ఎపిలో ఎండలు – వడగాల్పులు..!

Apr 12,2024 13:20 #Andhra Pradesh, #details, #sun stroke

అమరావతి : వడగాల్పులతో ఎపి వేడెక్కిపోతుంది. సూర్యుడు ప్రతాపంతో ఎపిలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇదే విధంగా మరికొన్నిరోజులపాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రత భారీగా నమోదవుతుందని, వడగాల్పులు వీస్తాయని ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.

హెచ్చుతగ్గులు…
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణంలోని ఉష్ణోగ్రతలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్యుడు మండిపోతుంటే … కొన్ని చోట్ల కాసేపు ఎండ, కొద్దిసేపు దట్టమైన మబ్బులు కనిపిస్తున్నాయి. ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పడిన సైక్లోనిక్‌ సర్కిల్‌ కారణంగా ఈ మార్పులు వచ్చాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల వాతావరణంలో చల్లదనం ఏర్పడిందంటున్నారు. ఇప్పటి వరకు 40 డిగ్రీల వద్ద నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రెండు, మూడు రోజుల పాటు 38-39 డిగ్రీలకు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలకు ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

42 డిగ్రీల వరకు అవకాశం…
విజయవాడలో గురువారం 40.75 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శుక్ర, శనివారాల్లో ఒక డిగ్రీ మేరకు తగ్గుతుంది. శుక్రవారం 39.78 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేశారు. శనివారం 39.24 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ రెండు రోజులు మాత్రమే భానుడు కాస్తంత ఉపశమనం కలిగించనున్నాడు. ఇక ఆదివారం నుంచి పరిస్థితి మామూలుగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తీవ్ర వడగాల్పులు…
శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్రవడగాల్పులు, 62 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. శనివారం 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 17 , విజయనగరంలో 24, పార్వతీపురం మన్యంలో 11, అల్లూరి సీతారామరాజులో 8, విశాఖపట్నంలో 3 మండలాలు, అనకాపల్లిలో 16, కాకినాడలో 9, కోనసీమలో 8, తూర్పుగోదావరిలో 19, పశ్చిమ గోదావరిలో 3, ఏలూరులో 7, ఎన్టీఆర్‌లో 2, గుంటూరులో 1, పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

➡️