* డిసెంబర్ 2 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
అమరావతి : డిసెంబర్ 2 నుంచి ఎపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 15 రోజులపాటు జరగనున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం శనివారం తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి, వైసిపిలో చేరే అంశంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సభ్యుడైనా పార్టీ మారాలనుకుంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనని పేర్కొన్నారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే, చర్యలు తప్పవని తెలిపారు. సభా నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. ఆయన దానికే కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. వల్లభనేని వంశీ వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరాల్సిందేనని, సభాపతిగా తన వైఖరి కూడా అదేనని పేర్కొన్నారు. ఎపిలో శాసనసభ, శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పేపర్ లెస్ డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పార్టీ మారాలంటే పదవికి రాజీనామా చేయాల్సిందే : స్పీకర్ తమ్మినేని
