'మనసుకే కళ్ళుంటే అణువణువునా అందాలే' అన్నాడు ఓ కవి. నిజమే, అందమైన ఈ ప్రకృతిలో మనిషికి విడదీయరాని సంబంధం ఉంది. ప్రకృతి ఒడిలోనే జీవితాన్ని మలుచుకున్న మనిషి. అదే ప్రకృతి నుండి స్ఫూర్తి పొంది ఎన్నో కళలను అభ్యసించాడు. వాటిలో మనిషి హృదితో ముడిపడినవి ఐదు. అవే లలిత కళలు. సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్ప, చిత్ర లేఖనాలు. శ్రమను మరచిపోవడానికి పాడుకున్న పాటలే సంగీతమైనాయి. మానసిక ఉల్లాసమే కాదు, మ్యూజిక్ థెరపీ పేరుతో మనసుకి నయంచేసే వైద్యంగా కూడా మానవ జీవితంలో ఒక భాగమైన సంగీతానికి.. జూన్ 21న అంతర్జాతీయ సంగీత దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మీకింత వరకు తెలియని కొన్ని అద్భుత వింత వాద్య పరికరాల పరిచయం.
మొట్టమెదటిసారిగా రోజంతా ఈ 'మ్యూజిక్ డే'ను 1982 ప్యారిస్‌లో ఫ్రెంచ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ తర్వాత క్రమంగా ఇదే రోజును మ్యూజిక్ డేగా ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలలోని 700 నగరాలలో వేడుక చేసుకుంటున్నారు. ఆ దేశాల జాబితాలో మనదేశంతోపాటు చైనా, జర్మనీ, ఇటలీ, గ్రీస్, రష్యా, ఆస్ట్రేలియా, పెరూ, బ్రెజిల్, ఈక్వెడార్, మెక్సికో, కెనడా, అమెరికా, యు.కె, జపాన్‌లు ఉన్నాయి.
ఈ రోజున ఆయా దేశాలు, నగరాలకు చెందిన విద్వాంసులు వాద్యకారులు, ప్రజలు తమకు తెలిసిన సంగీతాన్ని బహిరంగంగా ఇరుగు పొరుగు వారి వద్ద, జన సంచారం ఉన్న చోట, పార్కులలోనూ ఆలపిస్తారు. ఉచిత కచేరీలు కూడా నిర్వహిస్తారు. సంగీతం అనగానే మన దేశంలో కర్ణాటక, హిందుస్థానీ, జానపద, లలిత, పాశ్చాత్య సంగీతాలతో పాటు, వీణ, హార్మోనియం, వేణువు, నాదస్వరం, క్లారినేట్, తబలా, మృదంగం, కీ-బోర్డు, గిటార్, డ్రమ్స్.. ఇలా ఎన్నో వాద్యాలను చూస్తూనే ఉన్నాం. అయితే, అంతర్జాతీయంగా చూస్తే మనం ఎన్నడూ వినని కనని సంగీత రీతులు, వాద్యాలు ఉన్నాయి.
ఇయోలియన్ హార్ప్ లేదా విండ్ హార్ప్ :
ఈ వాద్య విశేషం ఏమిటంటే మనిషి అవసరం లేకుండా వాయువే రాగాలు పలికిస్తుంది. గ్రీకులు వాయుదేవుడైన ఇయోలస్ పేరు మీదుగానే ఈ వాద్యానికి పేరొచ్చింది. సౌండ్ బోర్డుతో కూడిన ఓ చెక్కపెట్టె పొడవు రీత్యా రెండు బ్రిడ్జ్లకూ తంత్రులు అమర్చబడి ఉంటాయి. ఈ పరికరాన్ని బాగా గాలి పీల్చే ప్రదేశం (కిటికీ) వద్ద ఉంచుతారు. తద్వారా గాలి ఈ తంత్రులను తాకుతూ సుమధుర నాదాన్ని పలికిస్తుంది. ఒకే పిచ్‌లో (స్థాయిలో) పలికేందుకు వీలుగా వేర్వేరు స్థాయిలలో పలికే విధంగానూ తయారు చేస్తారు. కేవలం గాలి ద్వారా సుస్వరాలను పలికించగలిగే ఏకైక తంత్రీ వాద్యమిది. ఇయోలియన్ హార్ప్ ప్రాచీన కాలం నుంచి సుపరిచితమైన వాద్యం. వీటిలో కొన్నింటిని నాదాలను పలికించే స్మారక చిహ్నాలుగా భవంతులపైన పర్వత శిఖరాగ్రాలలోనూ, బీచ్‌లలో కూడా ప్రతిష్ఠిస్తున్నారు.
రెయిన్ స్టిక్
ఈ రెయిన్ స్టిక్ పొడవుగా ఉన్న ఓ బోలు గొట్టం చిన్న గులకరాళ్లు లేదా బీన్స్‌తో పాక్షికంగా నింపబడి, లోపలి భాగంలో చిన్న సూదులు లేదా ముళ్లును సర్పిలాకారంలో అమర్చుతారు. రెండు పక్కలా మూసివేయబడి ఉన్న ఈ రెయిన్ స్టిక్‌ను కింద మీదులుగా చేసినప్పుడు అందులోని గులకరాళ్లు ఒక చివరి నుంచి మరొక చివరకు జారుతూ వర్షం కురిసేటప్పుడు వినిపించే సంగీతాన్ని తలపిస్తుంది. దీనిని మాపుచీస్ (దక్షిణ మధ్య చిలీ, ప్రస్తుతం కొన్ని పెటగోనియాలోని భాగాలతో సహా, నైరుతీ అర్జెంటినాకు చెందిన మూలవాసులు) కనుగొన్నట్లుగా చెప్తారు. దీనిని వాయించడం ద్వారా కుంభవృష్ఠి కురిపించవచ్చని వారి నమ్మకం. ఈ స్టిక్‌ను ఇన్కాస్ (తెగ)వారే తయారు చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికి చిలీ తీర ప్రాంతాలలో ఈ స్టిక్‌ను చూడవచ్చు.
కాక్టస్ జాతికి చెందిన మొక్కల నుంచి దీనిని తయారు చేస్తారు. ఆగేయ ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలలో రెయిన్ స్టిక్‌ను పోలిన వాద్యాలను చూడవచ్చు. ఇక్కడి ప్రజలు ఈ స్టిక్‌ను వెదురు బొంగులతో చేస్తారు. అలాగే కాక్టస్కు బదులు మేకులు, టూత్‌పిక్స్‌తో తయారు చేయబడిన రెయిన్స్టిక్లు లాటిన్ అమెరికాలో పాటు నైరుతి అమెరికాలను సందర్శించే పర్యాటకులకు అమ్మటం మనం చూడవచ్చు.
యుడియు
యుడియు అంటే పాత్ర. నీటితో కూడి రంధ్రం కలిగిన ఒక కూజా ఇది. ఇగ్బో (దక్షిణ మధ్య, ఆగేయా నైజీరియాకు చెందిన ఒక జాతి) స్త్రీలు ఉత్సవ సమయాల్లో దీనిని వాయిస్తారు. యుడియు మట్టితో చేయబడిన వాద్యం. దీనిని చేతులతో వాయిస్తారు. వాద్యకారుడు వేగంగా పెద్ద రంధ్రాన్ని కొట్టడం ద్వారా మంద్ర స్థాయి ధ్వనులతో పలికిస్తాడు. పైన కింది భాగాలలో ఉన్న రంధ్రాల వద్ద చేతిని ఉంచే పద్ధతిని బట్టి పలు స్థాయిలలో ధ్వనులను పుట్టించవచ్చు. మిగిలిన భాగాన్ని చేతివేళ్ళతో వాయిస్తారు. నేడు ఎందరో వాద్యకారులు పలు సంగీతరీతుల్లో దీనిని విరివిగా వాడుతున్నారు. ఇది మన ఘటానికి కొంచెం దగ్గరగా ఉంటుంది.
వ్యాలిహా
ఈ వ్యాలీహా అనేది ఒక జిధార్ గొట్టం (జిథార్ అనేది జర్మన్లోకి తర్జుమా చేయబగిన గ్రీక్ పదం చిధర, ప్రస్తుత ఆధునిక పదం గిటార్ కూడా దీని నుంచి వస్తుంది. ఒక చదరంగా ఉన్న ఉపరితలంపై పలు తంత్రులు ఉండటం ఈ వాద్యాలతో చూడవచ్చు) ఈ వ్యాలిహాకు 21 నుంచి 24 వరకు తీగలు ఉంటాయి. వ్యాలిహా మడగాస్కర్
జాతీయవాద్యం అక్కడి స్థానిక వెదురుబొంగులతో దీనినిచేస్తారు. వినోదం కోసమే కాకుండా ఆచార సంబంధ విషయాల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు.
