పుస్తకం : మనసు గతినే మార్చిన ఫ్రాయిడ్
రచన : అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి,
కాకుమాను శ్రీనివాసరావు
పేజీలు : 165, ధర : 120/-
ప్రతులకు : పల్లవి పబ్లికేషన్,
డా. ఎ.ప్రేమ్చంద్ కాంప్లెక్స్,
అశోక్ నగర్, మొదటి సందు
విజయవాడ - 520010
సెల్ నెం : 9866115655, 8522003536
మూఢత్వంతో స్తబ్దుగా ఉన్న మానవాళిని జీవ పరిణామ సిద్ధాంతంతో డార్విన్ ఎలా కుదిపేశాడో... సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మనోశాస్త్ర విజ్ఞానంతో అంతే తీవ్రంగా ప్రభావితం చేశాడు. హిస్టీరియా, వివిధ మానసిక రుగ్మతలకు ప్రేతాత్మలు, దెయ్యాలకు ముడివేసి గుడ్డివిశ్వాసాల ఊబిలో కూరుకుపోతున్న ప్రపంచాన్ని తన సైకో అనాలసిస్ విధానాలతో పైకి లాగాడు. కలలతో భవిష్యత్తు కాదు, గతంలోకి వెళ్లి మనసుకి చికిత్స చేసుకోవాలనే 'డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్'ను మానవజాతికి అందించాడు. శైశవ దశలోనే మానసిక గాఢతలు, తీవ్రతలు ప్రభావితం చూపుతాయని చైల్డ్ సైకాలజీకి దారులు తెరిచాడు. వివిధ మనో ప్రవృత్తులు, వికారాలు, సంక్లిష్టతల గురించి ఓ ఆలోచనకు శాస్త్రీయ సమాజాన్ని తీసుకురాగలిగాడు. ఒక మనిషితో మొదలై మానవజాతి సాంఘిక నిర్మాణం, యుద్ధాల కారణాలు వరకు ప్రతిదానికి మానసిక శాస్త్రంతో జవాబులు వెదికే కొత్త అధ్యయనాన్ని అందించివెళ్లాడు. ఇలా ఒక్క మనసు గతినే కాదు, ప్రపంచగతినే మార్చేసిన మేధావి ఫ్రాయిడ్. ఇడ్, ఇగో, సూపర్ ఇగో.. మాట ఇప్పుడు కాస్త విజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరి నోట వినబడుతుందంటే.. సామాన్యులకూ ఎంత అందుబాటులోకి మానసిక శాస్త్ర విజ్ఞానాన్ని తెచ్చాడో అర్థమవుతోంది. ఆధునిక మనోశాస్త్ర వైతాళికుల్లో ఒకరిగా పేర్కొనే ఫ్రాయిడ్ అభివృద్ధి చేసిన శాస్త్రం మీదనే కాక అతడి జీవితసారాన్ని పాఠకులకు అందించిందీ పుస్తకం. చిన్నప్పటి నుంచి ఫ్రాయిడ్ జీవితాన్ని విశ్లేషిస్తూ తనను తాను ఆయన ఎలా కనుగొంటూ.. శాస్త్రీయంగా దానిని సిద్ధాంతీకరిస్తూ.. ప్రయోగాలతో ఫలితాలు సాధిస్తూ ఫ్రాయిడ్ మానసిక విజ్ఞానంలో ఎలా పురోగమించిందీ చెబుతుందీ పుస్తకం. ఫ్రాయిడ్ జీవితంలో ఎదుర్కున్న అనేక ఒడిదుడుకులను ప్రస్తావిస్తూనే వాటి నుంచి తానేం పాఠాలు నేర్చుకున్నాడు, మానవాళికి ఏం జవాబులు అందించాడనే ముఖ్య విషయాల్ని దీన్నుండి గ్రహించొచ్చు. అలాగే, ఆయన అభివృద్ధి చేసిన, సైకో అనాలసిస్, డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ వంటి శాస్త్రీయ విషయాలపై ఇచ్చిన సమాచారంతో కొంత అవగాహన పొందొచ్చు. ఈ పుస్తకం చదివాక ఫ్రాయిడ్ గురించి మరింత విషయాల్ని తెలుసుకోవాలనే ఉత్సాహం కలుగుతుంది. అప్పటివరకు ఫ్రాయిడ్ గురించి అంతగా తెలీనివారికి ఇదో గైడ్ బుక్. ఆయన అందించిన విజ్ఞానాన్ని జనాల్లోకి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉపకరిస్తుంది. ఫ్రాయిడ్ జీవిత పార్శ్వాల్ని పరిచయం చేసిన ఈ పుస్తకం అందరూ చదవదగ్గది. కొన్నిచోట్ల.. ముఖ్యంగా శాస్త్రీయ విషయాలప్పుడు వచ్చే తెలుగు పదాలు అందరికీ తేలిగ్గా అర్థంకావు. బ్రాకెట్లో ఇంగ్లిష్లో ఇచ్చుంటే కాస్త వెసులుబాటు ఉండేది. ఇది మినహా.. తొలి వాక్యం నుంచీ చివరికంటా ఉద్విగతతో చదివేలా రాసిన రచయితలకు ధన్యవాదాలు. అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కాకుమాని శ్రీనివాసరావు అద్భుతమైన రచనాశైలితో ఫ్రాయిడ్ జీవితాన్ని కళ్లకు కట్టారు. ఫ్రాయిడ్ మనస్సేంటి.. దాని గతిని కృషితో ఎలా మార్చుకున్నాడనే స్ఫూర్తి కథను అందించారు.
- అనన్య ప్రసిద్ధ్
ప్రపంచగతినే మార్చిన వ్యక్తి కథ
