రోళ్లు పగల కొట్టే రోహిణి కార్తె తరువాత తొలకరి పలకరింపుతో పుడమి తల్లి పులకరించిపోతుంది. నీలి మేఘాల ఆకాశం కారుమబ్బుల కొత్త రంగును పులుముకుంటుంది. ఆ మబ్బులను తొలుచుకుంటూ నేలమీదకు జాలువారే ప్రతి నీటి బొట్టూ ఒకొక్క అమృత బిందువవుతుంది. బీడువారి, బీటలు వారిన భూములు కొత్త సొగసులు అద్దుకుంటాయి. చిటపట చినుకులతో తడిసిన మట్టి గమ్మత్తుగా సువాసనలను వెదజల్లుతుంది. కర్షక వీరులు కర్మ జలాలను చిందించడానికి నూతనోత్సాహంతో సిద్ధమవుతారు. వానా వానా వల్లప్పా ...అంటూ చిన్నారులు చిరుజల్లులకు స్వాగతం పలుకుతారు. రుతుపవానాలు తీసుకువచ్చే తొలకరి జల్లుల చుట్టూ అల్లుకున్న అనుబంధాలివి!
పెరిగిన పట్టణీకరణ, తప్పనిసరై బుర్రకెక్కించుకుంటున్న ఆంగ్ల చదువులు 'రెయిన్...రెయిన్ గో అవే ...' అని రాగాలు తీయిస్తున్నప్పటికీ తొలి చినుకుల పలకరింపు పల్లెటూరి పేగును కదిలించి పులకరింపచేస్తుంది. అందుకే నలుపు, తెలుపు రోజుల నుండి అత్యాధునికతను అంతరించుకున్న ఇప్పటి వరకు సినిమాల్లో వానపాటలంటే అంత క్రేజ్...! చిటపట చినుకులకు ఒక రచయిత చెలికాడిని తోడు తెచ్చుకుంటే, మరొకరు రాకరాక గాలివాన వస్తే తడవకుండా ఉండనా ఇంటిలోనా అని ప్రశ్నిస్తారు. నువ్వొస్తానంటే... నే వద్దంటానా! అంటూ చిరుజల్లులలో ఒక నాయిక వేసిన చిందులు మరచిపోలేం! ఇంతటి హర్షాన్ని పంచే తొలకరి జల్లుల కథేమిటి? రుతురాగాలు చెప్పే విషయాలేమిటి? ఈ వారం అట్టమీది కథలో.
కేరళలో రుతుపవనాల సందడి ప్రారంభమైంది. జూన్ ఒకటవ తేదీన రుతుపవనాలు కేరళను పలకరిస్తాయన్నది వాతవారణ శాఖ వేసిన తొలి అంచనా! ఆ తరువాత ఈ నెల 30, 31వ తేదీల్లోనే రుతుపవనాలు వచ్చేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, రుతుపవనాల రాకకు ముందే ముందస్తు వర్షాలు కేరళను పలకరిస్తున్నాయి. రుతుపవనాల ప్రవేశం తరువాత ఈ వర్షపు జోరు మరింత పెరగనుంది. వర్షాలతో పాటే రుతుపవనాల తొలి పలకరి ంపునకు పులకరించిపోవడానికి పెద్ద ఎత్తున పర్యాటకులూ ఆ రాష్ట్రానికి బారులు తీరనున్నారు. మండు వేసవి తరువాత తొలకరి జల్లుల తొలి పలకరింపు భాగ్యం కేరళదే! ప్రతి ఏడాది మే నెలాఖరు నుండి జూన్ ఒకటి, రెండు తేదీల్లోగా రుతుపవనాలు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంతో పాటు పరిసర ప్రాంతాల్లోకి తొలుత ప్రవేశిస్తాయి. అక్కడి నుండి జులై నెలాఖరు నాటికి దేశమంతా వ్యాపిస్తాయి. మే నెలాఖరులో కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు తమిళనాడు, కర్నాటకల మీదగా మన రాష్ట్రానికి చేరుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో తొలి తొలకరి జల్లులు కురుస్తాయి. మన రాష్ట్రం నుండి బంగాళాఖాతం మీదుగా త్రిపుర, మణిపూర్ వరకు ఇవి విస్తరిస్తాయి. సెప్టెంబర్ నెల వరకు ఈ రుతుపవనాల ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంటుంది.
రుతుపవనాలు అంటే ...!
