- కారణాలపై అధ్యయనం పారదర్శకత కోసమే : సిఎం జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
రాష్ట్రంలో అవినీతి నిర్మూలన కోసం ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) తో ఒప్పందం చేసుకుంది దీనిలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో పరిశీలన జరిపి అవినీతికి కారణమవుతున్న అంశాలను ఐఐఎం గుర్తించి నివేదిక ఇస్తుంది. ఈ ఒప్పందంపై ఐఐఎం ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి, ఎపి ఎసిబి చీఫ్ విశ్వజిత్ గురువారం సిఎం సమక్షంలో సంతకాలు చేశారు. అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించడంతోపాటు నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలనూ ఐఐఎం సూచిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మూడో వారం నాటికి ఈ మేరకు నివేదిక ఇవ్వనుంది. ఒప్పందం ప్రకారం మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల అభివృద్ధి కార్యాలయాలు, పట్టణ, మున్సిపాలిటీ, ప్లానింగ్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా అన్ని ప్రభుత్వ శాఖల్లో సమగ్ర అధ్యయనం చేయనుంది. అవినీతికి ఆస్కారమున్న అంశాలను అధ్యయనం చేయడంతోపాటు, ఆయా శాఖల్లో నిర్మాణాత్మక మార్పులతో అవినీతి నిర్మూలనకు తీసుకోవాల్సిన వ్యూహాలను ప్రభుత్వానికి నివేదించనుంది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలో మొదటి నుండి అవినీతి లేకుండా నిర్వహించేందుకు సూచనలు చేయనుంది. పరిపాలనలో ఇప్పుడున్న లోపాలను గుర్తించడంతోపాటు బలమైన పరిపాలనా వ్యవస్థను సూచించనుంది. ఉన్న వనరులను సమర్థవంతంగా వాడుకోవడం, సామర్థ్యాన్ని పెంచడం మెరుగైన ఫలితాలు రాబట్టడం ఎలా అనే అంశాలను నివేదికలో పొందుపరచనుంది. దీనిపై సుందరవల్లి నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు అవకాశం కల్పించడం తమ సంస్థకు లభిస్తున్న గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు.
అవినీతి నిర్మూలనతో పేదలకు లబ్ధి : సిఎం
అవినీతి నిర్మూలన వల్ల అంతిమంగా పేదలకు లబ్ది కలుగుతుందని సిఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ చేరువ అవుతాయని పేర్కొన్నారు. మండల కార్యాలయానికి వెళితేనే పనులు అవుతాయనే ఉద్దేశం ఉండటంతో అవినీతికి ఆస్కారం ఏర్పడిందని అన్నారు. ఈ నేపథ్యంలో అధికార వికేంద్రీకరణ చేసి గ్రామ సచివాలయాలను తీసుకొచ్చామని చెప్పారు. జనవరి ఒకటోతేదీ నుండి ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. గతంలో మండల కార్యాలయాల్లో ఏ పనులు జరిగేవో అవన్నీ ఇప్పుడు సచివాలయాల్లోనే జరుగుతాయని సిఎం తెలిపారు. గ్రామ సచివాలయం, తహశీల్దార్ కార్యాలయం, కలెక్టరేట్, రాష్ట్ర సెక్రటేరియట్ అన్నీ అనుసంధానమై ఉంటాయని తెలిపారు. దీనికోసం ఐటి నెట్వర్కు ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని కూడా పరిశీలించాలని ఐఐఎం అధికారులను సూచించారు. వాలంటీర్లు, సచివాలయాల పనితీరుపై సమర్థవంతమైన పర్యవేక్షణ ఉంటుందని సిఎం స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, డిజిపి గౌతం సవాంగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
అవినీతి నిర్మూలనకు ఐఐఎంతో ఒప్పందం
