- రేపు సిఎం పట్టు వస్త్రాలు సమర్పణ
ప్రజాశక్తి - తిరుమల:
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 13వతేదీ నుంచి 21 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గురువారం ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకు ముందురోజు బుధవారం రాత్రి 7-8 గంటల మధ్య శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశిస్సులు పొందడమే ఈ ఘట్టం విశిష్టత. ఈ మొత్తం కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణ, మంగళవాయిద్యాల నడుమ సాగింది. అనంతరం విష్వక్సేనుల వారు నాలుగు మాడావీధుల్లో తిరిగారు. దీంతో ఈ అంకురార్పణ ఘట్టం ముగిసింది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు. గురువారం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను శ్రీ వారికి సమర్పించనున్నారు. ఉదయం సిఎం తిరుపతి చేరుకొని, బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. రాత్రి ఏడు గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత ఆలయ సాంప్రదాయబద్దంగా తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. దర్శనానంతరం రాత్రి 8.40కి పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడే బసచేయన్నారు. శుక్రవారం ఉదయం 7.30కు తిరుమలలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. ఉదయం 8.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరానికి తిరిగి బయలుదేరనున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
