- అజై
95023 95077
సేమ్యా వాసనేమో గానీ, మిఠాయిని చూస్తే ఆ కుర్రోడికి సాయిబు తాత గుర్తొస్తాడు. గుర్తు రావడమంటే ముఖం లీలగా. అరచేతులు స్పష్టంగా. ఆ వాడకు సాయిబు తాత మిఠాయే మరి. అప్పట్లో ఓ ఇత్తడి బిందె పెట్టుకుని మూడు వేలు, ఓ స్టీల్ గ్లాసు పెట్టుకుని ఐదొందలు అప్పెవరు ఇస్తారు చెప్పండి. అరచేతులు ముద్దెట్టుకుని అంత మిఠాయి పెట్టేదవరు చెప్పండి. అందుకే పిల్లల గ్యాంగుకి మిఠాయి తాతయ్యాడు. పెద్దలకు సాయిబు గారయ్యాడు. ఆ వాడ చెదిరిపోయాక మిఠాయి సాయిబు గురించి మాట్లాడుకోవడం.. వాడ గురించి చెప్పుకోవడం లాంటిదే. వాడలోని పిల్లలందరినీ రైలు కూత పెట్టించి దర్గాకు తీసుకెళ్లడం. డేగ్షా సాంతం తోడి మిఠాయి పంచడం డైలీ డ్యూటీ. పిల్లల రైలు దర్గా వేప చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడం.. సాయిబు తాత భాషలో కతలు వినడం రోజువారీ దృశ్యం. దర్గాకెళ్లడమంటే తీపిని అంటించుకోవడమే.. ఆ పిల్లల గ్యాంగుకి. రోడ్డివతలి ఖాళీ స్థలంలో గల్లీ క్రికెట్ ఆడటం.. బంతెళ్లి దర్గా వరండాలో పడటం.. దాన్ని తాత ఇటు విసరడం వారాంతపు ఆట విడుపు. అదే రోడ్డు పక్కన ఓ ఎండాకాలపు మిట్ట మధ్యాహ్నం తెల్లని అంబాసిడర్ కారొచ్చి ఆగితే.. వాడవాడంతా కదిలి మిఠాయి సాయిబుని చివరిచూపు చూస్కుంది. పది, పదిహేనేళ్ల కిందటి తీపి కథొకటి కుప్పకూలిన వాడ మొండి గోడల మీద కదలాడింది. కుర్రాడి మనస్సు మొద్దుబారిపోయింది. ఇలాంటివెన్ని తీపి కథలు శిథిలమైపోయాయో ఆ పడగొట్టిన వాడ కింద. 20 ఏళ్లు మెదిలిన ఆ కొండవాలులో.. గెంతులేసిన ఆ మెట్ల బారులో... దొర్లుకుంటూ వచ్చి మిఠాయి తాత గురుతు అతణ్ని తట్టింది. ఇప్పుడు కొత్త వాడల్లో చెల్లాచెదురైన కుటుంబాలన్నీ గుర్తొచ్చాయి. తన వాడలోనైతే అలాంటి తాత లేడు. మరి వాళ్ల వాడల్లోనూ..! అని ఆలోచిస్తూ అక్కడే ఓ మొండి గోడకు ఆనుకున్నాడు.
