ప్రజాశక్తి - డెంకాడ (విజయనగరం):
ఎసిబి వలలో మరో అవినీతి చేప చిక్కింది. రైతు నుంచి విఆర్ఒ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. ఎసిబి డిఎస్పి బివిఎస్.నాగేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా పద్మనాభ మండలం బొత్సపేటకు చెందిన రైతు చందక సన్యాసప్పడుకు డెంకాడ మండలం బొడ్డవలసలో 80 సెంట్ల భూమి ఉంది. దీనికి మ్యుటేషన్ చేయమని గతేడాది రెవెన్యూ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు విఆర్ఒ మెరకయ్య చుట్టూ బాధిత రైతు గతేడాది నుంచి తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయింది. రూ.లక్షా 50 వేలు ఇస్తేనే మ్యుటేషన్ చేస్తానని విఆర్ఒ చెప్పాడు. దీనికి రైతు రూ.30వేలు ముందుగానే ఇచ్చేశాడు. అయినా పని పూర్తికాలేదు. దీంతో విసిగిన ఆ రైతు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. తహశీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఒకు బాధిత రైతు రూ.10వేలు లంచం ఇస్తుండగా దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం విశాఖ ఎసిబి ప్రత్యేక న్యాయస్థానానికి తరలించారు. ఈ దాడిలో డిఎస్పితో పాటు సిఐలు కె.సతీష్, ఎం.మహేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు.