న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది మార్చిలో భారత ఎగుమతుల్లో తగ్గుదల చోటు చేసుకుంది. ఏడాది ప్రాతిపదికన 0.66 శాతం తగ్గి 29.11 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇంతక్రితం నాలుగు మాసాల్లో వరుసగా ఎగుమతులు పెరిగాయి. గత మాసంలో దిగుమతులు 7.15 శాతం పెరిగి 42.80 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్యలోటు 13.69 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మార్చిలో భారత్ 11.11 బిలియన్ డాలర్ల విలువైన చమురును దిగుమతి చేసుకున్నది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో దిగుమతి చేసుకున్నదాంతో పోలిస్తే 13.92 శాతం పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 9.78 శాతం పెరిగి 302.84 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతులు 19.59 శాతం ఎగిసి 459.67 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్యలోటు 156.83 బిలియన్ డాలర్లుగా ఉన్నది. గత మార్చిలో పసిడి దిగుమతులు 40.31 శాతం తగ్గి 2.49 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో కరెంట్ ఎకౌంట్ లోటు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మార్చిలో తగ్గిన ఎగుమతులు
