ఉత్తరప్రదేశ్ : సుప్రీం కోర్టు మాదే.. అని, వివాదాస్పద అయోధ్య ప్రాంతంలో రామాలయాన్ని నిర్మిస్తామని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంత్రి ముకుత్ బిహారీ వర్మ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల గురువారం సుప్రీం కోర్టు స్పందించింది. అయోధ్య కేసు విచారణ సమయంలో మంత్రి వ్యాఖ్యలను చీఫ్ జస్టిస్ రంజన్ గోగొయ్ తప్పుపట్టారు. ఇలాంటి వ్యాఖ్యలను ధర్మాసనం ఖండిస్తుందని అన్నారు. రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో యూపీ మంత్రి మాట్లాడుతూ.. సుప్రీం కోర్టుపై కామెంట్ చేశారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం తమ లక్ష్యమని, సుప్రీం కోర్టు తమదే అని, న్యాయవ్యవస్థ, ఈ దేశం, ఈ ఆలయం అన్నీ తమదే అన్న అభిప్రాయాన్ని ఆ మంత్రి వినిపించారు. అయోధ్య కేసులో అన్ని వర్గాలకు అనుకూలమైన తీర్పును వెల్లడిస్తామని సీజేఐ తెలిపారు. అయోధ్యపై రోజువారీ విచారణ కొనసాగుతోన్న నేపథ్యంలో... నేడు 22 వ రోజున కూడా విచారణ కొనసాగించారు. సున్నీ బోర్డు తరపున సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ మాట్లాడారు. తానేమీ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని.. కానీ ముస్లింలకు బెదిరింపులు వస్తున్నాయన్నారు. కొన్ని రోజుల క్రితం చెన్నైకి చెందిన 88 ఏళ్ల షణ్ముగం అనే వ్యక్తి అడ్వకేట్ ధావన్‌కు బెదిరింపు లేఖ రాశారు. ఈ అంశాన్ని ఆయన సుప్రీం ముందు కూడా ప్రస్తావించారు.
సుప్రీం కోర్టు మాదే.. : యూపి మంత్రి ముకుత్ బిహారీ
