- జిఒ 85ను రద్దుచేయాలి
- విద్యార్థి జెఎసి డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
మంచి విద్యను బోధించడమంటే మాధ్యమాన్ని మార్చి చేతులు దులుపుకోవడమా అని రాష్ట్రప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ప్రశ్నించింది. పాఠశాలల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమమే ఉండాలని రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జిఒ 85ను రద్దు చేయాలని వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఎంబి విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు రమేష్ (ఎస్ఎఫ్ఐ), రామకృష్ణ, (పిడిఎస్యు), రాజేష్ (పిడిఎస్యు) మాట్లాడుతూ పాఠశాలల్లో రెండు మాధ్యమాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమాంతరంగా రెండు మాధ్యమాలు కొనసాగించవచ్చని, కానీ, నిర్బంధ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు 27లక్షల మంది విద్యార్థులు తమ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మాధ్యమం మారాల్సి ఉంటుంద న్నారు. ఇకపై తెలుగు మాధ్యమం పాఠ్యపుస్త కాలు దొరకవని, వీటిలో పరీక్షలు జరగవని తెలిపారు. ఇది పేదల పట్ల శరాఘాతమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తున్నా యని, రాష్ట్రంలో తీరని అన్యాయం జరుగు తోందని అన్నారు. విద్యా హక్కు చట్టం, నూతన విద్యావిధానం, రాష్ట్రప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ మాతృ భాషలో 8వ తరగతి వరకు విద్యాబోధన జరగాలని చెబుతున్నాయని వివరించారు. ప్రభుత్వం ఈ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రెండు మాధ్యమాలు పునరుద్ధరించే వరకూ అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యారంగ నిపుణులు, భాషాభిమానులు, దళిత, మైనార్టీ వర్గాలు విశాల ప్రాతిపదికన పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు భగవాన్ దాస్, సహాయ కార్యదర్శులు ఎస్ నరసింహా, కె ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మాధ్యమం మారిస్తే మంచి విద్యా?
