''మీర జాలగలడా నా ఆనతి.. వ్రత విధాన మహిమన్ సత్యావతి..'' అంటూ ఒక చేత వాలుజడ పట్టుకుని మరో చెయ్యి నడుం మీద గర్వంగా వేస్తూ.. చురకత్తి లాంటి చూపులతో ఆగ్రహావేశాన్ని అందంగా ప్రదర్శించిన ఆ సమ్మోహన రూపం ఎవరికుంటుంది! ఒక్క జమునకు తప్ప.
జమున కర్నాటకలోని హంపిలో పుట్టినా.. పెరిగింది మాత్రం గుంటూరు జిల్లా దుగ్గిరాలలోనే. శ్రీనివాసరావు, కౌశల్యాదేవి దంపతుల ముద్దుల కూతురు జమున.
తనకున్న సంగీత ప్రవేశంతో జమునకి చిన్నతనంలోనే సంగీతం నేర్పించింది కౌశల్య. హార్మోనియం వాయిస్తూ హావభావాలు ప్రదర్శిస్తూ చిన్నతనంలోనే శృతి శ్రద్ధగా పాడటం చూసి తల్లిదండ్రులు మురిసిపోయే వారు. స్కూల్లో ఏ సాంస్కృతిక కార్యక్రమాలు చేసినా జమున ముందుండేది. ఆ విభాగం నిర్వహించే టీచర్లు ముచ్చటపడేవారు. అదే సమయంలో మహానటి సావిత్రి కూడా సత్యనారాయణపురం (విజయవాడ)లో వుంటూ మద్దాల సుశీలతో కలిసి సంగీత నృత్యప్రదర్శన ఇస్తూ ఉండేది. దుగ్గిరాలలో ఓ నృత్య ప్రదర్శన ఇస్తుండగా వారికి జమున తండ్రి తన ఇంట్లోనే విడిది ఏర్పాటు చేశాడు. రంగస్థలం మీద సావిత్రి ప్రదర్శన ఇస్తుండగా.. తన ప్రదర్శనకి అనుగుణంగా జమున హాస్య ప్రదర్శనలు చూసి మురిసిపోయింది సావిత్రి. ''నువ్వు సినిమాల్లో చేరితే బ్రహ్మాండంగా రాణిస్తావు చెల్లీ!'' అంది. చెల్లీ అనే మాటను కొన ఊపిరి వున్నంత వరకు ఇద్దరూ నిలబెట్టుకున్నారు. సావిత్రి జమునల మధ్య అక్కా చెల్లెళ్ళ బంధం కొనసాగింది. జమున పెళ్ళిని సావిత్రి దగ్గరుండి జరిపించింది. ఇదే వారి అనుబంధానికి తార్కాణం.
ఆ రోజుల్లో గరికపాటి రాజారావు గొప్ప నాటక ప్రయోక్త. ఔత్సాహిక కళాకారుల్ని ప్రోత్సహించేవారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోషియేషన్ ఏర్పాటు చేసి మంచి నటన ప్రదర్శించేవారిని ఎంపిక చేసేవారు. అలా ''మాభూమి'' ప్రదర్శన ఇస్తున్నప్పుడు జమున స్టేజీ ఫియర్ అస్సలు లేకుండా చకచక కళ్ళు తిప్పుతూ.. అలవోకగా నవరసాలు పలికిస్తూ.. ప్రేక్షకుల హర్షధ్వానాల్ని సొంతం చేసుకున్న పన్నెండేళ్ళ జమున రాజారావు గార్ని కట్టిపడేసింది. సినిమాలో నటిస్తావా? అని అడిగాడు ఆయన. ఓ... అంది జమున. తండ్రి శ్రీనివాసరావుకి అస్సలు ఇష్టంలేదు. తల్లి కౌశల్యాదేవికి మాత్రం ఇష్టమే. అది బైటికి చెప్పే ధైర్యం లేదు. చివరికి తనకు దుగ్గిరాలలో పాఠాలు చెప్పిన జగ్గయ్య ప్రోద్బలంతో జమున సినీరంగ ప్రవేశం జరిగిపోయింది.
తన పద్నాలుగవ ఏట జమున ''పుట్టిల్లు'' చిత్రంలో నటించింది. అప్పటికే భానుమతి, అంజలి, సావిత్రి, యస్.వరలక్ష్మి కథానాయికలుగా రాణిస్తున్నారు. వారి మధ్య జమున నెగ్గుకురాగలదా? అని అందరూ భయపడ్డారు. అదే సమయంలో వాహిని సంస్థ ''బంగారు పాప'' చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి పనిచేయడానికి ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజు చెన్నై వచ్చారు. జగ్గయ్య సరసన జమున నటించింది. ఈ చిత్రం ఇప్పటికీ క్లాసిక్‌గా నిలిచిపోయింది. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో జగపతి సంస్థ అధినేత వి.బి. రాజేంద్రప్రసాద్ రావు గారి తొలి చిత్రం 'అన్నపూర్ణ'లో నటించింది. వి.బి. రాజేంద్రప్రసాద్‌ను ఏస్ నిర్మాతగా నిలబెట్టింది ఆ చిత్రం.
