ఇంటా.. బయటా.. ఎక్కడ కొంచెం వాతావరణం వేడెక్కినా... ఉద్రిక్తంగా మారినా...ఇబ్బందికరంగా తయారైనా... వినిపించే మాట 'సర్దుకుపోవాలి'. బస్సులోనో, రైల్లోనో రద్దీగా వున్నప్పుడు...'కాస్త సర్దుకోమ్మా...పెద్దదాన్ని. అంతసేపు నిలబడి ప్రయాణం చేయలేను' అన్న అర్ధింపు వినిపిస్తుంది. అన్నకో, తమ్ముడికో పండక్కి కొత్తబట్టలు కొనిపెట్టినప్పుడు చిన్నబుచ్చుకున్న ఆడపిల్లకు...'వాళ్లకంటే తెలీదు. నువ్వు ఆడపిల్లవు. అర్థం చేసుకొని సర్దుకుపోవాలమ్మా... అన్నిటికీ పోటీ పడితే ఎక్కడి నుంచి వస్తాయి' అన్న హితోక్తులు తల్లిదండ్రుల నోటెంట వస్తుంటాయి. కుటుంబమంతా కలిసి భోజనం చేసేప్పుడు ముందుగా భర్తకు, తర్వాత మగపిల్లలకు కొసరి కొసరి వడ్డించిన ఇల్లాలు తర్వాత మిగిలిన అడుగూ బొడుగూ కూరతో సర్దుకుపోతుంది. ఆమెకు పసితనం నుంచీ అమ్మానాన్నలు నూరిపోసింది అదే మరి. ఈ సర్దుకోవడం అనే మాట కొన్ని సందర్భాల్లో కొద్దిపాటి మార్పులకు గురవుతుంటుంది. ఎప్పుడూ జంట కవుల్లా కలిసి మెలిసి మెలిగే నేస్తాల మధ్య...వచ్చిన భేదాభిప్రాయాలు చిలికి చిలికి పెద్ద గొడవకు...కొట్లాటలకు దారితీస్తుటాయి. అప్పుడు ఇరువురి శ్రేయోభిలాషులు రంగ ప్రవేశం చేసి 'అర్రే...అలా కొట్టుకుంటే ఎట్లా.సర్దుకుపోవాలి కానీ' అని సర్దిచెప్తుంటారు. చిలకా గోరింకల్లా వుండే భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు వచ్చాయీ అంటే... మాటా మాటా పెరగాల్సిందే. అంతా అయ్యాక ...పెద్దమనుషులు రాకా మానరు. సర్దుకుపొమ్మని సలహా ఇవ్వకా మానరు.
కుటుంబాల్లోనే కాదు. రాజకీయ పార్టీల్లోనూ సర్దుకుపొమ్మనే మాట తరచూ వినిపిస్తుంటుంది. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, పదవుల పంపకం, నిధుల విడుదల..వంటి కీలక సమయాల్లో హై కమాండ్ చెప్పే మాట 'సర్దుకుపొమ్మనే'. రక్త సంబంధీకుల మధ్య వచ్చినట్టే నేతల నడుమ కూడా గొడవలు వస్తూనే వుంటాయి. భేదాభిప్రాయాలతో మొదలై కొట్లాటల వరకూ వెళ్తున్న ఘటనలు కోకొల్లలు. ఒక పార్టీ లోనే ఒకరు ఒక మాటంటే ... మరొకరు దానికి విరుద్ధమైన మాట అంటుంటారు. మీడియా వాళ్లకు పండగే పండగ. అటువంటప్పుడే అనుభవజ్ఞులైన నేతలు రంగ ప్రవేశం చేసి సర్దుకు పొమ్మని నచ్చచెప్తుంటారు. అవే పత్రికల్లో పతాక శీర్షికలుగా అవతారమెత్తుతుంటాయి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకే పార్టీలోని ఒక నేత ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు పెట్టే ప్రకటనలు చేస్తాడు. మరో నేత ప్రజలను సర్దుకు పొమ్మంటాడు. బిజెపి అధికారంలోకి వచ్చాక నేతల నాలుకలు రెండుగా చీలిపోయాయి. ఒక నాలుక మతాన్ని తిట్టి పోస్తుంది. వారి ఆహారపు అలవాట్లను, వారి సంస్కృతిని తప్పుపడుతుంది. మరో నాలుక సర్దుకు పొమ్మంటుంది. ఎన్నికలకు ముందు ఓటర్ల మధ్య చిచ్చు పెట్టడం, ఎన్నికల తరువాత సర్దుకుపొమ్మని సుద్దులు చెప్పటం లేటెస్ట్ ట్రెండ్.