ఈ ప్రపంచంలో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, చరిత్ర అంశాలు, విభిన్న పోకడలు, పరస్పర వైరుధ్యాలు ఒక్కోటి ఒక్కో ప్రత్యేకం. మనిషి జీవనాన్ని శాసించే వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఒక చర్చ నడవాలి, విశ్లేషణ జరగాలి, చరిత్రని ఆసాంతం తెలుసుకోగలగాలి. మన చేత ఈ పనులన్నీ చేయించేదే పుస్తక పఠనం. మనిషి వికాసానికి తోడ్పడే పుస్తకాలు అందరికీ చేరేలా మనదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ప్రారంభమైన పుస్తక ప్రదర్శనలు ప్రపంచస్థాయి బుక్ ఫెయిర్లతో పోటీపడుతున్నాయి. ఆ విశేషాలేంటో తెలియాలంటే భారత్‌లోని ముఖ్య నగరాల్లో నిర్వహించే పుస్తక ప్రదర్శనల వైపు ఒక అడుగు వేయాల్సిందే.
చెన్నైలో-బ్రిటిష్ కౌన్సిల్
మన దేశంలో అతిపెద్ద పుస్తక ప్రదర్శన కేంద్రాల్లో చెన్నై బుక్ ఫెయిర్/మద్రాస్ బుక్ ఫెయిర్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. కెబి మ్యాథ్యు చొరవతో దక్షిణ భారత దేశంలోని పుస్తక విక్రయదారులు, తమిళనాడులోని ప్రధాన పుస్తక ప్రచురణ సంస్థ (బపాసి) ద్వారా 1977లో 22 స్టాల్స్‌తో 'మద్రాస్-ఇ-ఆజామ్' స్కూల్లో ఈ ప్రదర్శనని ఏర్పాటు చేశారు. డిసెంబర్14 నుండి డిసెంబర్ 24 వరకు పది రోజుల పాటు పిల్లల పుస్తకాలని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్న ఈ పుస్తక ప్రదర్శనలు క్రమంగా ప్రజాదరణ పొందుతున్నాయి. 12వ ప్రదర్శనల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యుటిఒ) ప్రచురణల తెలుగు అనువాదాలను అమ్మకానికుంచడం ఈ పుస్తక ప్రదర్శనల ప్రాముఖ్యాన్ని పెంచింది. 24వ బుక్ ఫెయిర్ నాటికి తమిళ భాషా ప్రచురణ సంస్థల సంఖ్య ఊపందుకుంది. 2009లో నిర్వహించిన 32వ బుక్ ఫెయిర్‌కి సందర్శకుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం చెన్నై బుక్ ఫెయిర్‌కి సంబంధించి మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు. 2013లో ప్రారంభమైన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు కారణంగా ఆ సంవత్సరం నందానమ్లోని వైఎమ్సిఎ కాలేజ్ గ్రౌండ్స్‌లో 747 స్టాళ్లతో 11 రోజుల పాటు నిర్వహించిన బుక్ ఫెయిర్‌లో పుస్తక విక్రయాలపై ఆదాయాలు గణనీయంగా పెరిగాయి. కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని ప్రతిబింబించే చెన్నై సాంస్కృతిక క్యాలెండర్‌లోనూ చెన్నై బుక్ పెయిర్ స్థానం దక్కించుకుందంటే వీటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సాధారణంగా డిసెంబర్ చివరి వారంలో ప్రారంభమయ్యే ఈ బుక్ ఫెయిర్‌ను జనవరి మూడో వారం వరకు నిర్వహిస్తుంటారు. 2015, 2016లో చెన్నయిలో చోటుచేసుకున్న వరదల కారణంగా పుస్తక పదర్శనలని తొలిసారిగా మార్చి-ఏప్రిల్ల మధ్య నిర్వహించారు. ఈ సంవత్సరం సెయింట్ జార్జ్ స్కూల్ గ్రౌండ్స్‌లో జనవరి 6 నుండి 9 వరకు నిర్వహించనున్న 40వ పుస్తక ప్రదర్శన కేంద్రంలో బ్రిటిష్ కౌన్సిల్ భాగస్వామ్యం కానుంది. సాధారణ రోజుల్లో మధ్యాహ్నం 2.గం నుండి రా.9గం వరకు, సెలవు రోజుల్లో ఉ.11గం నుండి రా.9గం వరకు సందర్శకులని అనుమతిస్తారు.
