విజయనగరం జిల్లా: గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్వింపేట గ్రామానికి చెందిన మహిళ విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకెళితే.. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్వింపేట గ్రామానికి చెందిన మండల గోపి ఆయన భార్య మండల లక్ష్మి (34) లు హైదరాబాద్లో కూలి పని చేస్తూ జీవిస్తున్నారు. వీళ్లకు 12 సంవత్సరాల కుమార్తె, పది సంవత్సరాల కుమారుడు ఉన్నారు. వీళ్ళ పిల్లలు గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్వింపేటలో ఉంటున్న మండల గోపి తల్లి పద్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. నిన్న (ఆదివారం) రాత్రి 8 గంటల సమయంలో గోపి, లక్ష్మిలు హైదరాబాద్ నుంచి పిల్లల్ని చూడడానికి ఎల్వింపేటకు వచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో లక్ష్మి విద్యుత్ షాక్తో మృతి చెందిందని బోరున ఏడుస్తూ..అత్త బయటకు వచ్చి చెప్పింది. అక్కడికి చేరుకున్న ఇరుగుపొరుగు వారు వెంటనే 108కి ఫోన్ చేశారు. అప్పటికే లక్ష్మి మరణించిందని డాక్టర్లు తెలియజేశారు. సమాచారం తెలిసిన ఎల్వింపేట
ఎస్ఐ కె.కిరణ్ కుమార్ నాయుడు, సిఐ ఎస్.రాము ఘటనా స్థలానికి చేరుకొని పూర్వాపరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి మృతికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎల్వింపేట గ్రామంలో విద్యుత్ తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకున్న మహిళ
