మైదుకూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల లోని ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థులకు వర్తింపజేసేందుకు తన వంతు కృషి చేస్తానని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు తెలియజేశారు. మైదుకూరు పట్టణంలోని సాయిబాబా కల్యాణమండపంలో ప్రైవేటు యాజమాన్యాల సంఘం( కృష్మ) ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే రఘురాం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్యనభ్యసించే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల సహాయం అందిస్తానని చెప్పారని కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అమ్మ ఒడి అందించేలా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలు ఎంతో మంది ఉపాధిని అందిస్తున్నాయని, అమ్మ ఒడి ప్రభుత్వ స్కూళ్లకు వర్తింపజేస్తే ప్రైవేట్ పాఠశాలల పై ప్రభావం చూపే అవకాశం ఉందని కనుక ప్రతి విద్యార్థి తల్లికి అందేలా సానుకూల నిర్ణయం తీసుకునేలా సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ప్రైవేటు పాఠశాలలో కొన్ని జీవనోపాధి కోసం ఏర్పాటుచేసిన వైతే మరి కొన్ని కార్పొరేట్ పాఠశాలలు మాత్రం వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నాయి అన్నారు. ప్రభుత్వం అమ్మఒడి పథకం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అన్న నిర్ణయం ఇంకా ప్రభుత్వం తీసుకోలేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జన్మదినం సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల సంఘం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రధాన కార్యదర్శి బద్వేలు రామకృష్ణారెడ్డి, గౌరవాధ్యక్షుడు ఓబుల్ రెడ్డి , ఆంజనేయులు, శ్రీనివాసులు, రామ శేఖర్ రెడ్డి, రామ మోహన్, మురళి మోహన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, ఎం ఎం భాష, ఉపాధ్యాయులు, వైసిపి నాయకులు మాచనూరు చంద్ర శ్రీనివాసులు, తప్పెట శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘అమ్మ ఒడి’ ప్రతి విద్యార్థికి వర్తించేలా కృషి : ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