షన్
ఇది చైనాకు సంబంధించిన వెసల్ఫ్లూట్ ఏడు వేల సంవత్సరాల పూర్వం నుండే ఇది చైనాలో ఉంది. ఆరంభ దశలో దీనిని మట్టిని కాల్చి లేదా ఎముకలతో తయారు చేసేవారు. క్రమంగా మట్టి, పింగాణీని ఉపయోగిస్తున్నారు. చైనాలోని ఎయిట్టోన్ వర్గీకరణలో భూమి (మట్టి) సంబంధమై మనుగడలో ఉన్న ఏకైక సంగీత వాద్యం (ఎయిట్ టోన్ వర్గీకరణ-లోహం, రాయి, సిల్క్, వెదురు, కాయ, మట్టి, చెక్క, చర్మం). షన్ గుడ్డు ఆకారంలో ఉండే ఎయిర్‌ఫోన్ (ఎలాంటి తీగలు, పొరలు కాకుండా గాలిపై ఒత్తిడి ద్వారా ప్రకంపనలు కలిగించడం) కనీసం మూడు ఫింగర్ హోల్స్ ముందు భాగాన రెండు థంబ్ హోల్స్ వెనుక భాగాన ఉంటాయి. ఊదేందుకు అనువుగా పైన ఒక రంధ్రం, పది వరకు చిన్న ఫింగర్ హోల్స్ వేలికి ఒకటి చొప్పున ఉంటాయి. ఇది ఓ ఖరినా (ఇదే మాదిరి ఉండే వాద్య పరికరం 12,000ల సంవత్సరాల చరిత్ర కలిగింది)ను పోలి ఉంటుంది.
కొత్తతరానికి..
- నెదర్లాండ్‌కు చెందిన కంపెనీవారు సంగీతానికి సాంకేతికతను జోడించి కొన్ని ప్రత్యేక వాద్య పరికరాలను ఆసక్తికరంగా రూపొందించారు. అవి.. బుల్లి వాబ్, విగిల్, డ్రమ్, పాడ్స్, స్కాన్ ఇవన్నీ కూడా అరచేతిలో ఇమిడిపోయి అగ్గిపెట్టె పరిమాణంలో ఉండి పాశ్చాత్య సంగీత వాద్య ధ్వనులను కావలసిన విధంగా సృష్టించగలవు.
- ఆర్టిఫోన్.. పట్టుకునే విధానాన్ని బట్టి అటు గిటార్గానూ, ఇటు కీబోర్డ్గానూ రంజింపజేయగల పరికరం ఇది.
- కీస్... ఓ ప్రఖ్యాత సంగీత సంస్థ రూపొందించిన అద్భుతం ఈ కీబోర్డు. డివైజ్ ద్వారా కంప్యూటర్ను అనుసంధానం చేసి చేతితో తాకవలసిన అవసరం లేకుండా కేవలం వేళ్ళ కదలికల ద్వారా క్లాసికల్ పియానో నుంచి ఎలక్ట్రిక్ కీబోర్డు వరకు నాదాలను పలికించవచ్చు. డీజేయింగ్కు కావల్సిన అన్ని ధ్వనులూ ఈ ఒక్క పరికరంతో సృష్టించవచ్చు.
- ఆల్ఫాస్ఫియర్ ఫుట్‌బాల్‌ను పోలి ఉంటుంది. కంప్యూటర్లో ఆల్ఫాలైట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఈ పరికరంలో అనుసందానం చేయాలి. ఇప్పుడు ఏ వాద్యానికి సంబంధించిన నాదం కావాలని అనుకుంటామో దానిని సెలక్ట్ చేసి ఆల్ఫా స్పియర్ చుట్టూ ఉన్న బటన్ వంటి భాగాలను స్పృశించి సంగీతం పలికించవచ్చు.
- ఇవే కాకుండా మూ గ్లూవ్స్, ఫ్రీడమ్స్, లేజర్ హార్ప్, జామ్ స్టాక్, టైటాన్ రియాలటీ, ఓటో కంట్రోలర్స్, మొదలైనవి కూడా వింతగానే అనిపిస్తాయి.
సృజనకు ఎల్లలు లేవనేది అక్షరసత్యం సాధించాలనే తపన ఉండాలేగానీ ఈ సృష్టిలో పనికి రానిదంటూ ఏదీలేదు ఇవన్నీ చూస్తుంటే, ''కాదేది కళకు అనర్హం' అని అనిపిస్తుండడంలో అతిశయోక్తి లేదు కదండీ.
- సింహాద్రి నాగశిరీష
9866689326