళ తెరపై పరిచయమై తెలుగులో స్థిరపడుతోన్న హీరోల్లో ఒకడిగా రాహుల్‌ను చెప్పుకోవచ్చు. తను ప్రేమించేది తెలుగు చిత్ర పరిశ్రమనే. ఈ యువ స్టార్ హీరో గురించి కొన్ని వివరాలు మీ కోసం...
రాహుల్ రవీంద్రన్‌ది చెన్నై. తంజావూర్ నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబం.
- విద్యా మందిర్ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివాక కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.
- బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసే సమయంలో కొన్నాళ్లు ముంబైలో ఉన్నాడు. అప్పుడే ఓ ప్రముఖ మీడియా కంపెనీలో అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్‌గా పనిచేశాడు.
- ముంబైలో ఉన్నప్పుడే అనుకోకుండా యాడ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. దర్శకుడు దిబాకర్ బెనర్జీ ఓ రెస్టారెంట్లో రాహుల్‌ను చూసి అవకాశాన్నిచ్చాడు.
- 2005లో ఓ షార్ట్‌ఫిల్మ్‌కు స్క్రిప్ట్ రాసుకున్నాడు. ముంబైలోనే దాన్ని ఇంగ్లిష్-హిందీ వెర్షన్లలో తీద్దామనుకున్నాడు కానీ అది అటకెక్కింది.
- మరిన్ని కమర్షియల్స్‌లో చేస్తూనే డబ్బింగ్ కూడా చెప్పేవాడు. ముఖ్యంగా చిన్నపిల్లల కార్టూన్ ప్రోగ్రామ్‌లకు తమిళ్ లీడ్ వాయిస్‌ను ఇచ్చేవాడు.
- పవర్ రేంజర్స్‌లో రెడ్ రేంజర్‌కు తమిళ్లో గొంతునిచ్చింది రాహులే. అలాగే పవర్ రేంజర్స్ ఎస్‌పిడిలో మిస్టిక్ ఫోర్స్, వైట్ రేంజర్ పాత్రలకు డబ్బింగ్ చెప్పాడు.
- తర్వాత దర్శకత్వ శాఖపై ఇష్టంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశాల కోసం చెన్నై వచ్చేశాడు. ఈ సమయంలోనే 2006లో తమిళ్ ఫ్లిక్ 'మద్రాసీ'లో ఓ పాత్ర చేశాడు.
- 'మాస్కోవిన్ కావెరీ' (2010) చిత్రంలో నటించేందుకు అవకాశం దక్కింది. దర్శకుడు రవి వర్మన్ ఓ యాడ్‌లో రాహుల్‌ను చూసి ఈ చిత్రానికి ఎంపిక చేశాడు.
- 'మాస్కోవిన్ కావెరీ'లో సమంత కూడా నటించింది. అప్పుడామె ఇంకా స్టార్‌గా మారలేదు. థమన్ సంగీతం అందించిన తొలి చిత్రాల్లో అదొకటి. కానీ ఆ చిత్రం ఆలస్యంగా పూర్తయింది. అనుకున్న ఫలితాన్నివ్వలేదు.
- ఈ చిత్రం తర్వాత విఘ్నేష్ మీనన్ 'విన్మీంగల్'లో అవకాశమిచ్చాడు. సెరెబ్రల్ పాల్సీతో కుర్చీకే పరిమితమైన ఓ కుర్రాడి కథ అది. కేవలం శారీరికంగానే కాక మానసికంగాను ఆ పాత్రలో ఒదిగిపోయాడని రాహుల్‌కు ప్రశంసలు దక్కాయి.
- తమిళ్లో మూడో చిత్రం 'సూర్యనగరం' తర్వాత 2012లో తెలుగులో 'అందాల రాక్షసి'లో అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో సాటి హీరోతో పోటాపోటీగా నటించి మంచి మార్కులు వేసుకున్నాడు. ఆ చిత్రంతోనే స్టార్ ఇమేజ్ వచ్చేసింది.
