* నా పెళ్లిళ్ల వల్లే మీరు రెండేళ్లు జైలుకెళ్లారా
* ఫ్యాక్షన్ ధోరణికి భయపడేదిలేదు
* పవన్ కల్యాణ్
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో:
తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని అధికార పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడ జనసేన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలను ఎండగడుతున్నామనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. పాలసీ విధానాలపై మాత్రమే తాము స్పందిస్తామన్నారు. అబుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి తనపై చేసిన విమర్శలపై పవన్ ఘాటుగా స్పందించారు. '' ప్రతిసారీ మూడు పెళ్లిళ్లు చేసుకున్నానంటూ విమర్శిస్తున్నారు. నేను చేసుకున్న పెళ్లిళ్ల వల్లే మీరు రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నారా '' అంటూ ఎద్దేవా చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక నుంచి తెలుగు మాద్యమం రద్దు వరకు ఏవీ పద్ధతిలో లేవన్నారు. ఇసుక నిర్మాణానికి, ఆర్థిక ప్రగతికి కూడా ముడి సరుకుగా ఉందని, దీనిపై ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు గత నాలుగు నెలలుగా రోడ్డున పడ్డాయని అన్నారు. ఇసుక విధానం పై 18 పాయింట్లను సూచిస్తూ గవర్నర్‌కు నివేదిక అందజేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టాలి కానీ అది హేతుబద్దంగా ఉండాలని సూచించారు. తామంతా ప్రాథమిక విద్య అంతా మాతృభాషలోనే చదివామని, ఇప్పటికిప్పుడు టీచర్లందరికీ శిక్షణ ఇచ్చి మార్చేస్తామంటే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఉపరాష్ట్రపతి హోదాను కూడా మరచి వెంకయ్య నాయుడును విమర్శించారని అన్నారు. ఇప్పటికీ తమిళనాడులో తెలుగు మాద్యమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టాలంటే ముందుగా టీచర్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చి, పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టి మళ్లించేందుకే ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. సిఎం స్థాయిలో ఉన్న జగన్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. ఫ్యాక్షన్ ధోరణికి జనసేన భయపడేదిలేదని, గొడవ పెట్టుకోవాలనుకుంటే తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, ప్రధాన కార్యదర్శి శివ శంకర్ పాల్గొన్నారు.
గవర్నర్‌ను కలిసిన పవన్:
రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికుల పరిస్థితిపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు పవన్ వివరించారు. మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఆయన తక్షణమే ఈ సమస్యపై జోక్యం చేసుకోవాలని, ప్రభుత్వం తక్షణం స్పందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగపడేలా ఇసుక విధానం ఉండాలని, అందుకు తగిన సూచనలతో కూడిన ప్రణాళికను గవర్నర్‌కు అందజేశారు.