- సురక్షిత ప్రాంతాలకు 17లక్షల మంది తరలింపు
- ఐదు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి
- అకస్మిక వరదల ముప్పు?
విల్మింగ్టన్, (అమెరికా) : ఫ్లోరెన్స్ తుపాను అమెరికా తూర్పు తీరాన్ని వణికిస్తోంది. గురువారం పొద్దుపోయిన తర్వాత నుండి దీని తీవ్రత పెరిగింది. శనివారం ఉదయానికి తుపాను తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. తుపాను ప్రభావం కారణంగా ఉత్తర, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గంటకు వంద నుండి 150కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలతో వరద ముప్పు పొంచి వుంది. బుధవారం నాటికి అత్యంత ప్రమాదకరమైన నాల్గవ కేటగిరీలో వున్న ఫ్లోరెన్స్ తుపానును గత రెండు రోజుల్లో కేటగిరీ 1కి తగ్గించారు. అయినప్పటికీ బలమైన గాలుల కారణంగా బీభత్సం తగ్గలేదని అధికారులు తెలిపారు. కేటగిరీ ఏదైనప్పటికీ తుపానును తీవ్రంగా పరిగణించి అప్రమత్తంగా వుండాల్సిందేనని, ఇదంతా నీటితో వ్యవహారమని వాతావరణ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. వాతావరణ వ్యవస్థలో ఎప్పుడో ఒక్కోసారి ఇటువంటి భీకర పరిస్థితులు తలెత్తుతాయని, గురువారం తెల్లవారు జామునుండే గాలులు బలపడినందున జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. ఈ తుపాను తీవ్రమైన స్థాయిలో విధ్వంసాన్ని మిగులుస్తుందని ఉత్తర కరోలినా గవర్నర్ రాయ్ కూపర్ వ్యాఖ్యానించారు. ఉత్తర కరోలినాలోని కొన్నిచోట్ల స్వల్ప స్థాయిలో ఇప్పటికే వరదలు ముంచెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 40అంగుళాల మేర వర్షం పడే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వర్షపాతంతో అకస్మాత్తుగా వరదలు సంభవించే అవకాశం వుందని పేర్కొన్నారు. ఉత్తర, దక్షిణ కరోలినాలు, వర్జీనియాలో దాదాపు 17లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
అమెరికా తూర్పు తీరాన్ని వణికిస్తున్న ఫ్లోరెన్స్
