‘గానలహరి 2024’లో చిన్నారి ఆకుల లక్ష్మీరాయ్ సన్మానం 

Apr 1,2024 11:42 #Anantapuram District

ప్రజాశక్తి-నార్పల :  ఆదివారం బెంగళూరు కళ్యాణ్ నగర్ లోని ఇండో ఏషియన్ అకాడమీ సెమినార్ హాల్లో కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య, ఇండో ఏషియన్ అకాడమీ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం స్మృత్యర్థం ‘గానలహరి 2024’ పేరిట జాతీయస్థాయి గాయక సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ గానలహరి పోటీలో అనంతపురం జిల్లా నుండి పాల్గొన్న నార్పల విద్యార్థిని ఆకుల లక్ష్మీరాయ్ ని జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సమాఖ్య ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమాల కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య చైర్మన్ బొగ్గవరపు మాల్యాద్రి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం అయ్యాయి గాయక సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఇండో ఏషియన్ అకాడమీ విద్యాసంస్థల చైర్మన్ ప్రొఫెసర్ టి. ఏకాంబరం నాయుడు, మ్యూజిక్ థెరపిస్ట్, సెంటర్ ఫర్ మ్యూజిక్ అండ్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విదుషి డాక్టర్ మీనాక్షి రవి, వర్క్ లైఫ్ గురు, మేనేజ్మెంట్ విభాగం ఆచార్యులు డాక్టర్ శ్రీరామ్ దర్భ, ప్రముఖ రచయిత్రి, గాయని ఆచంట హైమవతి, ప్రముఖ చిత్రకారులు కేసనపల్లి మాల్యాద్రి, సమాఖ్య అధ్యక్షులు, బొగ్గవరపు మాల్యాద్రి,వెంకటచండీశ్వర్, ప్రధాన కార్యదర్శి కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ గాయకుల స్ఫూర్తితో వర్ధమాన గాయనీ గాయకులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో జాతీయస్థాయి సంగీత పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి తన గానామృతాన్ని పంచిపెట్టిన పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు జాతి గర్వించదగిన గాయకుడని కొనియాడారు. ఆరేళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న నాలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది గాయనీ గాయకులు ఈ పోటీల్లో పాల్గొనడం విశేషం. శాస్త్రీయ, జానపద, సినీ సంగీత నేపథ్యం కలిగిన పాటలతో పలువురు సీనియర్ గాయకులతో పాటు బాల బాలికలు అద్భుతంగా పాడిన పాటలు సంగీతాభిమానులను ఎంతగానో అలరించాయి. నిత్యం ఉరుకులు పరుగులతో బిజీగా గడిపే నగర ప్రజల మనసులకు ‘గానలహరి’ కార్యక్రమం ఉత్తేజాన్ని పంచిందన్నారు. గానలహరి పోటీలకు న్యాయ నిర్ణీతలుగా శ్రీమాతా సంగీత పాఠశాల శిక్షకురాలు ప్రసన్న శాస్త్రి, ప్రముఖ గాయకులు పేరపు మోహన్ రావు వ్యవహరించారు.

➡️