అమరావతి : గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తన ఉదారత చాటుకున్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు తన వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఎంపీగా తనకు వచ్చే నెల జీతాన్ని కేరళ వరద బాధితులకు సాయంగా ప్రకటించారు. దీంతో పాటుగా అమరరాజా కంపెనీ తరుపున 500 ఎమర్జెన్సీ ఫోన్ చార్జింగ్ మిషన్లను కేరళకు పంపిస్తున్నారు. వరదలతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కేరళ ప్రజలకు విద్యుత్ సరఫరా లేదు. కనీసం సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకునే అవకాశం లేకపోవడంతో సమాచారంకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకున్న ఎంపీ గల్లా జయదేవ్ తన అమర రాజా కంపెనీ తరపున 500 ఎమర్జెన్సీ ఫోన్ చార్జింగ్ మిషన్లను కేరళ రాష్ట్రం పంపిస్తున్నట్లు గల్లా ప్రకటించారు. ఈ సందర్బంగా వరదలలో మృతి చెందిన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. కేరళ రాష్ట్రం వరదల నుంచి త్వరగా కొలుకోవాలని ప్రార్దిస్తున్నట్లు కోరారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆయన కోరారు.
కేరళ వరద బాధితులకు ఎంపీ గల్లా జయదేవ్ సాయం
