* నిబంధనలను సడలించే యోచనలో కేంద్రం
న్యూఢిల్లీ : ప్రకృతి సహజ సిద్ధమైన సంపదను బడాబాబులకు దోచిపెట్టేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించే పేరుతో బొగ్గు గనులను విదేశీ సంస్థలకు దోచిపెట్టేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా తమ 'లక్ష్యానికి' అడ్డంకిగా ఉన్న పలు నిబంధనల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు అరంభించింది. విదేశీ పెట్టుబడుదారులకు భారీగా బొగ్గు గనులను కట్టబెడుతూ, ముందస్తు చెల్లింపులను కూడా తగ్గించే యోచనలో కేంద్రం ఉంది. దేశానికి నష్టం చేకూర్చే ఇటువంటి చర్యపై పారిశ్రామిక వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తన సన్నిహితులైన కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు దేశానికి ఆదాయం తెచ్చిపెడుతున్న పలు ప్రభుత్వ సంస్థలను కూడా ప్రయివేటుపరం చేయాలనే యోచనలో మోడీ సర్కార్ ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా పలు కీలకమైన రంగాల్లో కూడా విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఉన్న నిబంధ నలను సడలించింది. ఇందులో భాగంగానే బొగ్గు గనులను కూడా విదేశీ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది.
ఏడాది చివరి నాటికి బొగ్గు మైనింగ్ రంగంలో విదేశీ టెండర్లను ఆహ్వానించాలనే యోచనలో కేంద్రం ఉంది. కేంద్రం వేస్తున్న ఈ అడుగు ఇందన రంగంపై కోల్‌ఇండియాకు ఉన్న గుత్తాధిపత్యానికి ముగింపు పలుకుతుందని ఇంధన రంగంపై అవగాహన ఉన్న నిపుణులు అంటున్నారు. బొగ్గు దిగుమతులను తగ్గించేందుకు, గ్లెన్‌కోర్ పిఎల్సి, బిహెచ్పి గ్రూప్, ఆంగ్లో ఇండియన్ పిఎల్సి, పీబోడీ ఎనర్జీ కార్పొరేషన్ వంటి అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు ఈ వేలం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ టెండర్ల వ్యవహారంపై బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కేటాయించిన బొగ్గు గనుల విలువలో చెల్లించే 10 శాతంగా వున్న ముందస్తు చెల్లింపులను తగ్గించే యోచనలో కేంద్రం ఉందని పేర్కొన్నారు. వేలానికి సంబంధించిన తేదీలను కేంద్రం ఇంకా ఖరారు చేయలేదు. ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశం జరిగిన తర్వాత దీనికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై ఒక స్పష్టత వస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. బొగ్గు రంగంలో పెద్దయెత్తున విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని కేంద్రం చూస్తోందని, అందుకుగానూ విధాన రూపకల్పన జరుగుతుందని బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి ఇంతకుముందు పేర్కొన్నారు. అక్టోబర్‌లో నిర్వహించిన దేశీయ వేలంలో 27 బొగ్గు బ్లాక్‌లను ఉంచగా, వాటిల్లో 21 బ్లాక్‌లకు కనీసంగా అవసరమైన మూడు బిడ్లు కూడా రాలేదు. దీంతో ఆరు బొగ్గు గనులను మాత్రమే ప్రభుత్వం కాంట్రాక్టుదారులకు అప్పగించింది. ఇలా తక్కువ సంఖ్యలో బిడ్డర్లు పాల్గొనడం అంటే వారు మరింత మరింత సరళీకృత నిబంధనలు కోరుకుంటున్నారన్న విషయం స్పష్టం అవుతోందని మంత్రి అన్నారు.
బొగ్గు గనుల వేలంలో పాల్గొనేందుకు ఇప్పటి వరకూ ఏ విదేశీ కంపెనీ కూడా ఆసక్తి చూపించలేదని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండిస్టీస్(ఎఫ్ఐఎంఐ) ప్రధాన కార్యదర్శి బికె.భాటియా తెలిపారు. బొగ్గును ఇతర దేశాలకు అమ్ముకునే అవకాశం లేకుండా విదేశీ కంపెనీలు రావని, లాభం ఉంటేనే వారు ఇటువైపు చూస్తారని దేశంలో మైనింగ్ రంగానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తి తెలిపారు.
బొగ్గు గనుల ప్రయివేటీకరణకు యత్నాలు