వామపక్ష భావాలతో చిత్ర నిర్మాణం మొదలుపెట్టిన కె.బి.తిలక్ అనుపమ సంస్థను స్థాపించి మొట్టమొదటిసారిగా ''ముద్దుబిడ్డ'' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సంచలనం సృష్టించింది. పెండ్యాల స్వరపరిచిన పాటలు ఇప్పటికీ మరిచిపోలేని ప్రేక్షకులు వున్నారు. 'చూడాలని వుంది.. అమ్మా చూడాలని వుంది.. పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి!' అంటూ సుశీల వెక్కివెక్కి ఏడుస్తూ.. పాడిన పాట విని విలవిల్లాడిపోయిన తల్లులెందరో. ఈ చిత్రంలోనూ కథానాయకుడు జగ్గయ్యే. పొన్నలూరి బ్రదర్స్, బి.యన్. రెడ్డి దర్శకత్వంలో 'భాగ్యరేఖ' చిత్రం నిర్మించింది. ఈ చిత్రంలో జమున పాటగా సుశీల పాడిన 'నీవుండేదా కొండపై నా స్వామి నేనుండేదీ నేలపై ఏ వేళ సేవింతునో ఓ స్వామి..' అంటూ సాగిన ఈ పాటకి జమున జీవం పోసింది. ఈ పాటతో జమున మహిళలందరికీ చేరువయ్యింది. జమున చిన్న వయసులోనే అగ్రకథానాయకుడు యన్.టి.రామారావుతో 'చిరంజీవులు' చిత్రంలో నటించింది. వేదాంతం రాఘవయ్య దర్శకుడు. యన్.టి.ఆర్., జమున పోటీపడి నటించారు.
గీతా లత
'కనుపాప కరువైన కనులెందుకో.. తనవారు పరులైన బ్రతుకెందుకో..' పాట మరిచిపోగలమా! ఈ సినిమాతో జమున క్లాస్‌తో పాటు మాస్‌కి కూడా దగ్గరయ్యింది. తెలుగు ప్రేక్షకులు జమునని సొంతం చేసుకున్నారు. యల్వీప్రసాద్ దర్శకత్వంలో 'మిస్సమ్మ' చిత్రంలో అక్కినేని సరసన హుషారైన పాత్రల్లో పోటీపడి నటించింది. అలాగే అక్కినేని కాంబినేషన్ ''ఇల్లరికం'' చిత్రంలో 'నిలువవే వాలు కనులదానా.. వయ్యారి హంస నడకదానా..' పాట ఆంధ్రదేశమంతా మార్మోగిపోయింది. జమున అందానికి ముగ్ధులైపోయారు. సి.యస్.రావు దర్శకత్వంలో 'కీలు బొమ్మలు', ఆదుర్తి దర్శకత్వంలో 'తోడు నీడ' మరిచిపోలేని చిత్రాలు. అంతకుముందు దర్శకుడు కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'పెళ్ళినాటి ప్రమాణాలు', అక్కినేని సరసన రొమాంటిక్ పాత్రలో నూటికి నూరు మార్కులు సంపాదించింది. 'వెన్నెలలోనే వేడియేలనో.. వేడిమిలోనే చలువ యేలనో.. ఈ మాయ ఏమో జాబిలీ..' ఆ రోజుల్లో యువతరాన్ని ఈ పాట ఊపేసింది.
