* టిడిపి తన వైఖరిని పున్ణపరిశీలించుకోవాలి
* పార్లమెంటు సభ్యులకు సిపిఎం విజ్ఞప్తి
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:
సోమవారం నుండి ప్రారంభం కానున్న శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో మన రాష్ట్ర హక్కుల సాధన కోసం పోరాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పార్లమెంటు సభ్యులకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి మధు కమిటీ తరపున శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకటన సారాంశం...మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలు అమలు జరపకుండా కేంద్రం విద్రోహానికి పాల్పడుతోందిది. ఎన్నికలకు ముందు ఈ అంశాల సాధన కోసం పలు పోరాటాలు జరిగాయి. రాష్ట్ర బంద్‌తో సహా వామపక్షాల ఆధ్వర్యంలో అనేక రూపాల్లో ఆందోళనలు సాగాయి. వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన తదితర పార్టీలు కూడా ఈ ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నాయి. ప్రజా ఒత్తిడికి తలొగ్గి బిజెపి ఫ్రంట్ నుండి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ధర్మపోరాటం పేరుతో దీక్షలు చేసింది. కానీ ఎన్నికల తరువాత బిజెపి బెదిరింపులకు తలొగ్గి ఈ పార్టీలు కేంద్ర ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నాయి. ఈ వైఖరి రాష్ట్రానికి తీరని హాని కలిగిస్తుంది. బెదిరింపులకు తలొగ్గకుండా రాష్ట్ర ప్రయోజనాలే మిన్నగా భావించి అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో తమ గళాన్ని వినిపించాలని, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించాలని కోరుతున్నాం. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రం పట్ల తీవ్ర వివక్షత కొనసాగిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరించడమే గాక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన రూ.7,530 కోట్లు నిధులు కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టింది. పోలవరం ప్రాజెక్టు నిధులు పెండింగులో ఉంచింది. విభజనానంతరం రెవెన్యూ లోటుకు నిధులిచ్చి ఆదుకోవాల్సిన కేంద్రప్రభుత్వం రూ.23 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. కేంద్ర విద్యా సంస్థల నిర్మాణానికి నిధులు ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలను పెట్టేందుకు ముందుకు రాలేదు. ఉపాధి హామీ నిధులు మొదలు కడప ఉక్కు, రామాయపట్నం పోర్టు వంటి కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు చేపట్టి చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా రాష్ట్రం మరింత వెనుకపట్టు పడుతుంది.
ఈ పార్లమెంటు సమావేశాల్లో మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం నిలబడి పోరాడమని ముఖ్యమంత్రి ఎంపిలకు పిలుపునివ్వడం హర్షణీయం. అవసరమైతే ఢిల్లీ వీధుల్లో కూడా మన గళం వినిపించాలి. ముఖ్యమంత్రి సారధ్యంలో అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి. ఎంపిల సమావేశంలో ఆయన చెప్పినట్లుగా పార్లమెంటులో మన సభ్యులు పోరాడతారని ఆశిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎంపిల సమావేశంలో రాష్ట్ర హక్కుల సాధన కోసం పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదు. ఈ వైఖరి వల్ల పార్టీలకు అతీతంగా రాష్ట్ర ఎంపిలు అందరూ ముక్త కంఠంతో వినిపించాల్సిన డిమాండ్స్ బలహీనపడతాయి. మన రాష్ట్రం ఎదుర్కొనే అనేక సమస్యలను ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి సాధించాల్సినవి. దానికి బదులుగా పార్లమెంటును వేదిక చేసుకుంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులివ్వకుండా కేంద్రం నాటకాలు ఆడడానికి అవకాశం కల్పించినవారవుతారు. ఈ విషయంలో తెలుగుదేశం తమ వైఖరిని పున:పరిశీలించుకోవాలని, ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు నిధుల కోసం పోరాడాలని కోరుతున్నామని మధు పేర్కొన్నారు.