కోల్‌కతా బొయిమేళా
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తక ప్రదర్శన కేంద్రంగా, ఆసియా ఖండంలో అతి పెద్ద పుస్తక ప్రదర్శనా కేంద్రంగా గుర్తింపు తెచ్చుకున్న కోల్‌కతా బుక్ ఫెయిర్ 1976లో పుస్తక విక్రయదారులు, ప్రధాన పుస్తక ప్రచురణ సంస్థల ద్వారా ప్రారంభించబడింది. పెరుగుతున్న పుస్తక అవసరాలకి తగిన పుస్తకాలు అందుబాటులో లేని కారణంగా అన్ని ప్రాంతాల వారికి మంచి పుస్తకాలు అందించేందుకు ఈ పుస్తక ప్రదర్శన కేంద్రాన్ని నిర్వహించేవారు. స్థానిక ప్రజా ప్రయోజనం కోసం రూపుదిద్దుకున్న ఈ బుక్ ఫెయిర్ ప్రస్తుతం ల్యాండ్ మార్క్, స్టార్ మార్క్, క్రాస్ వర్డ్, ఆక్స్‌ఫోర్డ్ లాంటి ప్రపంచ స్థాయి పుస్తక దుకాణాల స్టాల్స్‌కి కేంద్రంగా మారడం గొప్ప పరిణామం. ఫ్రాంక్ ఫర్ట్ బుక్ ఫెయిర్, లండన్ బుక్ ఫెయిర్ల తర్వాత పుస్తక ప్రపంచంలో మూడవ అతి పెద్ద పుస్తక సమ్మేళనంగా కూడా 'ఇంటర్నేషనల్ కోల్‌కతా బుక్ ఫెయిర్' గుర్తించబడింది. 'అంతర్జాతిక్ కోల్‌కత బోయి మేళా'/'అంతర్జాతిక్ కోల్‌కత పుస్తక్ మేళా' పేర్లతో పిలిచే ఈ బుక్ ఫెయిర్ ఇక్కడ చలికాలంలో మొదలవుతుంది. ప్రతి ఏటా ఇఎమ్ బైపాస్ సైన్స్‌సిటీ దగ్గరలోని 'మిలాన్ మేళా' ప్రాంతంలో జనవరి ఆఖరి బుధవారం నుంచి ఫిబ్రవరి మొదటి ఆదివారం వరకు 12 రోజులపాటు బుక్‌ఫెయిర్ వుంటుంది. చక్కని పుస్తక ఫ్లేవర్‌తో నిండిన స్టాల్స్‌ని దర్శించేందుకు వచ్చే వారితో ఆ ప్రాంతమంతా కోలాహలంగా వుంటుంది. ఒక్కో సంవత్సరం ఒక్కో ఆంశంతో నిర్వహించే ఈ బుక్ ఫెయిర్‌లో అమెరికా, స్కాట్ ల్యాండ్, మెక్సికొ దేశాలకి సంబంధించిన విషయాలు ప్రధాన ఆంశాలుగా నిలిచాయి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేగు వేరా చేసిన అమరత్వ పోరాటం 50 ఏళ్లని పూర్తిచేసుకున్న సందర్భంగా 2016లో బుక్ ఫెయిర్‌లో బొలీవియా ప్రధాన అంశంగా నిలిచింది. ప్రతి ఏటా 20 లక్షల మంది సందర్శకులు ఈ బుక్ ఫెయిర్‌లో పాల్గొంటారు. పెద్దలతో పాటు పిల్లలూ ఆసక్తిగా ఎదురుచూసే బుక్ ఫెయిర్ల కాలం 23 జనవరి నుండి 26 జనవరి వరకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. వివిధ భాషల్లో భారతీయ ప్రముఖ ప్రచురణ సంస్థలు అందించే వేలాది రకాల పుస్తకాలని వీక్షించేందుకు వచ్చే 10 లక్షల మంది సందర్శకుల్లో అమెరికా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, ఇరాన్, ఇటలీ, జపాన్, కెనడా, మలేషియా, మారిషస్, నేపాల్, పాకిస్తాన్, సౌది అరేబియా, సింగపూర్ దేశాల వారూ ఇక్కడ వాలిపోతారు.
ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్
ఏడాదికి 12వేల ఆంగ్ల పుస్తక ప్రచురణలు, 18 భాషల్లో 90వేలకిపైగా శీర్షికలతో ముద్రించబడుతున్న ఆంగ్ల పుస్తకాలకి మూడవ అతిపెద్ద మార్కెట్‌గా నిలిచింది ఢిల్లీ నగరం. పుస్తక ప్రదర్శన కేంద్రాల్లో అతి పురాతన కేంద్రంగా ప్రచారంలో ఉన్న ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్‌ని మొదటి 1972లో 6790 చ.మీటర్లలో ఏర్పాటు చేశారు. మార్చి18 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఆ ప్రదర్శనలకి 200 మంది పుస్తక ప్రేమికులు తిలకించారు. అప్పటి నుండి నేషనల్ బుక్ ట్రస్ట్(ఎన్బిటి) ఆధ్వర్యంలో ఏడాదికి రెండు సార్లు బుక్ ఫెస్టివల్స్ నిర్వహించబడేవి. 2013లో ఎన్బిటి ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్(ఐటిపిఒ)తో కుదిరిన ఎమ్ఒయు ప్రకారం న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్(ఎన్డిడబ్ల్యుబిఎఫ్)ని ప్రగతి మైదాన్‌లో ఏడాదికి ఒకసారి నిర్వహిస్తున్నారు. ఎన్బిటి మరో శాఖ నేషనల్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ లిటరేచర్ (ఎన్‌సిసిఎల్) బాలల సాహిత్యం, జాతీయ రీడర్షిప్ మూమెంట్‌ను ముందుకు తీసుకెళ్లే దిశగా పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలని రూపొందిస్తుంది.
