హైదరాబాద్: ర్యాపర్, నటుడు నోయెల్ ఓ ఇంటివాడయ్యారు. ఆయన నటి ఎస్తేర్ నోరోన్హాను వివాహం చేసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పెళ్లిలో దిగిన ఫొటోను నోయెల్ ట్విటర్ వేదికగా పంచుకున్నారు. తాము ఇప్పుడు ఇద్దరు కాదని, ఒక్కటే అని అన్నారు. తన హృదయానికి ఆమే రాణి అని నోయెల్ ట్వీట్ చేశారు. అందరి ఆశీస్సులు కావాలని కోరారు. వీరి వివాహానికి ఎస్.ఎస్. రాజమౌళి, రమ కూడా హాజరయ్యారు. మంగళూరులో వీరి వివాహం జరిగినట్లు తెలిసింది. నోయెల్ నటుడిగానే కాకుండా గాయకుడిగానూ గుర్తింపు పొందారు. ఆయన ‘మగధీర’, ‘ఈగ’, ‘కుమారి 21 ఎఫ్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ప్రేమమ్’, ‘రంగస్థలం’, ‘హలో గురు ప్రేమ కోసమే’,‘పడి పడి లేచె మనసు’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.