ఎదురుగా దర్గాలోని వేపచెట్టు మిఠాయి తాత రూపంలానే తోచింది. ఎందుకో కుర్రాడికి దాని కిందకు చేరి ముడుచుకుపోవాలనిపించింది. తాత దగ్గరుండి చేయించిన పరిచయం కదా అది.. పరిసరాలన్నీ పాత మిత్రుల్లా అనిపించాయి. కొత్త మార్పుల్ని పట్టించుకోకుండా చెట్టు గాలి చల్లగా తగిలింది. ఎందుకో మిఠాయి తాత అర చేతులు కూడా నెత్తిని చల్లగానే తాకేవి. వాడ లేకున్నా దర్గా ఉందన్న గమనిక ఆ కుర్రాడి హృదయాన్ని నెమ్మది చేసింది. వేప చెట్టు నీడన కాసేపు కళ్లంటుకున్నాయి. కాసేపటికి అత్తరు పరిమళం. నిద్రలో తాతను తడుముతున్నాడేమో 'మిఠాయి యేదే తాత' అంటూ కలవరించాడు. మరెవరో పెద్దాయన కుర్రాడి భుజం కదిపి 'అరె బేటా' అని మెలకువ తెచ్చాడు. దిగ్గున లేచి నిలబడిన కుర్రాడు ఆ పెద్దాయన్ను తేరిపారా చూసి తల విదిల్చాడు. 'బేటా ఆడ్నబోయి కూచో' అంటూ వేళ్లతో చూపించాడు. అరచేతికి అరంగుళం దిగువకు జరిగిన తెల్ల చొక్కా చేతులు కుర్రాణ్ని మళ్లీ వెనక్కు లాక్కెళ్లాయి. మిఠాయి తాత ఆహార్యమదే. రంజాన్‌కి అది ఇంకొంచెం తళతళలాడేది. అత్తరు వాడంతా గుప్పుమనేది. చిన్నప్పటి నుంచి ఆ ముంజేతి క్రమశిక్షణకు అలవాటైపోయిన బుర్ర కుర్రాడిది. అది వాడ నుంచి కదిలే పిల్లల రైలులో ఏ బోగీగా అమరాలనే విషయం కాన్నుంచి.. తన అల్లరి పనికి కొట్టబోయిన పెద్దల్ని అడ్డుకుంటూ గాల్లో గీసే నియంత్రణ రేఖ వరకు ఆ ముంజేతికి ఓ అజమాయిషీ ఉండేది. ఎందుకో ఆ ముంజేయి ఎటు చూపితే అటు అడుగులు పడటం అలవాటైపోయింది ఆ కుర్రాడికి. బుద్ధిగా వెళ్లి అక్కడ కూర్చున్నాడు.
వేప చెట్టు చుట్టూ రాలిన ఆకుల్ని తుడవడం ఆపేసి ఒకామె కర్ర చీపురికి దవడ ఆనించి ఆ కుర్రాణ్ని పోల్చుకుంటోంది. పదేళ్ల తర్వాత మనిషి కనిపిస్తే ఒక్కసారికే గుర్తుపట్టడం కష్టమే మరి. ఈ కుర్రాడూ ఆమెను పోల్చుకోలేకపోయాడు. కాసేపు ఏదో ప్రయత్నం చేసి చివరు ముఖం కిందకు వాల్చాడు. ఆమె చీపురు వాల్చి మళ్లీ తుడవడం మొదలెట్టింది. తమ పసితనాన్ని గుర్తు చేస్తూ కొందరు పిల్లలు దర్గాలో ఆడుకుంటున్నారు. వాళ్లలో ఒకడు పరుగున ఆ పెద్దావిడ దగ్గరకు వచ్చి హత్తుకున్నాడు. ఆమె కర్ర చీపురు పక్కకు జరిపి అరె.. దుమ్ముందిరా.. అంటూ ఆ పిల్లాణ్ని