తెలుగులో పేరొందిన సినిమా నిర్మాణ సంస్థల్లో అన్నపూర్ణ సంస్థని ముందు వరుసలో చెప్పుకోవచ్చు. అలాంటి సంస్థలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు మీద చాలా బాధ్యతలుండేవి. మొట్టమొదటి బాధ్యత అక్కినేని నాగేశ్వరరావుని హీరోగా నిలబెట్టడం. రెండవది పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడం. మూడవది అప్పటి నిర్మాణ సంస్థల పోటీని తట్టుకుని తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకోవడం. ఈ మూడు బాధ్యతల్ని నిర్వహించడంలో నూరు శాతం విజయం సాధించారు మధుసూదనరావుగారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే దుక్కిపాటి వారికి కథలంటే మక్కువ. కథనం మీద ఆసక్తి, కొత్తదనం కోసం తపన. కథలు సమకాలీన సమాజాన్ని హత్తుకోవాలి. వాటిని అందంగా చూపించాలి. ఈ అన్వేషణలోంచి పుట్టుకొచ్చిందే మాంగల్యబలం. ఆ రోజుల్లో సంచలన విజయం సాధించిందీ చిత్రం!
మధుసూదనరావు గారికి కథ బాగా నచ్చింది. ముందు ఆత్రేయగారికి చెప్పారు. ఆత్రేయ హాస్య చతురుడు. ఒక్క మాటలో 'మీరు బాల్య వివాహాల్ని పోత్సహిస్తున్నారా!' అంటూ నవ్వి ఊరుకున్నాడు. ఇది మధుసూదనరావుగార్ని గాయపరిచింది. కథ ఏం చెబుతున్నామన్నది ఎంత ముఖ్యమో ఎంత గొప్పగా చెబుతున్నామన్నదీ అంతే ముఖ్యం అని నమ్మే వ్యక్తి ఆయన. వెంటనే డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గార్ని పిలిపించారు. కథ లైను చెప్పారు. ఆదుర్తికి మెలోడ్రామా అంటే మోజు. అలాంటి కథలంటే ప్రాణం పెడతారు. అలానే ఈ కథలో కావాల్సినంత మెలోడ్రామా వుంది. రసవత్తరమైన సన్నివేశాలున్నాయి. మానవ సంబంధాల్లోని మాధుర్యం కావల్సినంత కనిపిస్తోంది. అంతే! కథ మీద కూర్చున్నారు. ఆసక్తికరంగా చెప్పడానికి అహోరాత్రులు శ్రమించారు. కథ తృప్తికరంగా వచ్చింది. గర్వంగా నిట్టూర్చారు మధుసూదనరావుగారు.
నటీనటుల ఎంపిక
ఆస్థాన కళాకారుడు అక్కినేని ఉండనళుఉన్నాడు. హీరో పక్కన హీరోయిన్ చిన్న ఆర్టిస్ట్ గాని, ఓ మోస్తరు ఆర్టిస్టు గాని అయితే తేలిపోతుంది అనుకున్నారు. కథలో కీలక మలుపులో కనిపించే పాత్రలకు ఒక ఇమేజ్ ఉండాలి. అదీ అక్కినేని సరసన సావిత్రిలాంటి సహజనటి ఉంటేనే ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. లేకపోతే జనం తిరస్కరించే ప్రమాదం ఉందనే నిర్ణయానికి వచ్చాక సావిత్రిని హీరోయిన్గా అనుకున్నారు. నిజానికి మాంగల్యబలం సినిమా సమయంలో సావిత్రి చాలా బిజీగా ఉంది. అయినా అక్కినేని తన అభిమాన నటుడు. తనతో కలిసి నటించడమంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే కష్టమైనా ఇష్టంగా ఒప్పుకుంది. సావిత్రి తండ్రి పాత్రలో యస్వీ రంగారావు, అతని భార్యగా సూర్యకాంతం, నానమ్మ పాత్రలో కన్నాంబ, మేనత్త పాత్రలో జి.వరలక్ష్మి, సపోర్టింగ్ పాత్రల్లో రాజసులోచన, రేలంగి. ఇలాంటి తారాగణం అంతా అందమైన కళాతోరణంలా అనిపిస్తుంది. మధుసూదనరావు గారికి పాత్రల్లో ఇమిడిపోయే నటుల్ని చూస్తే సరదా. అందరూ ఫ్రేము నిండుగా అందంగా కనిపించాలి. అందంగా నటించాలి. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కనిపించాలని, ప్రేక్షకులు చూపుమరల్చకుండా ఉండేలా నటీనటులు తమ నటనతో కట్టిపడేయాలని చెబుతుండేవారు. మధుసూదనరావు గారికి మరో అలవాటు కూడా వుంది. తన సినిమాల్లో ప్రారంభంలో ఓ అందమైన పాప వుంటుంది. ప్రేక్షకుల్ని సినిమావైపు తిప్పుకొనేందుకు ఇలాంటి పాత్రలు దోహదపడతాయి. ఇక అందరూ సినిమా చూడ్డంలో నిమగమై పోతారనేది ఆయన నమ్మకం.
