ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో:
చైనాలోని తియాన్యూన్ గ్రూపునకు చెందిన కంపెనీ త్వరలో విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ బ్రాండిక్స్‌లో రూ.40 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. చైనాకు చెందిన ఈ అప్పారెల్ (వస్త్ర) కంపెనీ బ్రాండిక్స్ ఇండియా అప్పారెల్ సిటీ (బిఐఎసి)లో పెట్టడం ద్వారా జపాన్ తదితర దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు 4.5 ఎకరాల స్థలాన్ని బ్రాండిక్స్ కంపెనీ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.255 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా చైనా అడుగులు వేస్తోంది. దీని ద్వారా విదేశీ మార క ద్రవ్యం రూ.155 కోట్లు సంపాదించా లన్నది ఆ దేశం లక్ష్యంగా ఉంది. ఈ నూతన పెట్టుబడితో ఇప్పుడు బ్రాండిక్స్‌లో పనిచేస్తున్న దాదాపు 19 వేల నుంచి 21 వేల మంది సిబ్బందికి అదనంగా 1,800 మంది (వీరిలో 1600 మంది పురుషులు, 200 మంది స్త్రీలు)కు ఉపాధి లభించే అవకాశాలు న్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధింని డిపిఆర్‌ను బ్రాండిక్స్ కంపెనీకి చైనా అందజేసింది. తియాన్ యూన్ గార్మెంట్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ ప్రారంభం కానుంది.
ప్రగతిపథంలో విఎస్ఇజెడ్
విఎస్ఇజడ్ ఎగుమతుల ద్వారా రూ.74,743 కోట్లు గడచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో రూ.44,570 కోట్ల వరకూ ఆర్జించగా, ఈ ఏడాది గత ఆర్థికం కంటే మించిన ప్రగతి విఎస్ఇజడ్ సాధించే అవకాశాలున్నట్లు కంపెనీ వర్గాలు భావిస్తున్నాయి. అంటే, 29 శాతం గతేడాది కంటే సెజ్ లాభాలు ఆర్జించే అవకాశాలున్నాయి. విఎస్ఇజడ్ గత ఆరు నెలల కాలంలో 50 వరకూ నూతన యూనిట్లకు రూ.3,300 కోట్ల పెట్టుబడుల అంచనాలతో అంగీకారం తెలిపింది. వీటిపని ప్రారంభించి ఎగుమతుల ద్వారా రూ.31 వేల కోట్లు విఎస్ఇజడ్ ఆర్జించే అవకాశాలున్నాయని ఇటీవల విడుదల చేసిన ఆ సంస్థ బులెటిన్ వెల్లడించింది. 2016 నుంచి చైనా ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంటుందని అమెరికా మీడియా ప్రచారం చేసినప్పటికీ, ప్రస్తుతం 15.85 శాతంతో ఐదు రెట్లు జిడిపి ప్రగతి దిశలో పయనించడానికి చైనా అనుసరిస్తోన్న ఎగుమతుల వ్యూహమే కారణమని సెజ్‌కు చెందిన ఓ పారిశ్రామిక అధికారి పేర్కొన్నారు.