చర్చి ఏమిటీ? దొంగిలించడమేమిటీ? అని విచిత్రంగా వుంది కదూ. కానీ ఇది నిజం. కెనడాలో 1897లో ఈ సంఘటన జరిగింది. దాని పూర్వాపరాలు చూద్దాం. పశ్చిమ కెనడాలో ఒకప్పుడు డొనాల్డ్ అనే ఒక సెటిల్మెంట్ వుండేది. కెనడా పసిఫిక్ రైల్వేకు అది ప్రధాన కేంద్రం. డొనాల్డ్లో నివశిస్తున్న వారంతా రైల్వేలో పని చేసే వారే. 1897లో కెనడా పసిఫిక్ రైల్వే తన ప్రధాన కేంద్రాన్ని 180 కిలోమీటర్ల దూరంలో వున్న మరో పట్టణానికి మార్చాలని నిర్ణయించింది. దీంతో డొనాల్డ్ ప్రజలంతా దగ్గరలో వున్న విండ్మియర్ పట్టణానికి తరలిపోయారు. ఇదిలా వుండగా డొనాల్డ్లో తను గతంలో నిర్మించిన చర్చిని కూడా తరలించాలని నిశ్చయించింది రైల్వే శాఖ. అయితే విండ్మియర్లోని డోనాల్డ్ వాసులకు అది నచ్చలేదు. చర్చి తమతో పాటే వుండాలనుకున్నారు. దీంతో వారు డొనాల్డ్ గ్రామానికి వెళ్లి చర్చిని భాగాలుగా పూడదీసి పట్టుకుపోయారు.
ఇదిలా వుండగా... మార్గమధ్యలో ఈ చర్చి గంట చోరీ అయింది. ఆ పని చేసింది మరెవరో కాదు! అక్కడికి దగ్గరలో వున్న గోల్డెన్ గ్రామ చర్చికి చాలా కాలంగా గంట లేకపోవడంతో ఇదే అదనుగా భావించి వారు గంటను ఎత్తుకుపోయారు. గోల్డెన్లో చర్చి ఇప్పటికీ వుంది. దీనికి 'దొంగిలించబడిన గంట యొక్క సెయింట్ పాల్ చర్చి' అని పేరు. అయితే చోరీ అయిన చర్చి ఏమైందో చూద్దాం. చర్చి విడిభాగాలను తీసుకుపోయిన డొనాల్డ్ వాసులు వాటితో విండ్మియర్లో చర్చిని నిర్మించుకున్నారు. ఆ చర్చి పేరేమిటే తెలుసా! 'దొంగిలించబడిన సెయింట్ పీటర్స్ చర్చి'. ఇదీ విచిత్రంగానే వుందా!
చర్చి దొంగతనం