సింగిల్ కార్డు సినిమా
అన్నపూర్ణ సంస్థ అనేసరికి ఆత్రేయ గారుంటారు. ఈ సారి ఆత్రేయ గారిపై దుక్కిపాటి అలక బూనారు. ఆత్రేయ సంగీతంలో మాస్టరు. మెలోడీకి ప్రాణం పెడతాడు. అయితే ఆయన చేత పనిచేయించుకోవడం తెలిసుండాలి. ఆయన చేసిన సినిమాలన్నిటికీ ఆణిముత్యాల్లాంటి పాటలు అందించాడు ఆత్రేయ. ఈ చిత్రంలో పాటలన్నీ అలాంటివే. 'హాయిగా ఆలూమగలూ కాలం గడపాలి... వెయ్యేళ్లు మీరనుకూలంగా ఒకటై బతకాలి'. కథలో కీలకమైన సన్నివేశానికి సుశీల, ఉడుత సరోజిని పాడిన పాట ఇది. (బొమ్మలపెళ్ళిలో నిజమైన పెళ్ళి కూతురు ఉంటుంది. కూతురు చావుబతుకుల మధ్య ఉండగా జరిపించిన పెళ్ళి (బాల్య వివాహం) సందర్భంలో వచ్చే పాట ఇది. ఆత్రేయ గారన్నది నిజమే!
యస్వీఆర్, సూర్యకాంతం కుటుంబంతో తిరుపతికి వెళతారు. అది తెలుసుకుని అక్కినేని కూడా తిరుపతి వెళతాడు. తిరుపతి వాతావరణాన్ని తలపింపజేసే సెట్లోనే చిత్రీకరించిన పాట 'తెలియని ఆనందం...నాలో కలిగినదీ ఉదయం...పరవశమై పాడే నా హృదయం' ఈ పాట సుశీల చాలా మధురంగా పాడారు. ఈ పాటలో అందమైన ముఖంపై అల్లరిచేస్తున్న ముంగురులను సవరించుకుంటూ కనిపించే సావిత్రి రూపం ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ పాటను అంత గొప్పగా ట్యూన్ చేశారు వేణు. మరో పాట 'ఆకాశవీధిలో అందాల జాబిలి వయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే'. ఆ రోజుల్లో పెద్ద హిట్ సాంగ్. ఘంటసాల సుశీల పాడారు. ఇలాంటి ప్రేమగీతాన్ని శ్రీశ్రీ ఇంత అందంగా రాస్తాడని ఎవరూ ఊహించలేదు. మధుసూదనరావు రాయించుకున్నారు. నాలుగవది అక్కినేని, సావిత్రి (చంద్రం, సరోజ) విడిపోయిన తరువాత చిత్రీకరించిన పాట 'పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం... విషమాయె మా ప్రేమా...విధియె పగాయె' ఘంటసాల, సుశీల పాడిన ఈ పాటని శ్రీశ్రీ ఎంతో గొప్పగా రాశాడు. అయిదోపాట 'సావిత్రి తను ప్రేమించింది తన బావనే అని అతనితోనే తన చిన్నప్పుడు పెళ్ళయిందని తెలుసుకున్నప్పుడు పాడుకున్న పాట. 'వాడినపూలే వికసించెలె', చెరవీడిన హృదయాలు పులకించెలే. ఈ పాట కూడా శ్రీశ్రీ గారే రాశారు. ఘంటసాల, సుశీల పాడారు. అక్కినేని, సావిత్రిపై చిత్రీకరించారు. సినిమా విజయానికి శ్రీశ్రీ పాటలు, స్వర కల్పన, సుశీల ఘంటసాల యుగళ గీతాలూ, సోలో గీతాలూ చాలా వరకూ సహకరించాయి. సినిమాని విజయపథంలో నడిపించాయి.