కాలానుగుణంగా గాలి పయనంలో జరిగే ఒక మార్పును రుతుపవనం అంటాం. అప్పటిదాకా ఒక ప్రాంతంలో ఉన్న గాలి స్థానంలో కొత్తగా బలంగా వచ్చే గాలులు, ఈ గాలి పయనంలో చోటు చేసుకునే మార్పులు వాతావరణంపై ప్రభావం చూపుతాయి. వాతావరణంలో వచ్చే తడిపొడి మార్పులకు ఇవే కారణం. చల్లటి ప్రాంతం నుండి ఉష్ణ ప్రాంతాలకు ఇవి ప్రయాణం చేస్తాయి. ఈ క్రమంలోనే వర్షాన్నిస్తాయి. భారత ఉపఖండంలో ఏర్పడే రుతుపవనాలు హిందూ మహాసముద్రంతో ప్రధానంగా సంబంధాలు కలిగి ఉండి ఆగేయ ఆసియా ప్రాంతంలో వాతావరణాన్ని నిర్దేశిస్తాయి. రెండు రకాల రుతుపవనాలు భారతదేశంపైనా ఆగేయ ఆసియా పైనా ప్రభావం చూపుతాయి. వీటిలో మొదటిది వేసవి కాలం ముగిసిన వెంటనే వచ్చే నైరుతి రుతుపవనాలు. భారత ఉపఖండం ఉత్తరార్ధగోళంలో ఉష్టమండల జోన్లో ఉత్తరం వైపునకు హిమాలయాలు, హిందూకుష్ పర్వతాల వరకు వ్యాపించి ఉన్న సంగతి తెలిసిందే! నైరుతి రుతుపవనాల ప్రభావం ఈ ప్రాంతమంతా ఉంటుంది. హిందూ మహా సముద్రంపైన నీటితో కూడిఉన్న చల్లటి గాలులు మే నెలాఖరు నుండి నైరుతి దిశలో వీచడం ప్రారంభిస్తాయి. అందుకే వీటిని సౌత్-వెస్ట్ మాన్సూన్ అని, నైరుతి రుతుపవనాలని పిలుస్తారు. సాధారణంగా సెప్టెంబర్ నెల వరకు ఈ నైరుతి రుతుపవనాలు కొనసాగుతాయి. భారత ఉపఖండంలో అత్యధిక వర్షపాతం ఈ రుతుపవనాల సమయంలోనే నమోదవుతుంది. హిందూమహాసముద్రం నుండి ప్రయాణం ప్రారంభించిన తరువాత నైరుతి రుతుపవనాలు రెండు శాఖలుగా చీలిపోతాయి. భారతద్వీప కల్పపు దక్షిణ చివరి భాగంగా ఏర్పడే ఈ చీలిక కారణంగా ఉత్తర, దక్షిణ భారతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. అరేబియా సముద్రం మీదుగా ఒక చీలిక ఉత్తర భారతంవైపు ప్రయాణం చేస్తే, మరొకటి బంగాళాఖాతం వైపుగా విస్తరించి దక్షిణ భారతదేశంలో వర్షాన్నిస్తుంది. దేశవ్యాప్తంగా వ్యవసాయానికి నైరుతి రుతుపవనాల ద్వారా కురిసే వర్షమే ప్రధాన ఆధారం. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు వీస్తాయి. కొన్ని సంవత్సరాల్లో వీటి ప్రభావం ఏప్రిల్ వరకు కూడా ఉంటుంది. అయితే, ఈశాన్య రుతుపవనాల వల్ల దేశవ్యాప్తంగా స్వల్పంగానే వర్షపాతం నమోదవుతుంది. వాయువ్య చైనాలో మంగోలియాకు ఎగువ ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈశాన్య రుతపవనాలు భారత దేశానికి చేరే సమయానికి చాలా భాగం పొడిబారిపోతాయి. నైరుతి రుతుపవనాల సమయంలో సముద్రం నుండి భూమి మీదకు వీచిన గాలులు, ఈశాన్య రుతుపవనాల సమయంలో దానికి భిన్నంగా భూమి మీద నుండి సముద్రం మీదకు వీస్తాయి. మంగోలియా, ఆగేయ చైనాల నుండి ప్రారంభమయ్యే ఈశాన్య రుతుపవనాలు భారత ఉపఖండం మీదుగా హిందూ మహాసముద్రానికి చేరుకుంటాయి, అయితే వీటిలో అత్యధిక భాగాన్ని హిమాలయ పర్వతాలు నిరోధిస్తాయి. ఫలితంగా ఈశాన్య రుతుపవనాల ద్వారా