* 34 మందికి గాయాలు
* నలుగురి పరిస్థితి విషమం
* వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి కురసాల ఆగ్రహం
ప్రజాశక్తి- కాకినాడ రూరల్, క్రైం:
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్లో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టిసి బస్సును లారీ ఢీకొనడంతో 34 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ప్రయాణికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
రాజోలు డిపోకు చెందిన ఆర్టిసి సూపర్ లగ్జరీ బస్సు గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో 36 మంది ప్రయాణికులతో మలికిపురం నుంచి విశాఖపట్నం బయలుదేరింది. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్ చేరుకుంది. ఈ సమయంలో కాకినాడ పోర్టు నుంచి బొగ్గు లోడుతో సత్తుపల్లి వెళ్తున్న లారీ... బస్సు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. దీంతో, ఆర్టిసి బస్సు 50 మీటర్ల దూరం ఎగిరి పడి బోల్తాపడడంతో 34 మంది గాయపడ్డారు. వారిలో విశాఖకు చెందిన బత్తిన విజయ కుమారి, ఆమె కుమారుడు శ్యామ్, గాజువాకకు చెందిన ఫాతిమా, విశాఖకు ఏంజిలీనాలకు తీవ్ర గాయాల య్యాయి. వీరందరినీ కాకినాడ జిజిహెచ్‌కు తరలించారు.
క్షతగాత్రులు వీరే...
తూర్పుగోదావరి జిల్లా కె.గంగవరం మండలం కోటిపల్లి సమీపంలోని దంగేరు గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుక్కల వెంకట్రావు, కుక్కల సీతారత్నం, ఎం.రషీద్, సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన చొప్పల స్టాలిన్, మలికిపురం మండలం బట్టేలంకకు చెందిన పెచ్చెటి మార్కండేయులు, విశాఖ జిల్లా కొత్త వెలగాడకు చెందిన వంగలపూడి సంతోష్, విశాఖకు చెందిన మణికంఠ, రాజేష్, పాయకరావుపేటకు చెందిన సిహెచ్‌విఎస్.ప్రసాద్ (కండక్టర్), ఆనందపురానికి చెందిన ఎద్దు అచ్చిబాబు, మలికిపురానికి చెందిన నల్లి ప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకు చెందిన యిర్రింకి సాయికుమార్, విశాఖకు చెందిన లంక జ్యోతి, మామిడికుదురు మండలం కొమరాడకు చెందిన చింతా సత్యనారాయణ, మలికిపురానికి చెందిన సాకే రాజు, పార్వతీపురానికి చెందిన ఎవి.రమణ, రాజోలుకు చెందిన ఎస్.మేరీ, రాజోలు మండలం చింతలపల్లికి చెందిన యడ్ల కుమారి, సోంపల్లికి చెందిన కె.విజయదుర్గ నాగిని, మలికిపురానికి చెందిన బళ్ల సురేష్ సహా పలువురు గాయపడ్డారు.
వివాహానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ...
విశాఖకు చెందిన బత్తుల విజయకుమారి, ఆమె భర్త సంపత్ కుమార్, కొడుకు కేరీశ్యామ్ మూడు రోజుల క్రితం రాజోలులోని బంధువుల వివాహానికి వచ్చారు. తిరిగి తమ సొంత ఊరు విశాఖ వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. విజయకుమారి తలకు తీవ్రగాయమైంది. ఎడమ చేయి నుజ్జయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె కుమారుడు కేరీ శ్యామ్ కుడి చేయి నుజ్జయింది. దీంతో, బాధను తట్టుకోలేక రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది.
ఫాతిమ నోటిలోకి గాజు పెంకులు
బస్సు పక్కకు బోల్తాపడటంతో కిటికీ అద్దాలు పగలిపోయాయి. బస్సులో కిటికీ పక్కన కూర్చున్న మామిడికుదురుకు చెందిన ఫాతిమ నోటిలోకి గాజు పెంకులు వెళ్లిపోయాయి. వైద్యులు ఎక్స్‌రే, స్కానింగ్ చేశారు. అవసరమైతే ఆపరేషన్ చేసి గాజు పెంకును తొలగిస్తామని తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి కురసాల ఆగ్రహం
జిజిహెచ్‌లోని క్షతగాత్రులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యమందించాలని ఆదేశించారు. ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రోడ్డు ప్రమాద కేసులు వచ్చినప్పుడు సమయానికి స్పందించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ అత్యవసర విభాగం వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్యులు స్పందించడంలేదంటూ అంబులెన్స్ సిబ్బంది తనకు ఫోన్ చేశారని తెలిపారు. వెంటనే తాను సిఎంఒకి, అత్యవసర విభాగానికి ఫోన్ చేసినా పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత క్షతగాత్రులు మంత్రి మాట్లాడతారంటూ సిబ్బందికి ఫోన్ ఇచ్చినా తీసుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికే స్పందించకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మరోసారి పునరావృతమైతే చర్యలు తప్పవని సూపరింటెండెంట్ రాఘవేంద్రరావును హెచ్చరించారు. క్షతగ్రాతులను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పరామర్శించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి నాని ఆరా
ఆర్టిసి బస్సు బోల్తా ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆరా తీశారు. ఆర్టిసి, రవాణా శాఖ అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.