కథ-కమామీషు
ఒక సంపన్న కుటుంబం. ఆ కుటుంబానికి పెద్దదిక్కు కన్నాంబ. కొడుకు యస్వీఆర్, కోడలు సూర్యకాంతం, కూతురు జి.వరలక్ష్మి. కూతురు ఒక పేదింటివాడ్ని ప్రేమించి పెళ్ళి చేసుకొని కుటుంబానికి దూరమవుతుంది. ఆమె కొడుకే చంద్రం హీరో. ఒకసారి కూతుర్ని చూడ్డానికి వస్తుంది కన్నాంబ. కూతురు మంచాన పడుతుంది. అన్న కూతురు సరోజ చంద్రం ఆడుతూపాడుతూ తిరుగుతుంటే మురిసిపోతుంది వరలక్ష్మి. వాళ్ళకు పెళ్ళి జరిపించి తన చివరికోరిక తీర్చమంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్ళి జరిపిస్తుంది కన్నాంబ. యస్వీఆర్‌కు ఈ విషయం తెలిసి ఉగ్రుడై పోతాడు. తల్లి సూర్యకాంతం సరోజ మెడలో ఉన్న తాళిని తీసి విసిరేస్తుంది. అది రమణమూర్తి జాగ్రత్తగా దాస్తాడు. తల్లి చనిపోయే ముందు ఈ నిజం చెబుతుంది. తన మేనమామ కూతురుని వెతుక్కొంటూ వెళతాడు చంద్రం. మధ్యలో సూర్యకాంతం రేలంగికి తన కూతురునిచ్చి పెళ్ళి చేయాలనుకోవడం, రేలంగి రాజసులోచనని ప్రేమించడం, చంద్రం, సరోజల ప్రేమను అపార్థం చేసుకున్న కన్నాంబ సరోజకి చిన్నప్పుడే పెళ్ళయిందని గుర్తు చేయడం, అన్న దాచిపెట్టిన తాళిబొట్టు చూసి తన ప్రేమను తలచుకుంటూ కుంగిపోవడం, ఆ విషయం తెలిసి యస్వీఆర్, సరోజ, చంద్రంలను తుపాకీతో కాలుస్తుండగా కన్నాంబ అడ్డుపడి యస్వీఆర్ సూర్యకాంతానికి కనువిప్పు కలిగించడంతో కథ సుఖాంతమవుతుంది. ఇదే మాంగల్యబలం! కథను చివరి ఫ్రేము వరకూ నడిపించడంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు వందశాతం విజయం సాధించాడు. మధుసూదనరావు గారి స్క్రీన్‌ప్లే కూడా సినిమాని ఏదో తెలియని ఆనందంలోకి తీసుకుపోయింది. కథని కొత్తదనంతో చూపించడంలో ఆరితేరిన వ్యక్తి ఆదుర్తి.
నటన నిలబెట్టింది
అక్కినేని నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ సన్నివేశాల్లో ముఖ కదలికలు మార్చడంలో కొట్టిన పిండి. అయితే సావిత్రి (సరోజ)తో ప్రణయ సన్నివేశాల్లో చాలా అందంగా కనిపించాడు. విశేషించి చెప్పుకోవాల్సింది సావిత్రి పాత్ర. ప్రేమలో ఒదిగిపోయిన సన్నివేశాల్ని ఎంత గొప్పగా పండించిందో!. 'తెలియని ఆనందం... నాలో కలిగినదీ ఉదయం పాటలో', 'ఆకాశవీధిలో అందాలజాబిలి' పాట చిత్రీకరణలో సావిత్రి పెదవి విరుపులూ, కొంటె నవ్వులూ ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుంటాయి. 'ఆకాశ వీధిలో అందాల జాబిలి' ఎంతో క్రేజ్ ఉన్న పాట. ఆ రోజుల్లో పెళ్లి సమయాల్లో పెళ్లి పందిళ్ళలో ఇదే పాట వినిపించేది. ఇప్పటికీ ఎంతో మంది నోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సావిత్రి కాస్ట్యూమ్స్. కొన్ని సంవత్సరాలపాటు అదో ట్రెండ్‌గా నిలిచాయి. ప్రేక్షకులు ఈ సినిమాను ఒకటికి పదిసార్లు సావిత్రిగారికోసమే చూసేవారు. ఇక రేలంగి, రాజసులోచన, యస్వీఆర్ సూర్యకాంతం నటన గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? వాళ్ళు ఏ పాత్ర చేసినా పాత్రలకు ప్రాణం పోసినట్లు ఉంటుంది.
- ఇమంది రామారావు
9010133844