- ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సర్వేల్లో నిర్ధారణ
బర్నగర్వాల్, మహారాష్ట్ర : మహారాష్ట్రలో పోషకాహారం లోపం కేసులు బయటకు రావడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. పెద్ద సంఖ్యలో పిల్లలు పోషకాహారం లోపంతో తరచూ అస్వస్థతకు గురవుతున్నా అవేవీ కూడా మహిళా, శిశుసంక్షేమ శాఖ అధికారుల దృష్టికి రావడం లేదు. కానీ స్వచ్ఛంద సంస్థల సర్వేల్లో మాత్రం అవి వెలుగు చూస్తున్నాయి. దీంతో ఈ కేసులు ఎక్కువగా వున్న రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ప్రజారోగ్య శాఖ సర్వే నిర్వహించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోషకాహారం లోపం కేసులు గణనీయంగా వున్నా వాటిల్లో కొన్నే బయటకు వస్తున్నాయి. పిల్లలకు ఉచిత, పోషకాహారం అందించే పథకం ఐసిడిఎస్ రికార్డుల్లో నమోదు అయిన దానికన్నా చాలా ఎక్కువ కేసులు పూనే, నందర్బార్, రారుగడ్ జిల్లాల్లో నెలకొన్నాయని, అయితే అవి బయటకు రావడం లేదని వెల్లడైంది. పూనేలో 28.18శాతం మంది చిన్నారులు (వీరందరూ ఆరేళ్ళ లోపు వారే) వుండాల్సిన బరువు కన్నా చాలా తక్కువగా వున్నారు. కానీ ఐసిడిఎస్ రికార్డుల్లో మాత్రం వీరి సంఖ్య కేవలం 10.38శాతంగానే వుంది. పోషకాహారం లోపంతో 14.5శాతం మంది బాధపడుతుండగా, ఐసిడిఎస్ రికార్డుల్లో మాత్రం కేవలం 5.03శాతం మందే వున్నట్లు నమోదైంది.
మహారాష్ట్రలో వెలుగు చూడని పోషకాహారం లోపం కేసులు