వచ్చే వర్షపాతం ఎక్కువ భాగం హిమాలయాల అవతలివైపునకే పరిమితమవుతుంది. వర్షపునీటిని ఆపడంతో పాటు ఈశాన్య రుతుపవనాలు తీసుకువచ్చే గడ్డకట్టించే చలిగాలులను కూడా హిమాలయాలు ఆపుతాయి. ఫలితంగా దక్షిణ భారతదేశం, శ్రీలంక వంటి ప్రాంతాల్లో సంవత్సరమంతా వాతావరణం దాదాపు పొడిగా ఉంటుంది. ఈశాన్య రుతువపనాల కారణంగా భారతదేశంలోని కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో కొంతమేర వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ భారతదేశంలో వరిపంట ప్రధానంగా సాగు కావడానికి, భారతదేశపు అన్నపూర్ణగా ఈ ప్రాంతం పేరు పొందడానికి నైరుతి రుతుపవనాలే కారణం. ఈ రుతుపవనాల కారణంగా పసిఫిక్ తీరప్రాంతంతో పాటు, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లోనూ వర్షాలు కురుస్తాయి.
రుతుపవనాలే వర్షిస్తాయా!
రుతుపవనాలతో పాటే వర్షం వస్తుంది. నదులు నిండుగా పారుతాయి. చెరువులు నిండుతాయి. వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ మార్పులన్నీ చూస్తే రుతుపవనాలే వర్షపు చినుకులుగా మారి పలకరిస్తాయనుకోవడం సహజం. అయితే, అది నిజం కాదు. నైరుతి, ఈశాన్య రుతపవనాల రాక, పోక కాలగమనంలో నిరంతరం చోటుచేసుకునే ఒక మార్పు మాత్రమే! ఈ రుతుపవనాలు వర్షాన్ని మోసుకొచ్చే మేఘమాలలు కావాలంటే అనేక అంశాలు కలిసి రావాలి. ప్రకృతి సహకరించాలి. లేని పక్షంలో రుతుపవనాలు సైతం ఎండమావులుగానే ఊరిస్తాయి. వర్షించని మేఘాలను చూసిన అనుభవం చాలా మందికి ఉండే ఉంటుంది. 'ఆకాశంలో మేఘాలను చూసి ముంత వలకబోసినట్లు...' సామెత గుర్తుండే ఉంటుంది. రుతుపవనాలు మోసుకొచ్చే గాలిలో నీరు ఉంటేనే వర్షం కురవడం సాధ్యమవుతుంది. సముద్రం మీదుగా వచ్చే రుతుపవనాలు సముద్రం నుండే నీటిని మోసుకురావాలి. అందుకు అనుగుణమైన వాతావరణ పరిస్థితులు అక్కడ ఉండాలి. సముద్రంలోని నీరు ఆవిరై మేఘాల్లోకి చేరి, సముద్రపు గాలికి చల్లబడి రుతుపవనాల గాలితో కలిసి భూమి మీదకు రావాలి. అలా వచ్చిన రుతుపవనాలే వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. అంతేకాదు, సముద్రం మీద నుండి భూమి మీదకు పయనం చేసిన గాలి ఒక ప్రాంతంలో అలానే ఉండదు. ఆకాశం దారులంట హడావిడిగా వెళ్లిపోతూనే ఉంటుంది. వాటిని బలంగా అడ్డుకుని వర్షాన్ని కురిపించే భౌగోళిక శక్తి కూడా కావాలి. ఇవ్వన్నీ కలిసివస్తేనే రుతుపవనాల ద్వారా వర్షం పొందడం సాధ్యమవుతుంది. అంటే, రుతుపవనాలు వాటంతట అవే వర్షించవని తేలిపోయినట్టే కాదా! భారత ఉపఖండం విషయానికి వస్తే సాధారణంగా రుతుపవనాలు వట్టి కుండలుగా రావు. భారతదేశానికి మూడు వైపులా ఉన్న బంగాళా ఖాతం, హిందూమహాసముద్రం, అరేబియా సముద్రాలు భారీ నీటి వనరులుగా ఉపయోగ పడతాయి. వేసవి కాలంలో ఈ సముద్రాల నుండి పెద్ద మొత్తంలో నీరు గాలిలోకి