బిడ్డకు తల్లిపాలు పట్టించడం చాలా అవసరం. తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కనుక కనీసం ఆరు నెలలు నిండేవరకైనా తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కొంతమంది స్త్రీలకు పాలు తక్కువగా వస్తాయి. ఇలాంటివారు కొన్ని చిట్కాలు పాటించి, బిడ్డకు సరిపడా పాలను పట్టించవచ్చు.
బిడ్డకు పాలు సమృద్ధిగా అందాలంటే తల్లి బలమైన పోషకాహారం తీసుకోవాలి. మంచి ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్లు, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. ప్రోటీన్లు ఎక్కువగా లభ్యమయ్యే పాలు, గుడ్లు, మాంసం, చేపలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు విటమిన్-ఎ ఎక్కువగా ఉండే క్యారెట్, గుమ్మడి వంటి కాయగూరలు తినాలి. పోషకాలు ఎక్కువగా ఉండే ఉడికించిన బఠాణీలు, బీన్స్, మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. పొలెట్ అధికంగా లభ్యమయ్యే ఆకుకూరలు తినాలి. పండ్లు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల తల్లి నుంచి బిడ్డకు కావలసినన్ని పాలు దొరుకుతాయి.
బిడ్డకు పాలిచ్చే తల్లులు మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు. వీరి కోసం వండే ఆహారపదార్థాల్లో మసాలాలు తగ్గించుకోవాలి. తాజాపండ్లు తీసుకోవడం వల్ల తల్లి పాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతో బిడ్డ పాలు సరిపడినన్ని తాగడానికి వీలవుతుంది. వీటన్నింటితో పాటు తల్లి ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం కూడా అవసరమే.
పాలిచ్చే తల్లి తీసుకోవాల్సిన ఆహారం