నటన వైవిధ్యభరితం
జమున స్వతహాగా పాటలు పాడగలదు. సంగీతంలో ప్రవేశముంది గనుక పద్యాలు పాడగలదు. 'శ్రీకృష్ణ తులాభారం' చిత్రంలో సత్యభామ పాత్ర మచ్చుతునక. 'మీర జాలగలడా..' అని హూంకరిస్తూ కృష్ణుడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసే సత్య పాత్రను కళ్లకు కట్టింది. డబ్బున్న అమ్మాయి, పొగరుబోతు అమ్మాయి, అహంకారి అమ్మాయి పాత్రలకు జమున అచ్చుగుద్దినట్టు సరిపోతుందని అనుకుంటారు. కానీ, 'మూగమనసులు' చిత్రంలో అమాయకమైన పాత్ర ఎంత గొప్పగా చేసిందని.. ఆ రోజుల్లో జమునని అనుసరించిన అభిమానులు కోకొల్లలు. నాటి 'భూకైలాస్' చిత్రం నుంచి బాపుగారి 'సీతాకళ్యాణం' చిత్రం వరకు ఆమె నటించిన పాత్రలు అనితర సాధ్యం. కలెక్టర్ జానకి, పండంటి కాపురం, బంగారుతల్లి, లేత మనుసులు, మూగనోములు, సంగీత లక్ష్మి, రాము, తోడు నీడ, తహసీల్దారు గారమ్మాయి, చదరంగం ఇలా ఎన్నో చిత్రాలు. పౌరాణిక చిత్రాలైనా, జానపద చిత్రాలైనా, సాంఘిక చిత్రాలైనా జమున అద్భుతంగా నటించేది. బంగారు తల్లి చిత్రంలో నేషనల్ అవార్డు మిస్సయ్యింది. జమున కెరీర్ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో అగ్రనటులతో నటించే అవకాశాలు తగ్గాయి. కారణాలు తెలీవు. ఆ సమయంలో వరుసగా జగ్గయ్యతో చిత్రాలు చేసింది. మళ్ళీ 'గుండమ్మ కథ', 'గుళేబకావళి' చిత్రాలతో అక్కినేని, యన్.టి.ఆర్ల సరసన నటించింది. వీరి మధ్య దూరం తగ్గిపోయింది. ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వంలో వచ్చిన 'నాదీ ఆడజన్మే!' చిత్రంలో జమున హరనాథ్ సరసన నటించింది. ఈ జంటను సూపర్ హిట్ జంటగా ప్రేక్షకులు దీవించారు. తర్వాత 'లేతమనుసులు' చిత్రంలో జమున, హరనాథ్‌లు అలరించారు. ఆ చిత్రంలో నటిస్తుండగా (జయశంకర్) తలకు తగిలిన గాయం ఆమె జీవితంలో ఎదురుదెబ్బ.
వ్యక్తిగత జీవితం
1965లో తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో పనిచేస్తున్న ప్రొఫెసరు రామారావుని జమున పెళ్ళాడింది. విద్యాధికుడైన వ్యక్తిని స్థాయి భేదం లేకుండా పెళ్ళిచేసుకోవాలనుకుంది. మహానటి సావిత్రి ప్రోద్బలంతో పెళ్ళి చేసుకుంది. వీరికిద్దరు చిన్నారులు స్రవంతి, వంశీ. వంశీ అమెరికాలో వుంటున్నాడు. ఆ రోజుల్లో రాజమండ్రి ఎంపీగా గెలుపొంది లోక్‌సభలో ప్రజావాణిని వినిపించింది. జమున జీవితంలో అతి ముఖ్యమైన విషయం వృత్తి కళాకారులను, నిరుపేద కళాకారులను గుర్తించి వారికి సేవలందించడం. ఆమె పేరిట రాజమండ్రిలో 'జమున కాలనీ' నెలకొల్పింది. ఇప్పటికీ అది కళల సమాహారంగా శోభిల్లడం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకం. జమున పౌరాణిక నాటకాలను పండించిన దిట్ట. పౌరాణిక కళాకారులతో వేల ప్రదర్శనలిచ్చి వారి జీవితంలో వెలుగులు నింపారు. వృత్తి కళాకారులందరినీ సాంస్కృతిక శాఖలో పొందుపరిచి వారికి జీవిత కాలం జీవన భృతి వచ్చే విధంగా కృషి చెయ్యడం ఎప్పటికీ గుర్తుండిపోయే విశేషం. ఆ తర్వాత రాజకీయాలు తన ఒంటికి సరిపడవని దూరంగా వుంది.
అవార్డులు.. రివార్డులు
జమున జీవితంలో అవార్డుల పంట పండించిన చిత్రంగా 'బంగారు తల్లి' చిత్రాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 'మూగమనసులు' చిత్రంలో గౌరి పాత్ర మరపురానిది. ఆ చిత్రానికి ప్రభుత్వ, స్వచ్ఛంద సేవా సంస్థల అవార్డులు గెలుచుకుంది. జమున జీవితంలో క్లాసిక్స్‌గా నిలిచిపోయే చిత్రాలు చాలా వున్నాయి. బంగారు పాప, చిరంజీవులు, భాగ్యరేఖ, కీలు బొమ్మలు, భూ కైలాస్, ముద్దుబిడ్డ, పెళ్ళి నాటి ప్రమాణాలు ఇలా ఎన్నో చిత్రాలు. ఆమె ఏ రోజు అవార్డుల కోసం వెంపర్లాడలేదు. ఎన్.టి.ఆర్., ఎ.యన్.ఆర్.లతో కలిసి పోటీ పడి నటించిన వ్యక్తి జమున. ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ప్రజానటిగా పేరు సంపాదించి ప్రజా జీవితంలో మమేకమై ప్రజల ప్రేమాభి మానాలను మించిన అవార్డులు ఏముంటాయి అంటుంది. మరొకర్ని ఆమెతో పోల్చడానికి వీల్లేదు. జమునకు సాటి జమునే!
- ఇమంది రామారావు,
9010133844