చేరుతుంది. అక్కడి నుండి వీటి ప్రయాణం ప్రారంభ మవుతుంది. ఆకాశంలో అందనంత ఎత్తులో పోతున్న వీటిని పశ్చిమ కనుమలు, హిమాలయాలు అడ్డుకుం టాయి. ఫలితంగా నైరుతి రుతుపవనాల సమయంలో వర్షం కురుస్తుంది. హిందూ మహాసముద్రంలో ప్రారంభ మైన ఈ రుతపవనాలను పశ్చిమ తీరంలోనే విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు మొదట అడ్డుకుంటాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. పశ్చిమ కనుమలను దాటి ముందుకు వెళ్లే రుతుపవనాలను హిమాలయాలు అడ్డుకుంటాయి. కేవలం అడ్డుకోవడమే కాకుండా నైరుతి రుతుపవనాల ద్వారా లభ్యమయ్యే మొత్తం వర్షాన్ని భారత ఉపఖండంలోనే కురిసేలా చూస్తాయి. ఉత్తర దిక్కున హిమాలయాలే లేకుంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు భారతదేశంలో వర్షించకుండానే టిబెట్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా వంటి దేశాల వైపు వెళ్లిపోయేవి. నైరుతి రుతుపవనాలను కరిగించి వర్షపు చినుకులను కురిపించే బాధ్యతను పశ్చిమ కనుమలు హిమాలయాలు తీసుకుంటే, ఈశాన్య రుతుపవనాలను తూర్పు కనుమలు అడ్డుకుంటాయి.
ఇది సాధారణం!
సాధారణంగా నైరుతి రుతు పవనాలు మే నెలాఖరు లేదా జూన్ ఒకటవ తేది నాటికి భారత పశ్చిమ తీర ప్రాంతమైన కేరళలోకి ప్రవేశిస్తాయి. జులై 15వ తేది నాటికి ఇవి దేశమంతా విస్తరిస్తాయి, సెప్టెంబర్ ఒకటి నుండి, అక్టోబర్ ఒకటవ తేది నాటికి వీటి ప్రభావం దాదాపుగా ముగుస్తుంది. ఈశాన్య రుతుపవనాలు సాధారణంగా అక్టోబర్ 20వ తేదిన దేశంలోకి ప్రవేశిస్తాయి. 50 రోజుల పాటు వీటి ప్రభావం ఉంటుంది. అయితే, ప్రతి రుతుపవనాల సీజన్లోనూ ఒకే మాదిరి వర్షపాతం నమోదు కాదు. కొన్ని సంవత్సరాల వర్షపు లెక్కలను ఆధారంగా వాతావరణ శాఖ సాధారణ వర్షపాతాన్ని గణిస్తుంది. ఒక రుతుపవనాల కాలంలో ఆ మేరకు వర్షం కురిస్తే సాధారణ వర్షపాతం నమోదైనట్టు భావిస్తారు. అంతకన్నా ఎక్కువ వర్షపాతం కురిస్తే భారీ వరదలు ముంచెత్తుతాయి. తక్కువ వర్షపాతం నమోదైన సంవత్సరాల్లో కరువు కాటకాలు వెంటాడుతాయి. వర్షపాతం ఎక్కువైనా, తక్కువైనా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అసాధారణమే అధికం!
గత దశాబ్దకాలంలో భారతదేశంలో రుతువపనాల స్వరూపమే మారిపోయింది. అసాధారణ వర్షాలు ముంచెత్తుతున్నాయి. అతి తక్కువ రోజుల్లో అత్యధిక వర్షపాతాలు నమోదవుతున్న సంవత్సరాల సంఖ్య పెరుగుతోంది. ముంబాయి వరదల నుండి 2009లో కర్నూలు నగరాన్ని ముంచెత్తిన వరదల వరకు ఈ తరహా వర్షాలే కారణం. ఇటువంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోవడం ఆందోళన కరంగా మారుతోంది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఈ పరిస్థితికి కారణమని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.
అంచనా సులభమేం కాదు ...
