ఓ పదిరూపాయల నోటు ఆదమరుపుగా బెంచీ పక్కన పెట్టినా మడతపెట్టేసే కాలంలో... వీధుల్లో డబ్బుని విడిచేసి ఎవరి పనుల్లో వాళ్లు ఉండే ఊరొకటి ఉంది. రొమేనియాలోని ఐబెంతాల్ అనే మారుమూల గ్రామమిది. బానాతులురు పర్వత ప్రాంతంలోని ఈ ఊరిని చేరుకోవడం చాలా కష్టం. అందుకే, ప్రతి ఇంటికి కావాల్సిన బ్రెడ్డు ముక్కల్ని దూరపు ప్రాంతం నుంచి వచ్చే బ్రెడ్ ట్రక్కు తెస్తుంది. వీధుల్లోని స్తంభాలకు కట్టే బ్యాగుల్లో ఇంటివాళ్లు డబ్బు పెట్టేసి ఉంచితే.. వాటికి బదులుగా బ్రెడ్ ముక్కల్ని పెట్టి వెళతారు. ఇదేకాదు, ఒకరి ఇంటి ప్రాంగణంలోకి మరొకరు అనుమతి లేకుండా ప్రవేశించరు. విలువైన వస్తువుల్నీ గ్యారేజ్ల్లో వదిలేసి వెళుతుంటారు. అవి తెరిచే ఉన్నా ... ఇంట్లో ఎవరూ లేకున్నా దొంగతనం జరగదు. స్థానికులంతా ఒకే మాట మీద ఉండటం.. వారికంటూ కొన్ని క్రమశిక్షణ నియమాల్ని పెట్టుకోవడం వల్ల అంతా సరిగ్గా జరుగుతోంది. అందుకే పోలీస్స్టేషన్ అవసరం కూడా లేదు. 20 ఏళ్ల కిందట సంక్షోభం వల్ల ఈ ఊళ్లో నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. దూరం నుంచే ఏమైనా తేవాలి. ఇదే వీరందరినీ ఒకే తాటి మీదకు తెచ్చింది. ఎవరైనా బయటి నుంచి దొంగ వచ్చి దాడి చేసేందుకు అవకాశం లేదు. బయటి వ్యక్తుల్ని అంతా గమనిస్తూనే ఉంటారు.