కార్వార్: కర్ణాటకలో ప్రయాణికుల పడవ బోల్తా పడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కార్వార్ ప్రాంతంలో 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 8 మృతదేహాలను వెలికి తీసినట్లు నేవీ సిబ్బంది అధికారులు తెలిపారు. 17 మందిని రక్షించినట్లు వెల్లడించారు. కూర్మగూడజత్రాలో జరుగుతున్న ఓ జాతరకు హాజరై తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కనుగొనేందుకు గోవా నుంచి డైవర్లు, హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