రుతుపవనాల కదలిక, వాటి ద్వారా లభించే వర్షపాతం అంచనా వేయడం అంత సులభమే కాదు. భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్న భారత ఉపఖండంలో రుతుపవనాల అంచనా మరింత క్లిష్టతరం. వాతావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం భారత ఉపఖండంలో రుతుపవనాల ప్రభావాన్ని పాక్షికంగా చెప్పడమే సాధ్యమవుతుంది. కచ్చితంగా నిర్థారించడం చాలా కష్టం! ఈ నేపథ్యంలోనే భారత ఉపఖండంలో రుతుపవనాల అధ్యయనానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు రూపొందాయి. సాంప్రదాయ సిద్ధాంతం, డైనమిక్ థీరీ, జెట్‌స్ట్రీమ్ థీరీ ఇలా అనేక
పేర్లతో అధ్యయనాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు మంచు పర్వతాలు, మూడువైపులా సముద్రం, ఎడారి ప్రాంతం కలిసి ఉన్న భారత దేశంలో కచ్చితంగా రుతుపవనాల ప్రభావాన్ని అంచనా వేయడం కష్టతరంగా మారుతోంది.
ఎల్‌నినో ప్రభావం
రుతుపవనాలపై ప్రభావం చూపే అంశాల్లో ఎల్‌నినో ఒకటి. పసిఫిిక్ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల కారణంగా ఎల్‌నినో ఏర్పడుతుంది. సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణొగ్రతకు చేరుకున్న మధ్య - తూర్పు పసిఫిక్ జలాలు మిగిలిన సముద్ర ప్రాంతానికి విస్తరించడం ఎల్‌నినోకు కారణం. ఈ వేడి నీటి ప్రవాహం సాధారణంగా సముద్రంపైన ఉన్న గాలిలోకి నీరు చేరే ప్రక్రియను అడ్డుకుంటుంది. ఫలితంగా పలు దేశాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయి. ఎల్‌నినో సమయంలో భారత ఉపఖండంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతాయి. కరువులు కూడా ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణ పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం మధ్య-తూర్పు పసిఫిక్ సముద్రంలో మూడు నెలల సాధారణ ఉష్ణోగ్రతకన్నా 0.5 సెల్సియస్ డిగ్రీల మేర అదనపు ఉష్ణోగ్రత చేరినప్పుడు ఎల్‌నినో ఏర్పడుతుంది. సాధారణంగా రెండు సంవత్సరాల నుండి ఏడు సంవత్సరాల వ్యవధిలో ఎల్‌నినో ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సగటున ప్రతి నాలుగు సంవత్సరాల కోసారి ఎల్‌నినో ప్రభావం రుతుపవనాలపై కనపడుతోంది.
ఎలా గుర్తిస్తారు ?
పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పాటు కావడాన్ని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్ర జలాలపై నిరంతరం పరిశోధన సాగిస్తూఉంటారు. సముద్రపు నీటి ప్రవాహంలో వేగం తగ్గడం ఎల్‌నినో ఏర్పడుతుందనడానికి గుడ్డి గుర్తని శాస్త్రవేత్తలు చెబుతారు. దీంతో పాటు హిందూ మహాసముద్రంలోని ఉపరితల నీటిలో ఒత్తిడి పెరగడం, ఇండోనేషియా, ఆస్ట్రేలియా తీరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొనడం, తహితీతో పాటు తూర్పు పసిఫిక్ మహాసముద్రంపైన గాలిలో ఒత్తిడి తగ్గడం, దక్షిణ మహా సముద్రంపైనుండి వీచే గాలులు బలహీన పడటం, పెరూ ప్రాంతంలో వేడిగాలులు వీచడం, ఉత్తర పెరూవియన్ ఎడారుల్లో వర్షం పడటం కూడా ఎల్‌నినోను ధృవీకరిస్తుంది. నెలల తరబడి ఎల్‌నినో కొనసాగితే సముద్రపు జలాల ఉష్ణోగ్రత గణనీయంగా పెరిగి మత్స్యసంపదపై కూడా ప్రభావం చూపుతుంది.
ఏయే దేశాల్లో ఎలా ...!
ఎల్‌నినో ఒక్కో దేశంపై ఒక్కో రకమైన ప్రభావం చూపుతోంది. భారతదేశంలో తీవ్రమైన కరువు పరిస్థితులకు ఎల్‌నినో దారితీస్తుండగా దక్షిణ అమెరికాలోని పశ్చిమతీర ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదవుతోంది. ఏప్రిల్, అక్టోబర్ నెలల్లో ఏర్పడే ఎల్‌నినోతో పెరూ, ఈక్వెడార్‌లో వరదలు వస్తున్నాయి. అంటార్కిటా ప్రాంతంలో మంచు భారీగా కరుగుతుంది.
ఈ సంవత్సరం ఎల్‌నినో ముప్పు...?
2015 సంవత్సరంలో ఎల్‌నినో ముప్పు పొంచి ఉందా? శాస్త్రవేత్తలు అదే అంటున్నారు. జపాన్‌లోని వాతావరణ పరిశోధన కేంద్రం 2014లోనే ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఆస్ట్రేలియన్ వాతావరణ శాఖతో పాటు, ప్రపంచ వాతావరణ అధ్యయన కేంద్రం కూడా ఇదే హెచ్చరికలు చేశాయి. ఈ ఏడాది జూన్‌లోగా ఎల్‌నినో ఏర్పడే అవకాశం ఉందని ఈ హెచ్చరికల సారాంశం. దీనికి తగ్గట్టుగానే భారత వాతావరణ శాఖ విడుదల చేసిన అంచనాల్లో రుతుపవనాలు సకాలంలో వచ్చినప్పటికీ, సాధారణ వర్షపాతం ఉండే అవకాశం తక్కువే అని అంచనా వేసింది.
లా నినా ..
ఎల్‌నినోకు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు సముద్రజలాల్లో ఏర్పడటాన్ని లా నినాగా పేర్కొంటున్నారు. ఎల్‌నినోలో సముద్ర నీటి ఉష్ణోగ్రత సాధారణం కన్నా పెరిగితే, లా నినా సమయంలో సాధారణం కన్నా తగ్గుతాయి. ఎల్‌నినో, లా నినాలను కలిపి ఎల్‌నినో సదరన్ ఆస్కిలేషన్ సర్కిల్ (ఇఎన్‌ఎస్‌ఓ)గా పిలుస్తున్నారు. ఎల్‌నినో, లానినాలు ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.
భూ తాపం పెరగడమే కారణమా
భూ తాపం అనూహ్యంగా పెరగడమే సముద్రజలాల ఉష్ణోగ్రతలో భారీ మార్పులకు కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు తేల్చారు. విచ్చల విడిగా సాగుతున్న ప్రపంచీకరణ నేపథ్యంలో భూమిపై కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా భూ వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సముద్ర జలాల ఉష్ణోగ్రతల మార్పులకు కూడా ఇదే కారణమని శాస్త్రవేత్తల నిర్ధారణ.తొలకరి చినుకు నేల మీద రాలడానికి ఇంత పెద్ద కథ వుంది మరి.
మరికొన్ని రుతుపవనాలు
నైరుతి, ఈశాన్య రుతుపవనాల కాకుండా ఆసియన్-ఆస్ట్రేలియన్ రుతు పవనాలు కూడా భారతదేశంపై స్వల్ప ప్రభావం చూపుతాయి. పసిఫిక్ మహాసముద్రంలో ప్రారంభమై రష్యా, ఆస్ట్రేలియా మీదుగా హిందూ మహాసముద్రం వరకు ఈ రుతుపవనాలు ప్రయాణం చేస్తాయి. దీని ప్రయాణం ఆఫ్రికా తీర ప్రాంతంలో అంతమవుతుంది. మధ్య వేసవి కాలంలో ఏర్పడే ఉత్తర అమెరికన్ రుతుపవనాలు కూడా ముఖ్యమైనవే! కాలిఫోర్నియా, మెక్సికో ప్రాంతాల నుండి వీచే గాలులు మెక్సికోలోని సిరియా ప్రాంతంలో కలుసుకుని రుతుపవనాలుగా మారుతాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే చల్లటి గాలులు సహారా ఏడారి మీదగా ప్రయాణం చేయడంతో ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తూర్పు ఆసియా రుతుపవనాల కారణంగా చైనా, ఫిలిప్పైన్స్, కొరియా, జపాన్లలో వర్షపాతం నమోదవుతోంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఏర్పడే యూరోపియన్ రుతుపవాలు కూడా ముఖ్యమైనవే! మార్చి నెలలో ఏర్పడే ఈ రుతుపవనాల ప్రభావం మే దాకా ఉంటుంది. అయితే, జూన్‌లో ఇవి తిరిగి పుంజుకుని వర్షిస్తాయి.
- వి.రాజగోపాల్
రుతు రాగాలు
