- నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు
ప్రజాశక్తి- యంత్రాంగం
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు, సిపిఎస్ రద్దు, పిఆర్సి అమలు, కాంట్రాక్టు, అవుట్్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ శుక్రవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పలు జిల్లాలో నిరసనలు చేపట్టారు.
గుంటూరులోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు ఇరిగేషన్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఎపిఎన్‌జిఒ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.వి.రామిరెడి మాట్లాడారు. అంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతి రాజ్ మినిస్టీరియల్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కూచిపూడి మోహనరావు మాట్లాడారు. సత్తెనపల్లి, రాజుపాలెం, ప్రత్తిపాడు, రేపల్లె, తెనాలి తదితర ప్రాంతాల్లో తహశీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జెఎసి తూర్పుకృష్ణా కన్వీనర్ ఉల్లి కృష్ణ, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.లెనిన్‌బాబు, ఎస్టియు జిల్లా అధ్యక్షులు కొమ్ము ప్రసాద్, తూర్పుకృష్ణా జెఎసి కన్వీనర్ దారపు శ్రీనివాస్, యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.ఎ.ఉమామహేశ్వరరావు మాట్లాడారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
విజయనగరంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం మధ్యాహ్నం భోజన సమయంలో కార్యాలయాల వద్ద నిరసన చేపట్టారు. విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద, నెల్లిమర్ల, డెంకాడ, కురుపాం, దత్తిరాజేరు, చీపురుపల్లి, గజపతినగరం, పార్వతీపురం, కొత్తవలస, జామి, ఎస్.కోట, బలిజిపేట, సాలూరు, బొబ్బిలి, తదితర మండలాల్లో ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిరసనలు తెలిపారు.
విశాఖ జిల్లా కేంద్రంలోని వివిధ శాఖల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎన్‌జిఒ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.ఈశ్వరరావు, ఎస్.సత్తిబాబు ఆధ్వర్యాన జిల్లా కలెక్టరేట్ ఆవరణలో మధ్యా హ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాఠశాలల వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. అరకులోయ, డుంబ్రి గుడ మండల తహ శీల్దారు కార్యాలయాల వద్ద, పాడేరులో ఐటిడిఎ కార్యాల యం ముందు ధర్నాలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆర్డిఒలో కార్యాలయం ధర్నా చేశారు. యర్రగొండపాలెంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. శింగరాయకొండలో తహశీల్దారుకు వినతి పత్రం ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
