శ్రీకాకుళం : అటవీ హక్కుల రక్షణకుగాను.. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మన్యం బంద్ కొనసాగుతోంది. ఇప్పటికే గిరిజన సంఘం అధ్యక్షులు బిడ్డిక అప్పారావు, కార్యదర్శి సాంబయ్య లు సుమారు 100 మంది గిరిజనులతో ఈ బంద్‌లో పాల్గన్నారు. షాపులు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు.
మరో వైపు.. రాజవొమ్మంగిలోనూ బంద్ కొనసాగుతోంది.
కురుపాం లో మన్యం బంద్ కొనసాగుతుండటంతో.. రావడ కూడలి వద్ద ఆటో లు నిలిచిపోయాయి. ఆటో కార్మికులు బంద్‌కు సహకరించారు. మన్యం బంద్ కారణంగా.. మండలంలోని నీలకంటాపురం మొండెం కల్ కేంద్రాల్లో షాపులు, టీ కొట్లు మూసి ఉండడంతో అక్కడి ప్రదేశమంతా నిర్మానుష్యంగా మారింది. నాన్ షెడ్యూల్ ఉన్న గిరిజన గ్రామాలను 5 వ షెడ్యూల్లో చేర్చాలని, గిరిజన యూనివర్సిటీని తక్షణమే ప్రారంభించాలని, గిరిజనులందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింప చేయాలని, కొండపోడు సాగుచేస్తున్న గిరిజనులందరికీ పట్టాలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలనే తదితర డిమాండ్లతో ఎపి గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన్యం బంద్ కొనసాగుతోంది.
గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో మన్యం బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి గుమ్మలక్ష్మీపురంహొగ్రామానికి రావలసిన ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్రాక్కర్లు నిలుపుదల చేశారు. హోటళ్లు, కిరాణా షాపులు మూతపడ్డాయి. ఎల్విన్ పేట ప్రధాన రహదారిపై ఎపి గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మండంగి రమణ, కోలక అవినాష్, నాయకులు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు.

