మీకు కంగారూలు అంటే చాలా ఇష్టం కదా. రెండు కాళ్ల మీద గెంతుతూ నడుస్తాయి. అందుకే మీకు అవంటే ఇష్టం. వాటిలాగే గెంతే బుల్లి జీవుల్ని చూశారా? ఇదిగో మన అరచేతిలో ఇమిడి పోయే ఈ జీవి పేరు జెరొబా. ఇవి ఎక్కువగా ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసిస్తాయి. మనం గమనించలేనంత వేగంగా ఇవి బొరియల్లోకి వెళ్లి దాక్కుంటాయి. ఇవి చాలా తెలివైనవి. కొన్ని జెరొబాల చెవులు చాలా బారుంటాయి. ఇవి కొన్ని గ్రాముల బరువు మాత్రమే తూగుతాయి. వాటి గురించి మరిన్ని వివరాలు..
- ఉత్తర ఆఫ్రికా, ఆసియాలలో ఎక్కువగా జీవిస్తాయి. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, చైనా, మంచూరియాల్లో కనిపిస్తాయి.
- కంగారూల్లా రెండు కాళ్లతో గెంతుతూ పరుగెడతాయి. పిడికెడంత కూడా లేని ఈ జీవులు గంటకు 24 కిలోమీటర్ల వేగంతో పరుగెట్టగలవు.
- వాటి తోక శరీరానికన్నా పొడుగ్గా ఉంటూ శరీరాన్ని రెండు కాళ్ల మీద బ్యాలెన్స్ చేసేందుకు ఉపయోగపడుతుంది.
- శత్రువుకు చిక్కకుండా జిగ్‌జాగ్ (రంపపు పళ్ల) వరసలో కదులుతాయి.
- కొన్ని అడుగుల దూరం వరకు గెంతగలవు.
- ఆరేళ్ల పాటు జీవించే ఈ జీవుల ప్రధాన శత్రువు గుడ్లగూబ.
- రాత్రుళ్లు బొరియల్లోంచి వచ్చి ఆహారం కోసం వెతుకుతాయి.
- ఎక్కువగా మొక్కల్ని తినే ఇవి వాటికి ఎదురైన కీటకాల్ని లాగిస్తాయి.
- ఆహారం ద్వారానే శరీరానికి కావాల్సిన నీటిని తీసుకుంటాయి.
- విత్తనాలను తినవు. ఆహారాన్ని నిల్వ చేసుకోవు.
- చురుకైనా వినికిడి శక్తి వీటికి ఉంటుంది.
- ఎడారి ఇసుక రంగును పోలి వాటి శరీర ఛాయ ఉంటుంది.
- అవి ఒంటరిగానే జీవిస్తూ, అవి ఉండేందుకు నాలుగు రకాల బొరియల్ని తయారు చేసుకుంటాయి.
- రాత్రుళ్లు ఆహార వేటకు, ఎండ నుంచి తలదాచుకునేందుకు తాత్కాలికంగా రెండు. వేసవి, చలికాలాల్లో ఉండేందుకు రెండు శాశ్వత బొరియల్ని రూపొందించుకుంటాయి.
- శత్రువులకు చిక్కకుండా తప్పించుకుపోయేలా బొరియల నిర్మాణం ఉంటుంది.
- డస్ట్ బేతింగ్ (దుమ్ము స్నానం) ద్వారా అవి సంకేతాల్ని అందించుకుంటాయి. చిన్న చిన్న శబ్దాలను సృష్టించి మాట్లాడుకుంటాయి.
- 33 రకాలున్న వీటిలో పిగ్మీ జెరోబా చిత్రమున్న రష్యన్ స్టాంప్‌ను 1985లో విడుదల చేశారు.
- రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ జెరోబాను తమ యుద్ధ మస్కట్‌గా ఉపయోగించింది.
- మంకీ ఫాక్స్ సంక్రమింపజేస్తాయనే కారణంతో వీటిని పెంచుకునేందుకు, దేశంలోకి తీసుకొచ్చేందుకు అమెరికా అనుమతి ఇవ్వదు.