ఆపే ప్రయత్నం చేసింది. ఆమె వాణ్ని పక్కకు తీసేలోపే వాడు సర్రున వెళ్లి మిగతా పిల్లల్లో చేరిపోయాడు. ఆమె ఆ చోటంతా శుభ్రం చేసి పంపు దగ్గర కాళ్లూచేతులూ కడుక్కుంది. ముఖం మీద నీళ్లు జల్లుకుంటూ మళ్లీ కుర్రాడి వైపు చూసింది. చివరి గుప్పిట నీళ్లను అలానే వదిలేసి ఏదో పేరుని గట్టిగా తలిచింది. కుర్రాడి దగ్గరకొచ్చి 'నిన్నెక్కడో చూశాను బాబు' అని కొంగుతో చేతులు తుడుచుకుంది. కుర్రాడు ఏదో చెప్పబోగా 'ఆ.. అవును కదూ. ఆ వాడలో ఉండేవాళ్లు కదూ.' అంటూ కళ్లల్లో ఏదో మెదిలినట్టు నవ్వింది. కుర్రాడికి ఆమె ఇంకా గుర్తుకు రాలేదు. ఇంతలో ఆమెకు పిలుపొచ్చింది.. అజా ఇచ్చే టైము కావొస్తోందని. హడావిడిగా వేటి కోసమో వెళుతూ పిల్లల గుంపుని దాటిందామె. మళ్లీ ఏదో గుర్తొచ్చినదానిలా వెనక్కు తిరిగి చూసింది. ఇందాకటి పిల్లాడు గబుక్కున వెళ్లి ఆమె వెనుక దాక్కున్నాడు. వాడి బుగ్గ తడిమి ముద్దు పెట్టుకుందామె. కొంగు చివర కట్టిన ఓ పొట్లం జాగ్రత్తగా తీసింది. దాంట్లో మిఠాయి ఉంది. అది వాడి అరచేతుల్లో పెట్టింది. కుర్రాడికి గుర్తొచ్చింది. వాడ మోడవ్వక ముందు, మిఠాయి తాత దర్గాకే పరిమితమవ్వక ముందు ఎవరో ఒకావిడ దర్గాలో పనిచేసేది. ఆ తర్వాత ఆమె కొన్నేళ్లు కనిపించలేదు. ఆమె మళ్లీ రాకుండానే వాడని పడగొట్టారు. ఆమె సంగతీ ఎవరికీ తెలీదు. మిఠాయి తాతను గుర్తు తెచ్చుకున్నట్టుగా ఆమెను పట్టించుకోకపోవడానికి కారణం ఆమె ఉన్నది కొన్నేళ్లే, అది కూడా ఆమె దర్గా పట్టునే ఉండిపోవడం, వాడలో రాకపోకలు లేకపోవడం. ఆమె ఈమెనని కుర్రాడు అనుకోవడానికి కారణముంది. పిల్లలందరికీ పంచిపెట్టేశాక అడుగున మిగిలిన మిఠాయిని జాగ్రత్త చేసి పొట్లం కట్టి ఎవరికో ఒకరికి ఇచ్చేది. అదో లాటరీ. రైలు బోగీలన్నీ తారుమారయ్యి ఆమె చుట్టూ చేరేవి. పట్టాలు తప్పిన ఆ రైలుని మళ్లీ ఆ తెల్లటి చొక్కా ముంజేయి వరసలో పెట్టేది. మిఠాయి తాత భాషలో ఏదో కోపంగా అంటుంటే.. ఆమె నవ్వుతూ ఆయన్ను ఉడికించేది. వరసలో ఎవడు వెనుకబడిపోయాడో వాడికే ఇచ్చేది పొట్లం. అది వెనుక నుంచైనా చివర కావొచ్చు, ముందు నుంచైనా చివర కావొచ్చు. అందుకే, మధ్యలో బోగీల్ని కట్టడం తాతకు కష్టమయ్యేది.