ఈ ఏడాది 44వ బుక్ ఫెయిర్‌ని జరుపుకుంటున్న 'న్యూ ఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్'కు మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ బుక్ ట్రస్ట్, భారత ప్రభుత్వం, ఐటిపిఒ నేతృత్వం వహిస్తున్నాయి. 2100 బుక్ స్టాల్స్, 1100 పుస్తక ప్రదర్శనకారులు, 30 భాగస్వామ్య దేశాలతో రూపుదిద్దుకున్న బుక్ ఫెయిర్‌ను జనవరి 7 నుండి 15 వరకు నిర్వహిస్తారు. 'కల్చర్ ఆఫ్ రీడింగ్', మానుషి(మహిళలపై మరో మహిళ రాసిన పుస్తకం)తోపాటు జాతీయ యువజన దినోత్సవం ప్రధాన అంశాలుగా యువతలో వికాసాన్ని పెంచే కార్యక్రమాలు, పుస్తకాలను అధిక సంఖ్యలో ప్రదర్శించనున్నారు.
పాట్నా పుస్తక్ మేళా
సెంటర్ ఫర్ రీడర్షిప్ డెవలప్మెంట్ (సిఆర్డి) నేతృత్వంలో పాట్నా పుస్తక్ మేళా 1985లో ప్రారంభమైంది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏటా నవంబర్ నెలలో ఈ బుక్ఫెయిర్ని నిర్వహిస్తారు. భారత దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థలు, మల్టిమీడియా కంపెనీలతోపాటు అమెరికా, యుకె, సింగపూర్లకి చెందిన విదేశీప్రచురణ కర్తల భాగస్వామ్యంతో ఏర్పరిచే 1000పైగా పుస్తక్ స్టాల్స్ అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
బెజవాడ బుక్ ఫెయిర్
వాణిజ్య నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడలో రచయితలూ, సాహిత్యకారులు, పేరొందిన ప్రచురణ సంస్థలు 1989లో విజయవాడ బుక్ ఫెస్టివల్(విబిఎఫ్ఎస్)సొసైటీని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి నేషనల్ బుక్ ట్రస్ట్(ఎన్బిటి) తరహాలో విబిఎఫ్ఎస్ స్వరాజ్యమైదానం(పిడబ్ల్యుడి గ్రౌండ్స్)లో 'విజయవాడ పుస్తక మహోత్సవం' పేరుతో బుక్ ఫెయిర్లని నిర్వహిస్తోంది. ప్రముఖ తెలుగు రచయితల శతజయంతి వేడుకలను ప్రధానాంశంగా పుస్తక ప్రదర్శనలు, చర్చాగోష్టి, విద్యార్థులకి వ్యాసరచనా పోటీలు నిర్వహించబడతాయి. ఈ ఏడాది 'నవ్యాంధ్ర పుస్తక సంబరాలు' పేరుతో నిర్వహిస్తున్న 28వ పుస్తక ప్రదర్శనల్లో ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్, ఎమెస్కో, నేషనల్ బుక్ ట్రస్ట్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, కేంబ్రిడ్జ్ ప్రింటింగ్ ప్రెస్, సైంటిఫిక్ ఇంటర్నేషనల్ ప్రై.లి., పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ప్రజాశక్తి, విశాలాంధ్ర ప్రచురణ సంస్థలతోపాటు ఇతర ప్రచురణ సంస్థలతో కలిపి దాదాపు 170 ప్రచురణసంస్థలు ఈ పుస్తక ప్రదర్శనలో భాగమయ్యాయి. తక్కువ స్థలం కారణంగా గత ఏడాది కంటే ఈ సారి తక్కువ స్టాల్స్‌ని ఏర్పాటుచేయాల్సి వచ్చినా ప్రజాదరణ మాత్రం ఎప్పటిలానే వుంది. మొత్తం 235 స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన ఈ బుక్ ఫెయిర్ జనవరి 1 నుండి 11 వరకు నగరవాసులని అలరించనుంది.
- అద్దేపల్లి శర్వాణి