- 'అందాల రాక్షసి' తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి. తమిళ్లో ఓ సపోర్ట్ రోల్ చేశాక తెలుగులో వెంట వెంటనే 'పెళ్లి పుస్తకం', 'నేనేం చిన్నపిల్లనా...' చిత్రాలు వచ్చినా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
- 2012లోనే 'హౌజ్ ఆఫ్ అబాండన్డ్ రోబోట్స్' అనే ఆంగ్ల చిత్రంలో నటించాడు. ఇదింకా విడుదల కాలేదు.
- 2014లో వచ్చిన 'గాలిపటం', 'టైగర్'లు అంతగా ఆకట్టుకోలేకున్నా 'అలా ఎలా' మళ్లీ కెరీర్ పుంజుకునేలా చేసింది.
- 'హైదరాబాదీ లవ్‌స్టోరీ' అనే తెలుగు చిత్రం, 'పల్నాడు వాజ్గా' అనే తమిళ్ చిత్రం నిర్మాణం కావాల్సిఉంది.
- ఈ మధ్యలో మహేష్ బాబు 'శ్రీమంతుడు'లో ప్రత్యేక పాత్రలో కనిపించాడు రాహుల్.
- ప్రముఖ గాయని చిన్మయితో ప్రేమలో పడిన రాహుల్ ఆమెనే పెళ్లాడాడు.
- రాహుల్‌కు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. తన మొబైల్‌తోనే ఆసక్తి అనిపించిన దృశ్యాల్ని ఫొటోలు తీసి ట్విట్టర్లో ఫొటోబ్లాగ్లుగా పెట్టేస్తుంటాడు.
- సమాజానికి, వ్యక్తిగత స్వభావానికి మధ్య నలిగిపోయే వ్యక్తి జీవితం మీద తెరకెక్కిన 'కూల్ హ్యాండ్ ల్యూక్' 1967 చిత్రమంటే రాహుల్‌కు ఆల్‌టైమ్ ఫేవరెట్. ఈ చిత్రాన్ని 40 సార్లకు పైనే చూశాడట. ఈ చిత్రంలో నటించి పాల్ న్యూమాన్ రాహుల్‌కు ఆరాధ్య నటుడు.
- సత్యజిత్ రే ప్రతిష్టాత్మక చిత్రం 'పథేర్ పాంచాలి' తర్వాత 'అపు' ట్రయాలజీలో వచ్చిన 'అపరాజితో'కి వీరాభిమాని. సామాన్యుని కష్టాల్ని, కన్నీళ్లని, జీవితాన్నే ఎపిక్‌గా మలిచిన ఆ చిత్రాన్ని ఎన్నిసార్లైనా చూస్తాడట.
- ప్రపంచాన్ని తలకిందులు చేసే శక్తి ఉన్న వ్యక్తులు కూడా అందరిలాగే భావోద్వేగాలతో, వ్యామోహాలతో సామాన్యంగానే కనిపిస్తారని చెప్పే 'డాక్టర్ స్ట్రేంజ్‌లవ్' ఆంగ్ల చిత్రంతో పాటు అమ్మ విలువ చెప్పే స్పానిష్ చిత్రమైన 'టోడో సొబ్రే మి మాద్రే', యుద్ధ బీభత్సాన్ని, ప్రభుత్వాల చెలగాటాన్ని కళ్లకు కట్టి స్థాణువుల్ని చేసే జపనీస్ యానిమేషన్ చిత్రం 'గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్' రాహుల్‌కు ఫేవరెట్ చిత్రాలు.
- రివ్యూల్లా కాకుండా తన ఆలోచనల్లా కొత్త చిత్రాల గురించి అభిప్రాయాలు పంచుకుంటాడు. వాటిలో కీలక విషయాలను చాలా అద్భుతంగా విశ్లేషిస్తూ సినిమా తీసే కష్టాన్ని అర్థం చేసుకునేలా చెప్తాడు.
- ఆంగ్లంలో కవిత్వం రాయడం కూడా ఓ అభిరుచి. తను తీసిన ప్రతీకాత్మక చిత్రాలను తన కవిత్వానికి వాడుతుంటాడు. అలాగే క్రీడలన్నా అభిమానమే.
- జేఎస్