లక్నో : ' రాయబరేలి రాబిన్ హుడ్ ' గా ప్రజలంతా ఆప్యాయంగా పిలుచుకునే రాయబరేలి మాజీ ఎమ్మెల్యే అఖిలేష్ సింగ్ మంగళవారం ఉదయం సుదీర్ఘ అస్వస్థతతో లక్నో లో కన్నుమూశారు. 59 ఏళ్ల అఖిలేష్ సింగ్ రాయబరేలి (సదర్) నియోజకవర్గం నుంచి అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అస్వస్థత కారణంగా సోమవారం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చేరారు. చికిత్స పొందుతూ మంగళవారం అఖిలేష్ సింగ్ రాయబరేలి తుది శ్వాస విడిచారు. రాయబరేలి ఎమ్మెల్యేగా ఒకసారి కాంగ్రెస్ నుంచి, మరోసారి పీస్ పార్టీ నుంచి, మూడు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా, పెద్ద కుమార్తె అదితి విదేశాల్లో చదువుకుని వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017 లో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాయబరేలి (సదర్) నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె 95,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అఖిలేష్ సింగ్ అంత్యక్రియలు తన పూర్వీకుల గ్రామమైన లాలూపూర్‌లో నేడు నిర్వహించనున్నారు.