ఈ విషయం తమ జట్టు కోచ్ దామోదర్తోనూ, సుబ్రహ్మణ్యంతోనూ చెప్పలేదు. గౌతమ్‌ను తప్ప మిగిలిన జట్టు సభ్యులందరినీ తరుణ్ శ్వేతబిలానికి ఆహ్వానించాడు. గౌతమ్ ఎప్పుడూ కోచ్ పక్కనే ఉంటాడు. పైగా అందరి మీద చాడీలు చెబుతుంటాడు. అందుకే గౌతమ్‌కు ఆహ్వానం అందలేదు. అయితే వీళ్లు ఎక్కడికో వెళుతున్నారన్న విషయాన్ని మాత్రం కనిపెట్టాడు. రహస్యంగా వారి మాటల్ని వినేందుకు ప్రయత్నించాడు. వారి మాటల్లో 'శేషాచలం', 'బిలం' అన్న పదాలు మాత్రమే తనకు గుర్తున్నాయి.
'తరుణ్... ఇంకెంత దూరంరా?' మన్సూర్ వాచీ చూసుకుని విసుక్కుంటూ అడిగాడు.
'వచ్చేశాంలే.... కంగారుపడకు.' దూరంగా కనుచూపుమేరలో కనిపిస్తోన్న బిలాన్ని చూపాడు.
'ఈ బిలాన్ని సందర్శిం చేవాళ్ళు ఎవరూ కనిపిం చడంలేదే! వెళ్ళి తిరిగి వస్తున్న వాళ్ళు ఒక్కరూ లేనట్లుంది.' నిశాల్ సైకిల్ వెనకాల నుంచి అటూఇటూ తొంగిచూస్తూ అన్నాడు.
'సందర్శకులు ఉంటారు... అయితే వాళ్ళు ఆదివారం రోజున అధికంగా వస్తారని తెలిసింది. ఈ రోజు ఆదివారం కాదుగా! అందుకే ఎవరూ కనిపించడం లేదు.' తరుణ్ తనకు తెలిసిన సమాచారం తెలిపాడు.
'క్రీమ్ కేక్ అంతా నాకే...' అటూ ఇటూ దిక్కులు చూస్తూ బిగ్గరగా చెప్పాడు పవన్.
పవన్ అంతే.. సందర్భం లేకుండా తనకు తోచిన విషయాలు మాట్లాడతాడు. ఇతరుల నుంచి తిరుగు జవాబు ఆశించడు. ఆకస్మికంగా మాట్లాడడం, బిగ్గరగా నవ్వడం, చేతులు కాళ్ళతో చిందులు వేయడం.... పవన్ అత్యంత సహజంగా చేసే పనులు.
'కేక్ నీకేలే.. కదలకుండా కూర్చో.' తరుణ్ చెప్పిన మాటల్ని పవన్ ఏమాత్రం పట్టించు కోకుండానే, 'చాక్లెట్లు.. బర్త్ డే చాక్లెట్లు పది కావాలి.' అంటూ బిగ్గరగా నవ్వసాగాడు.
మరో ఐదు నిముషాలకు అందరూ బిలం వద్దకు చేరుకున్నారు. కొండను తొలిచి ముఖద్వారం ఏర్పరచినట్లు ఉంది. కానీ, అది ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆకారం. అంతా నల్లరాతితోనే ఉంది. కానీ, శ్వేతబిలం అనే పేరు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. నాలుగు సైకిళ్ళను గుహ పక్కనే ఉన్న ఒక పెద్దచెట్టు చాటున ఉంచి, వాటికి తాళాలు వేశారు. అప్పటికి సమయం ఉదయం పది గంటలు. వాతావరణం ఆహ్లాదంగా, ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యకిరణాలు చెట్ల సందుల్లోంచి దూసుకువచ్చి, చురుక్కుమనిపిస్తున్నాయి. ఓ పావుగంట ప్రయాణించి, అందరూ బిలం లోపలికి ప్రవేశించారు. ముఖద్వారం చిన్నగా ఉన్నా, లోపలికి వెళ్ళే మార్గం విశాలంగా ఎత్తుగా ఉంది. పైకప్పు నుంచి చిత్రవిచిత్ర ఆకారాలలో ఉన్న రాళ్ళు వేలాడి ఉన్నాయి. అవి తెల్లగా ఉండడంతో మార్గం అంతా వెలుతురుతో నిండి ఉంది.
'ఈ మార్గం తెల్లగా ఉంది కాబట్టే దీనిని శ్వేతబిలం అన్నట్లుంది.' వివేక్ అందరికీ చెప్పాడు.
'అవును అదే నిజమై ఉంటుంది.' అన్నారందరూ.
బిలం నుంచి కాసేపు ప్రయాణించాక ఒక విశాలమైన గుహలోకి (మొదటి గుహ) అడుగుపెట్టారు. ఆ గుహ కూడా చిత్రవిచిత్ర ఆకారాలు ఉన్న రాళ్ళతో నిండి ఉంది. అక్కడక్కడా రాతిదిమ్మెలు ఉన్నాయి. కూర్చుని సేద తీరడానికి అనువుగా ఉన్నాయి. అలాంటి వాటిలో కాస్త పెద్దగా ఉన్న దిమ్మెను చూపుతూ, 'తరుణ్... కేక్ ఇక్కడ కట్ చేస్తావా?' వివేక్ అడిగాడు.
జోసెఫ్ తన వీపుకున్న సంచిని తీసి కిందపెట్టాడు. తరుణ్ పుట్టినరోజు కేక్ ఆ సంచిలోనే ఉంది. కేక్ కట్ చేసేటపుడు ఫొటోల కోసమని తరుణ్ సెల్ ఫోన్ కూడా తీసుకువచ్చాడు. అది వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యానిది. అయితే అది తన దగ్గరుంటే, పవన్ గొడవ చేస్తాడని పవన్ వద్దే ఉంచాడు. పవన్ ఫోన్ తీసి కెమెరా ఆన్ చేసి, గుహ మొత్తాన్ని అందులో చూస్తూ, తనలో తాను నవ్వుకోసాగాడు.
'మనం ఉన్నది మొదటిగుహ అనుకుంటాను. అదిగో.. అక్కడ లోపలికి వెళ్ళడానికి నాలుగైదు దారులు కనిపిస్తున్నాయి చూడండి. వాటిలో ఏదో ఒకదాని లోపలికి వెళ్ళి, కేక్ కట్ చేద్దాం! ఇప్పుడు మనమున్న చోటు ఎంతోమంది ఫొటోల్లో వచ్చి ఉంటుంది. లోపలికెళితే బర్త్ డే సెలబ్రేషన్స్ వెరైటీగా ఉంటాయి. మనం తీసే ఫొటోలు కూడా కొత్తగా ఉంటాయి. వెళదాం పదండి!' అని తరుణ్ తొందర చేశాడు. తరుణ్ చూపిన వైపు అందరూ చూశారు. గుహ అంతర్భాగంలోకి వెళ్ళడానికి ఓ నాలుగు మార్గాలు కనిపిస్తున్నాయి.
* శాఖమూరి శ్రీనివాస్