అదంతా గుర్తొచ్చి కుర్రాడి మనస్సు మరింత బరువెక్కింది. అది ఆమెనో కాదో రూఢ చేసుకోకుండానే దర్గా బయటకు దారి పట్టాడు. వెనక్కు తిరిగి ఓసారి ఆ పెద్దావిడని, వేప చెట్టుని చూసుకున్నాడు. బయటకొచ్చాక ఏదో బంధం తెగిపోయిన అనుభూతి. అడుగు ముందుకు పడటం లేదు. అక్కడే నిల్చొని చెప్పుల్లోకి పాదాల్ని బలవంతంగా దూరుస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఉన్నపాటున ఎవరో ఆ కుర్రాణ్ని ముందుకు బలంగా లాక్కెళ్లారు. చూస్తే పాత మిత్రుడు. వేరే వాడలోకి ఈడ్చుకెళ్లిన కుటుంబానికి చెందినవాడు. వాడూ దర్గా మిఠాయి తిన్నాడు. కానీ, ఏదో చేదు మింగినవాడిలా ముఖం పెట్టి 'ఇక్కడెందుకున్నావ్ రా..' అని నిలదీశాడు. 'వీళ్ల గురించి నీకేం తెలుసు......' అంటూ ఏదో చర్చకు ముందుమాట ఆవేశంతో రాశాడు. మరింత పక్కకు లాక్కెళ్లి బుర్రను తొలవడం మొదలెట్టాడు. ఇంతలో అజా మొదలైంది. అజా విన్నప్పుడల్లా మిఠాయి తాత గుర్తొస్తాడు. మిఠాయి పట్టుకుని సిద్ధంగున్న ఆ అరచేతులు గుర్తొస్తాయి. కానీ, ఈ పాత మిత్రుడిలోని కొత్త వ్యక్తి వల్ల గుండెను తాకి మనస్సుని తడిచేసే అజా సరిగ్గా వినబడటంలేదు. అజా అయిపోయినా వీడి విద్వేషం చల్లారడం లేదు. పాత మిత్రుడి వల్ల ఆ కుర్రాడి బుర్ర దిమ్మెక్కిపోయింది. చెవులకు, తలకు బలంగా తగిలి ముక్కలు ముక్కలుగా రాలిపోతున్నాయి గానీ, వాడు చెప్పే ఏ ఒక్క మాటా గుండెను తాకడం లేదు. తననెవరైనా అక్కడి నుంచి లాక్కెళ్లి దర్గాలో పడేస్తే బావుండనిపించింది కుర్రాడికి. బలంగా భుజాన్ని పట్టుకుని మాట్లాడుతున్న పాత మిత్రుణ్ని విదుల్చుకోబోయాడు ఆ కుర్రాడు. ఇంతలో మరో భుజాన్ని మెత్తగా పట్టుకుని ఆ తెల్ల చొక్కా పొడవు చేతుల ముంజేయి ఏదో పొట్లాన్ని దగ్గరకు తెచ్చింది. 'అరె బేటా వెళ్లిపోయావే. ఇదుగో మిఠాయి..' అంటూ అరచేతిని విప్పింది. పక్కనున్న కుర్రాడి పాత మిత్రుణ్ని చూసి 'ఓ.. బేటా తుంకో బీ లేతా...' భాషలో ఏదో అంటూ ఆ పెద్దాయన వేగంగా లోపలికి వెళ్లాడు. ఆయన తిరుగొచ్చేలోగా పాతమిత్రుడు కుర్రాణ్ని బలవంతంగా నెట్టుకెళ్లబోయాడు. కానీ, కుర్రాడు బలంగా నిలబడిపోతే, ఏదో భాషలో తిట్టుకుంటూ వాడెళ్లిపోయాడు. పెద్దాయన తిరిగొస్తూ మరో మిఠాయి పొట్లంతో పాటు నల్ల దారాల్ని తెచ్చాడు. 'అరె.. కిదర్జాయ్యే వో' అంటూ చుట్టూ చూశాడు. ఏదో భాషలో మాట్లాడుతూ తల విదిల్చి కుర్రాడి ముంజేయి అందుకున్నాడు. 'బహుత్ అచ్చా హోతా...' అంటూ కుర్రాడి ముంజేతికున్న నల్ల దారం పక్కన ఎర్ర దారాన్ని దగ్గర చేసి కట్టాడు. తెల్ల చొక్కా పొడవు చేతుల ముంజేయి చల్లగా కుర్రాడిని నెత్తిని తాకింది. రెండు దారాలు అల్లుకున్న తన ముంజేతిని ముద్దాడిన కుర్రాడు మిఠాయిని నోట్లో వేసుకున్నాడు. మిఠాయి సాయిబు ముఖం లీలగా మెదిలింది. ఆయన అరచేతులు స్పష్టంగా గుర్తొచ్చాయి. కుర్రాడి గుండె ఎందుకో తీపెక్కింది.
మిఠాయి సాయిబు
