- గుట్టుచప్పుడు కాకుండా తగలబెట్టిన ఘాతుకం
ప్రజాశక్తి-రామకుప్పం, కుప్పం
అడవి జంతువుల నుండి పంటలను రక్షించుకునేం దుకు రాత్రివేళ కాపలాగా వెళ్లిన ఓ రైతు వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలకు బలైపోయాడు. ఈ విషాదం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో గురువారం వెలుగు చూసింది. స్థానికులు,పోలీసుల కథనం మేరకు..మండల పరిధిలోని ననియాల గ్రామానికి చెందిన రవి (47) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మంగళవారం రాత్రి రవి జంతువుల బారి నుండి తన పొలాన్ని కాపాడుకోవడానికి రాత్రి కాపల వెళ్లాడు. తెల్లవారినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. గ్రామసమీపంలోని పొలాల వద్ద రక్తపు మడుగులు కనిపించడంతో ఆందోళనకు గురైన రవి భార్య మంగమ్మ రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. సమీప స్థలంలో జంతువులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్తు తీగలకు రక్తపు మరకలు ఉండడంతో పలు వురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో ననియాల తాండాకు చెందిన కుమార్ నాయక్, చిన్నస్వామినాయక్, స్వామినాయక్, బద్దేనాయక్లు జంతువుల కోసం విద్యుత్ తీగలు అమర్చుతుంటారని, ఆ తీగల్లో రైతు రవి చనిపోతే మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా పరిసరాల్లో రక్తపు మరకలు ఉండటంతో రవి విద్యుత్ షాక్ వల్ల చనిపోయాడా? లేదా హత్య చేసి చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాస్పద మృతి కేసులో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని కుప్పం రూరల్ సిఐ కృష్ణమోహన్, ఎస్ఐ ప్రసాద్‌రావు, పోలీసు సిబ్బంది పరిశీలించి పలు ఆధారాలను సేకరించారు.
వేటగాళ్ల ఉచ్చుకు రైతు బలి
